ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఫిబ్రవరి ఒకటిన కేంద్రం బడ్జెట్ పెడుతుంది. ఆ లెక్కల్ని .. ఏపీకి వచ్చే నిధుల్ని సరి చూసుకుని రాష్ట్ర బడ్జెట్ రెడీ చేసుకుంటారు. అప్పుడే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో అసలు అంశం ప్రభుత్వ ఎజెండా కాదు. వైసీపీ హాజరవుతుందా లేదా అన్నదే. జగన్ రెడ్డి తన పంతం వీడటం లేదు. హోదా ఇస్తేనే వస్తానని ప్రకటించారు. కానీ ఆయన మనసులో ఉన్న భయం వేరు. అందుకే హోదా ఇచ్చినా రారు.. ఎమ్మెల్యేలను రానివ్వరు. హోదాను స్పీకర్ ఇవ్వరు.
కానీ ఇలా అసెంబ్లీకి హాజరు కాకపోవడం అనేది చాలా సమస్యగా మారుతోంది. అరవై పని దినాల పాటు ఓ ఎమ్మెల్యే సమాచారం లేకుండా అసెంబ్లీకి హాజరైతే అనర్హతా వేటు వేయవచ్చు. వచ్చే సమావేశం నాటికి ఆ అర్హతను వైసీపీ ఎమ్మెల్యేలంతా సాధిస్తారు. మధ్యలో ఓ రోజు వీరంతా గవర్నర్ ప్రసంగానికి హాజరై ఐదు నిమిషాలు ఉన్నారు. కానీ అది బిజినెస్ కాదు అంటే సభ జరిగినట్లు కాదు. అందుకే వారి హాజరీ పరిగణనలోకి రాదని తేల్చారు. అందుకే ఇప్పుడు వారి మెడపై కత్తి వేలాడుతోంది.
అదే సమయంలో పది మందిలో ఆరుగురు ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు. వచ్చినట్లుగా దొంగ సంతకాలు పెట్టారు. వారిపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. ఎలాంటి చర్యలైనా చివరికి అనర్హతా వేటు వేసే అధికారం కూడా వారికి ఉంది. టీడీపీ వైసీపీని చావు దెబ్బ కొట్టాలనుకుంటే కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. హాజరుతో పాటు మరో ఆప్షన్ కూడా ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్న ఏకైక మార్గం కేసీఆర్ ఫార్ములాను పాటించడం. అంటే అసెంబ్లీకి వెళ్లి రిజిస్టర్ లో సంతకం పెట్టి ఐదారు నిమిషాలు కూర్చుని వచ్చేయడం. అధికారికంగా హాజరు నమోదవుతుంది. మరో అరవై పని దినాల పాటు సభకు వెళ్లకపోయినా సమస్య రాదు.
కానీ ఇలా చేస్తే వచ్చే విమర్శలను ఎదుర్కోవాలి. ప్రజలు ఇలా చేయడాన్ని సమర్థించుకునేలా చేయాలి. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి వెళ్లని .. ప్రజాసమస్యల గురించి మాట్లాడని వారికి ప్రజామద్దతు లభించడం కష్టం. జగన్ ఈగో వల్ల ఈ సమస్యను ఎమ్మెల్యేలంతా ఎదుర్కోవాల్సి వస్తోంది.


