కేసీఆర్ లైట్ తీసుకున్నట్లే..! కానీ…?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత… ఓ కొత్త కూటమిని పెట్టే ప్రయత్నానికి పులిస్టాప్ పెట్టేశారు. ఏ పార్టీ వద్దకు వెళ్లినా.. తనతో కలసి వచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతో… తనకు వచ్చే సీట్లు.. అలాగే వైసీపీకి వచ్చే సీట్లను కలిపి… తమ ప్రయోజనాలను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే.. ఎన్నికల ఫలితాల వరకూ… కూటమి చర్చలు లేనట్లేనని చెబుతున్నారు. బీజేపీయేతర పార్టీల సమావేశానికి సోనియా గాంధీ ఆహ్వానించినా… వెళ్లకూడదని జగన్, కేసీఆర్ నిర్ణయించుకున్నారు కాబట్టి.. ఇక సంప్రదింపులు జరిపే అవకాశం కూడా లేదు. ముందస్తుగా మాట్లాడినా మాట్లాడకపోయినా.. వారిద్దరూ.. తమ వైపేనని బీజేపీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.

తెలంగాణకు నిధులిచ్చిన వాళ్లకు మద్దతు..?

కేంద్రంలో కీలక పదవి అవకాశం వస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని భావించారు. ముఖ్యమంత్రి పీఠంపై వారసుడు కేటీఆర్ ను కూర్చోపెట్టాలని అనుకున్నారు. అయితే ఇది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదనే అంచనాకు ఇప్పుడిప్పుడే వస్తున్నట్లుగా టీఆర్ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. బీజేపీకి తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చినా ఎక్కువ పార్టీలు కాంగ్రెస్ తోనే నడవాలనే భావిస్తున్నాయి. అందుకే… తెలంగాణ కోసం నిధులు ఇచ్చే పార్టీకే మద్దతివ్వాలనే వాదనను వినిపించబోతున్నారని చెబుతున్నారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న చిన్నా,పెద్ద ప్రాజెక్టులన్నీ కలిపితే వచ్చేఐదేళ్లలో దాదాపు లక్షన్నర కోట్లు అవసరం. పెంచాల్సిన పెన్షన్లు, రైతు పెట్టుబడి పథకం, 24 వేల కోట్ల పంటరుణాల మాఫీ, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వంట పథకాలకు నిధులు కావాలి. ఇప్పటికే చేపట్టిన పనులకు భారీగా బకాయిలన్నాయి.

వైసీపీ సీట్లతో కలిపి బేరమాడే శక్తి..!

వీటికి తోడు గత ఐదేళ్లలో మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాలకు తెచ్చిన అప్పుులు చెల్లించాలి. ఇక ఉద్యోగుల జీతాల పెంపు, విద్యుత్ సంస్థల బకాయిలు భారీగా ఉన్నాయి. ఖజానాతో సంబంధం లేకుండా వచ్చే ఐదేళ్లలో కనీసం మరో లక్ష కోట్ల సహాయం అవసరం. లేకపోతే… తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కేంద్రం అండ ఉండాలి. ఒక వేళ కేంద్రంలో వచ్చే కొత్త ప్రభుత్వం నేరుగా సాయం చేసే పరిస్థితి లేకపోయినా కేంద్రం పూచీకత్తుతో అప్పులు చేసుకునే అవకాశం అయినా పొందాలని భావిస్తున్నారు. ఏపీకి ఇచ్చిన ప్యాకేజీలో విదేశీ అప్పుల్లో… 90 శాతం కేంద్రమే చెల్లిస్తుందని ఉంది. ఆ తరహాలో.. సాయం చేసినా కేంద్రానికి మద్దతివ్వాలనే ఆలోచన టీఆర్ఎస్ హైకమాండ్‌లో ప్రారంభమయిందంటున్నారు.

కాంగ్రెస్ కూటమి వస్తే రాజకీయంగా ఇబ్బందే..!

కేంద్రంలో మారే రాజకీయ పరిణామాలు టీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారినా ఆశ్చర్యం లేదనే భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలో కానీ.. కాంగ్రెస్ మద్దతుతో కానీ ప్రభుత్వం ఏర్పడితే.. తెలంగాణలో రాజకీయాలు మారిపోతాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుండి పదకొండు మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. వీరు పునరాలోచించే అవకాశం ఉంది. ఒక వేళ వీరు కాకపోతే… ఇతర టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కుండువా కప్పుకున్నా ఆశ్చర్యం ఉండదు. ఎక్కడ అధికారం ఉంటే.. అక్కడ నేతలు ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com