తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా వెలిగిన గులాబీ పార్టీకి నేడు ఆవిర్భావ దినోత్సవం. అయితే, గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పార్టీలో నిశ్శబ్దం ఆవహించింది. గతేడాది వరకు అట్టహాసంగా ప్లీనరీలు, బహిరంగ సభలతో హోరెత్తిన గులాబీ శ్రేణులు, ఇప్పుడు మాత్రం కేవలం జెండా ఆవిష్కరణలకే పరిమితం అవుతున్నారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత మారిపోయిన జాతకం
పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చిన తర్వాత వచ్చిన సంక్షోభం ఒకవైపు, అధికారం కోల్పోయిన నైరాశ్యం మరోవైపు పార్టీని నీరసపరుస్తున్నాయి. క్యాడర్లో ఉత్సాహం నింపేలా అధినాయకత్వం నుంచి పెద్దగా ప్రయత్నాలు లేకపోవడంతో, ఆవిర్భావ వేడుకలు కేవలం మొక్కుబడి కార్యక్రమాల్లా సాగుతున్నాయి.
ఈ ఏడాది ఆవిర్భావ దినోత్సవం వేళ రాజకీయంగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కుటుంబం నుంచే మరో టీఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీని ప్రకటించడం బీఆర్ఎస్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తండ్రి కేసీఆర్ వారసత్వాన్ని సవాల్ చేస్తూ, పార్టీ ఆత్మను కోల్పోయిందని విమర్శిస్తూ కవిత వేసిన ఈ అడుగు.. బీఆర్ఎస్ నేతల్లో స్తబ్దతకు ప్రధాన కారణమైంది.
క్యాడర్లో కనిపించని ఉత్సాహం
సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడంతో పార్టీ హైకమాండ్ రక్షణ ధోరణిలో పడిపోయిందని, అందుకే ఈ సారి వేడుకలను కూడా లో-ప్రొఫైల్‌లో నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించాలని పిలుపునిచ్చినప్పటికీ, గతంలో ఉన్న ఆ ఊపు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి దిశానిర్దేశం చేస్తే తప్ప పార్టీ గాడిలో పడదని కేడర్ గట్టిగా నమ్ముతోంది. ముఖ్యంగా కవిత కొత్త పార్టీ పెట్టడం, ఆమె వెంట కొంతమంది కీలక నేతలు వెళ్తారనే ప్రచారం పార్టీలో అభద్రతా భావాన్ని పెంచింది. పార్టీ పేరు మార్పు వల్ల తెలంగాణ అనే సెంటిమెంట్ దూరమైందని భావిస్తున్న క్యాడర్, ఇప్పుడు కవిత అదే సెంటిమెంట్‌తో ముందుకు రావడం వల్ల అయోమయంలో పడిపోయారు.
అధికారం పోయిన తరవాత మరింత నిర్లిప్తత
అధికారం చేజారిన తర్వాత క్యాడర్‌ను కాపాడుకోవడంలో అధినాయకత్వం విఫలమవుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు వరుస దాడులతో పార్టీని బలహీనపరుస్తున్న తరుణంలో, ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక శక్తి ప్రదర్శనలా వాడుకోవాల్సింది పోయి, కేవలం తెలంగాణ భవన్లో సమావేశాలకే పరిమితం చేయడం పార్టీ బలహీనతను సూచిస్తోంది. అటు కేటీఆర్ నాయకత్వంపై సొంత పార్టీలోనే అంతర్గత చర్చలు జరుగుతున్న వేళ, కవిత పెట్టిన కొత్త పార్టీ బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు ఎంతవరకు గండి కొడుతుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.
పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. వారసత్వ పోరు, కుటుంబం నుంచి చీలిక, క్యాడర్లో అసంతృప్తి.. వెరసి ఈసారి గులాబీ పండుగ తన వెలుగును కోల్పోయింది. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తారు? కవిత ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అనే అంశాలే బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
