రివ్యూ: క‌వ‌చం

Kavacham Sameeksha
Kavacham Sameeksha

Kavacham sameeksha

తెలుగు360 రేటింగ్ 2.25/5

థ్రిల్ల‌ర్ సినిమాలు తీసి మెప్పించ‌డం క‌త్తి మీద సాము. ద‌ర్శ‌కుడు `ట్విస్టు` అనుకున్న‌ది ప్రేక్ష‌కుడికి ట్విస్టులా అనిపించ‌క‌పోయినా… ట్విస్టు వేసిన చోటే… ఆ త‌ర‌వాత మ‌లుపేంటో ప్రేక్ష‌కుడు క‌నిపెట్టేసినా… దుకాణం స‌ర్దేయాల్సిందే. ఈనాటి ప్రేక్ష‌కుడు మ‌రీ తెలివి మీరిపోయాడు. హాలీవుడ్ సినిమాల ప్రభావ‌మో ఏమో… ఓ ట్విస్టు రాగానే.. దానికి కార‌ణం ఏమై ఉంటుందా? అని ప‌ది ర‌కాలుగా ఆలోచిస్తున్నాడు. ఆ ప‌ది ర‌కాల్లో ద‌ర్శ‌కుడు అనుక‌న్న‌దీ ఒక‌టుంటే… ఆ క‌థ ముందే తేలిపోతోంది. ఆడియ‌న్ ఆశించిన దానికంటే భిన్నంగా క‌థ‌ని న‌డిపినప్పుడే థ్రిల్ల‌ర్లు నిల‌బ‌డ‌తాయి. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ చేసిన `క‌వ‌చం` కూడా థ్రిల్ల‌ర్ సినిమానే. ఇందులోనూ ట్విస్టులు, ట‌ర్న్‌లు ఉన్నాయి. మ‌రి అవ‌న్నీ ప్రేక్ష‌కుల ఊహ‌కు అంద‌నంత కొత్త‌గా ఉన్నాయా, లేదంటే… ముందే తెలిసిపోయి, తేలిపోతున్నాయా?

క‌థ‌

విజ‌య్ (బెల్లంకొండ‌) ఓ యువ పోలీస్ అధికారి. త‌న డ్యూటీ తాను సిన్సియ‌ర్‌గా చేస్తుంటాడు. ఓ అమ్మాయి (కాజ‌ల్‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న మ‌న‌సులో మాట చెప్పేలోగా.. ఆ అమ్మాయి దూర‌మైపోతుంది. ఈలోగా సంయుక్త (మెహ‌రీన్) అనే అమ్మాయి పరిచ‌యం అవుతుంది. ఓ ఆప‌ద‌లో ఉన్న సంయుక్త‌ని విజ‌య్ కాపాడ‌తాడు. అయితే అనుకోకుండా విజ‌య్ త‌ల్లి ఓ రోడ్డు ప్ర‌మాదానికి గుర‌వుతుంది. ఆప‌రేష‌న్‌కి రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కూ కావ‌ల్సివుంటుంది. అంత డబ్బు నిజాయ‌తీగా ప‌నిచేసే విజ‌య్ ద‌గ్గ‌ర ఎందుకు ఉంటుంది? అమ్మ‌ని కాపాడ‌డానికి సంయుక్త ఓ ప్లాన్ చెబుతుంది. త‌న‌ని కిడ్నాప్ చేసి, మేన‌మామ ద‌గ్గ‌ర నుంచి రూ.50 ల‌క్ష‌లు డిమాండ్ చేయ‌మంటుంది. త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో కిడ్నాప్ నాట‌కం ఆడి, త‌ల్లిని ర‌క్షించుకుంటాడు విజ‌య్‌. అయితే.. ఆ కిడ్నాప్ డ్రామానే త‌న జీవితాన్ని మ‌లుపు తిప్పుతుంది.

