ఈ దాడుల సంస్కృతి కూడా అభివృద్ధేనా కెసీఆర్?

అధికారంలో ఉన్నవాళ్ళందరూ కూడా నానాటికీ నియంతల్లా మారిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పే నాయకులు… ఒక సారి కుర్చీ ఎక్కాక మాత్రం వారిలో ఉన్న మరో అపరిచిత కోణాన్ని చూపిస్తున్నారు. ముందు చెప్పిన ప్రజాస్వామ్య కబుర్లన్నీ ఎటుపోతాయో తెలియదు కానీ ఎవ్వరూ ప్రశ్నించొద్దు, ఎవ్వరూ విమర్శించొద్దు…అలా చేసేవాళ్ళందరూ అభివృద్ధి నిరోధకులే అని కొత్త పాట పాడుతున్నారు. ఉద్యమ నాయకుడిని అని చెప్పుకునే కెసీఆర్ కూడా ఈ విధానాలను ఇంకాస్త కఠినంగా అనుసరిస్తున్నాడు. తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా కెసీఆర్ వైఖరి ఇలానే ఉండేది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు మాట్లాడినా కూడా వాళ్ళపైన విరుచుకుపడిపోయే వాళ్ళు కల్వకుంట్ల కుటుంబ సభ్యులు. ఇక కెసీఆర్‌కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళపై అయితే టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా దాడులకు తెగబడేలా ప్రోత్సహించాడు కెసీఆర్. అప్పట్లో కోదండరామ్‌తో సహా చాలా మంది ఇలాంటి విధానాలను చూసిచూడనట్టుగా ఉన్నవాళ్ళే.

ఇప్పడు అదే కెసఆర్ అదే దాడుల రాజకీయ మంత్రాన్ని కోదండరామ్‌కే రుచి చూపించాడు. మిర్చిరైతుల కన్నీటి కష్టాల గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వరుసగా కథనాలు వస్తూనే ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. మధ్యవర్తులకు-అధికార పార్టీ నాయకులకు మధ్య ఉండే ఆర్థిక బంధాల గురించి అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఆరుగాలం కష్టపడి పంట నష్టపోయిన రైతులతో పాటు, పంట చేతికొచ్చిన రైతులకు కూడా అన్యాయమే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే వ్యవహారమే అయినా తెలంగాణా రైతులు కాస్త ధైర్యం చేశారు. తెగించి మరీ వాళ్ళ నిరసన తెలిపారు. తెలంగాణాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా శ్రీమాన్ కెసీఆర్ వారి పాలనలో ఆనందోత్సాహాలతో అలరారుతున్నారనే భ్రమల్లో ఉండే కల్వకుంట్ల కుటుంబానికి ఇది సుతరామూ నచ్చినట్టుగా లేదు. అందుకే ఆ విషయాన్ని వీలైనంత తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల ‘మంట’ ను విపక్షాలపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణా ముద్దుబిడ్డ కోదండరాం అని కెసీఆర్ చేత సర్టిఫికెట్ అందుకున్న కోదండరాం పైకి కూడా దాడులకు తెగబడ్డారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.

ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే ఎంత అన్యాయం జరిగినా, జీవితాలు కాలిపోతున్నా కూడా తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ప్రజలెవ్వరూ కూడా కెసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, అలా మాట్లాడితే వాళ్ళు అభివృద్ధి నిరోధకులు, తెలంగాణా ద్రోహులు. అలాంటి వాళ్ళపైన దాడులు చేసి మరీ తరిమేస్తాం అనే అధికారికంగా ప్రకటించని విధానాన్ని కెసీఆర్ అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మామూలుగా అయితే కెసీఆర్‌కి రాజరికం అన్నా, ఆ హోదా అన్నా మమకారం ఎక్కువ. కానీ ఇది ప్రజాస్వామ్యం అన్న విషయం మర్చిపోతే ఎలా? కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో ఇలాంటి నిరంకుశ, నియంతృత్వ పాలనతో ముందు తరాలకు కెసీఆర్ ఏం సందేశం ఇస్తున్నట్టు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.