కొండా సురేఖ టిక్కెట్ పెండింగ్ కి కార‌ణాలు ఈ రెండేనా?

105 మంది తెరాస అభ్య‌ర్థుల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, పెండింగ్ ఉన్న ఆ కొద్దిమందిలో ఇప్పుడు అంద‌రి దృష్టీ కొండా సురేఖపై ప‌డుతోంది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలుంటే… 11 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసి… వ‌రంగ‌ల్ ఈస్ట్ టిక్కెట్ ని పెండింగులో పెట్టేశారు కేసీఆర్‌. ఇది కొండా సురేఖ నియోజ‌క వ‌ర్గం! నిజానికి, గ‌త ఎన్నిక‌ల ముందు కొండా దంప‌తులు తెరాస‌లో చేరారు. సురేఖ ఎమ్మెల్యే అయితే, ముర‌ళీ ఎమ్మెల్సీ అయ్యారు.

అయితే, గ‌త ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి ర‌త్త‌య్య‌, మ‌రో అభ్య‌ర్థిగా గ‌తంలో బ‌రిలోకి దిగిన‌ ఎర్ర‌బెల్లి దయాకర్ సోద‌రుడు ప్ర‌దీప్ రావు, మేయ‌ర్ న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌, గుండు సుధారాణి… ఇలా వ‌రంగ‌ల్ లో పేరున్న నాయ‌కులంతా వేర్వేరు సంద‌ర్భాల్లో తెరాస‌లోకి వ‌చ్చి చేరారు! అంతేకాదు, వీరంతా టిక్కెట్ల రేసులో కూడా ఉన్నారు. పోనీ, ఈ ప్ర‌ముఖులంద‌రినీ క‌లుపుకుని వెళ్లే ప్ర‌య‌త్నం కొండా దంప‌తులు చేశారా అంటే.. అదీ లేదు! ఎవ‌రి గ్రూపులు వాళ్ల‌వి అన్న‌ట్టుగా ప‌రిస్థితి త‌యారైంది. ఇది చాల‌ద‌న్న‌ట్టుగా… త‌మ కుమార్తెకు భూపాల‌ప‌ల్లి టిక్కెట్ ను కేసీఆర్ ఇస్తారంటూ కొండా దంప‌తులు ఈ మ‌ధ్య ఆశాభావం వ్య‌క్తం చేస్తున్న సంగ‌తీ తెలిసిందే. భూపాల‌ప‌ల్లి సిటింగ్ ఎమ్మెల్యే ఎవ‌రంటే… స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి! త‌మ కుటుంబంలో మూడు టిక్కెట్లు ఖాయ‌మ‌నీ… ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్ ఈస్ట్ నుంచి తామే బ‌రిలో ఉంటామంటూ ముందుగానే కొండా ఫ్యామిలీ ట‌ముకు వేసుకుంటూ వ‌చ్చింది. సో… కొండా సురేఖ టిక్కెట్ ని పెండింగ్ లో పెట్ట‌డం వెన‌క ఈ అత్యుత్సాహం ఓ కార‌ణంగా క‌నిపిస్తోంది.

రెండోదీ, అతి ముఖ్య‌మైందీ… కొండా దంప‌తులు మంత్రి హ‌రీష్ రావుతో మాత్ర‌మే అత్యంత స‌న్నిహితంగా ఉండ‌టం అనే అభిప్రాయ‌మూ వినిపిస్తోంది. వ‌రంగ‌ల్ జిల్లాలో ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏ కార్య‌క్ర‌మాలు జ‌రిగినా… ఆ కార్య‌క్ర‌మాలు హ‌రీష్ రావు వ‌స్తేనే కొండా దంప‌తులు వ‌స్తారు! మంత్రి కేటీఆర్ గానీ, ఎంపీ క‌విత‌గానీ ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా కొండా దంప‌తులు హాజ‌రు కాలేదు. ఇది కూడా కేసీఆర్ కి క‌చ్చితంగా క‌న్నుకుట్టే అంశం అన‌డంలో సందేహం లేదు. వ‌రంగ‌ల్ లో టిక్కెట్ల విష‌య‌మై కొంత గంద‌ర‌గోళ ప‌రిస్థితిని సృష్టించి, నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చకు కార‌ణం కావ‌డం… ఒక్క హ‌రీష్ రావుని త‌ప్ప ఇత‌ర నేత‌లు ఎవ‌రు జిల్లాకి వ‌చ్చినా పెద్ద‌గా స్పందించ‌క‌పోవ‌డం… ఈ రెండు అంశాల‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని, కొన్నాళ్ల‌పాటు కొండా సురేఖ‌ను సందిగ్దంలో ఉంచాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీవైపు కొండా ఫ్యామిలీ చూస్తోంద‌న్న ప్ర‌చార‌మూ ఉంది క‌దా! కాబ‌ట్టి, ఈ నేప‌థ్యంలో కొండా సురేఖ అభ్య‌ర్థిత్వాన్ని పెండింగ్‌లో ఉంచ‌డం ద్వారా… వారి నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో అని ప‌రీక్షించ‌డ‌మే ల‌క్ష్య‌మై ఉండొచ్చ‌నే అభిప్రాయ‌మూ వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com