అదేంటి? ఆ త‌ర‌వాత ఏమైంది? అనేది సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌

క‌థ‌గా చెప్పుకుంటే.. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్‌.. ఓ థ్రిల్ల‌ర్ సినిమాకి స‌రిప‌డ స‌రంజామాతోనే ఈ సినిమా తీశాడ‌నిపిస్తుంది. ఓ నిజాయ‌తీ గ‌ల పోలీస్ ఆఫీస‌ర్ ఓ ట్రాప్‌లో చిక్కుకోవ‌డం, అందులోంచి బ‌య‌ట‌ప‌డి త‌న నిజాయ‌తీని కాపాడుకోవ‌డం అన్న‌ది `క‌వ‌చం` కోర్ పాయింట్‌. దాన్ని అలా ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెబితే బాగుండేది. కానీ… మ‌న‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగులు కావాలి క‌దా? కాస్త కామెడీ, కొన్ని పాట‌లు, హీరోయిజం బిల్డ‌ప్ చేసే ఎలివెంట్స్ ఇవ‌న్నీ ఉండాలి క‌దా? అవ‌న్నీ పేర్చుకుంటూ, పేర్చుకుంటూ అస‌లు క‌థ‌లోకి వెళ్లేస‌రికి ఆల‌స్యం చేసేశాడు. ఇంట్ర‌వెల్ ముందు గానీ క‌థ‌లో ఊపు రాదు. అక్క‌డో ప‌ది నిమిషాల పాటు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌కుండా చేశాడు దర్శ‌కుడు. `క‌థ ఇప్పుడు ఎత్తుకుందిలే` అనేస‌రికి.. అక్క‌డ మెహ‌రీన్‌ని తీసుకొచ్చి పాట పెట్టేశాడు. టెంపోని ఎక్క‌డ ఆప‌కూడ‌దో.. అక్క‌డే ఆపేశాడు. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ఆస‌క్తి రేకెత్తేదే.

ద్వితీయార్థం మొత్తం పోలీసుల‌కు దొరక్కుండా హీరో త‌ప్పించుకుంటూనే.. త‌న నిజాయ‌తీని నిరూపించుకోవ‌డం. ఆ ఇన్వెస్టిగేష‌న్ కాస్త ఇంట్ర‌స్టింగ్‌గానే ఉంటుంది. హీరోకి దార్ల‌న్నీ మూసుకుపోవ‌డంతో అందులోంచి ఎలా బ‌య‌ట‌కు వ‌స్తాడు? అనే ఆస‌క్తి రేకెత్తిస్తుంది. చిక్కుముడి వేయ‌డంలో కాదు, దాన్ని విప్ప‌డంలోనే థ్రిల్ల‌ర్ జ‌యాప‌జ‌యాలు ఆధార‌ప‌డి ఉంటాయి. ఒక‌ట్రెండు క్లూలు ప‌ట్టుకుని `ఓహో ఇలా జ‌రిగింది క‌దూ..` అంటూ.. హీరోనే ఫోన్లో విల‌న్‌తో డైలాగ్ రూపంలో చెప్పుకుంటూ వెళ్లిపోవ‌డంతో ఆ చిక్కుముడి అత్యంత పేల‌వంగా విప్పిన‌ట్టు అనిపిస్తుంది. నిజానికి ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ద‌గ్గ‌రే సెకండాఫ్ ఇలా జ‌రిగి ఉండొచ్చేమో అని ప్రేక్ష‌కుడు ఓ క‌థ‌ని ఊహిస్తాడు. దాదాపుగా అదే తెరపై చూపించేశాడు ద‌ర్శ‌కుడు. కాజల్ లాంటి పెద్ద క‌థానాయిక‌ని తీసుకున్నాం క‌దా అని.. అవ‌స‌రం లేక‌పోయినా పాట‌లు ఇరికించి, బెల్లంకొండ‌ని మాస్ హీరోగా మ‌రింత ఎలివేట్ చేయ‌డానికి క‌థ‌లో ఇమ‌డ‌క‌పోయినా.. (కిడ్నాప్ ఫైటు) కొన్ని స‌న్నివేశాల్ని అతికించి.. అస‌లు క‌థ‌లోని ఫీల్‌ని బాగా త‌గ్గించేశారు. ఇన్విస్టిగేష‌న్ చేయాల్సి తెలుసుకోవాల్సిన విష‌యాలు… హీరోకి తమ‌కు తానే ఎదుర‌వుతుంటాయి. అది.. ఈ సినిమా లో అతి పెద్ద మైన‌స్‌. అలా.. థ్రిల్లింగ్ కాస్త కాస్త త‌గ్గుతూ పోయింది.

న‌టీన‌టులు

బెల్లంకొండ శ్రీ‌నివాస్ బాగానే క‌ష్ట‌ప‌డ‌తాడు. టాలెంటెడ్ కూడా. కానీ త‌న క‌ష్టానికి త‌గిన ఫ‌లితం రావ‌డం లేదు. ఈ సినిమా కోసం బాడీ బాగానే బిల్డ‌ప్ చేశాడు. త‌న లుక్ కూడా బాగుంది. డైలాగులు చెప్ప‌డంలో మాత్రం ఇంకా ప‌రిప‌క్వ‌త రాలేదేమో అనిపిస్తోంది. కాజ‌ల్‌కి మేక‌ప్ ఎక్కువ అవుతోందో, లేదంటే ఇంకాస్త అందంగా క‌నిపించాల‌ని త‌న‌కు తానే మెక‌ప్ ద‌ట్టించేసుకుంటుందో తెలీదు గానీ… కొన్నికొన్నిసార్లు ఎబ్బేట్టుగా క‌నిపిస్తోంది. వ‌య‌సులో తాను బెల్లంకొండ కంటే ఎక్కువే అన్న విష‌యం తాను చెప్ప‌న‌వ‌స‌రం లేకుండా ప్రేక్ష‌కుల‌కు తెలిసిపోతోంది. మెహ‌రీన్ కూడా బెల్లంకొండ‌కు అక్క‌లానే ఉంది. నీల్ నితిన్ ముఖేష్ ఎంట్రీ సీన్ చూస్తే… `వీడు ఇంత తెలివైనోడా` అనిపిస్తుంది. కానీ.. త‌న పాత్ర‌ని కూడా అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు.. ఆ తెలివితేట‌ల్ని క‌త్తిరించుకుంటూ వెళ్లాడు. త‌ను కూడా ఉద్ధ‌రించిందేం లేదు. పోసాని కామెడీ ఇరిటేట్ చేస్తుంటుంది. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాణేది కూడా చిన్న పాత్రే.

సాంకేతిక వ‌ర్గం

త‌మ‌న్ త‌న‌ అవుడ్డేటెడ్ ట్యూన్ల‌న్నీ వాడుకోవ‌డానికి `క‌వ‌చం` ఉప‌యోగ‌ప‌డింది. బెల్లంకొండ మంచి డాన్స‌ర్‌. త‌న‌లో ఆ యాంగిల్‌నైనా వాడుకోవాల‌న్న ఆలోచ‌న త‌మ‌న్ కి రాలేదు. చోటా కె. ప‌నిత‌నం ప్ర‌తీ ఫ్రేములోనూ కనిపిస్తుంది. అగ్ర హీరోల సినిమాల‌కు తీసిపోని విధంగా ఫ్రేములు పెట్టాడు. ద‌ర్శ‌కుడు రాసుకున్న ట్విస్టులు ఓకే అనిపించినా… దాని చుట్టూ అల్లుకున్న క‌థ‌నంలోనే బ‌లం లేదు. డైలాగులు కూడా అత్యంత సాదాసీదాగా ఉన్నాయి.

తీర్పు

థ్రిల్ల‌ర్ సినిమాలు ఓ పొడుపు క‌థ లాంటిది. ఆ ముడి విప్ప‌డానికి ఉత్సాహం రావాలంటే… ఆ పొడుపు క‌థ కొత్త‌గా ఉండాలి. ట్విస్టులున్న సినిమా నిల‌బ‌డాలంటే.. ఆ ట్విస్టు ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ముడి విప్ప‌డంలో నేర్ప‌రిత‌నం కావాలి. ఆ విష‌యంలో తేలిపోయిన సినిమాల్లో `క‌వ‌చం` పేరు కూడా చేరిపోతుంది.

ఫినిషింగ్ ట‌చ్‌: కాపాడ‌లేని ట్విస్టు

తెలుగు360 రేటింగ్ 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com