కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల అజెండా ఇదేనా..!

జాతీయ రాజ‌కీయాల్లో ఎంట్రీకి తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధ‌మౌతున్న సంగ‌తి తెలిసిందే. ఇదే అంశ‌మై ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మ‌రోసారి మాట్లాడారు. బెంగాల్ నుంచి మ‌మ‌తా బెనర్జీ ఫోన్ చేశార‌నీ, తన నిర్ణ‌యాన్ని అభినందిస్తూ క‌లిసి ప‌నిచేసేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశార‌ని కేసీఆర్ చెప్పారు. మ‌హారాష్ట్ర నుంచి కొందరు ఎంపీలు ఫోన్ చేశార‌నీ, త‌న‌తో క‌లిసి వ‌చ్చేందుకు రాజీనామాల‌కు సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించార‌ని అన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ కూడా ఫోన్ చేసి మ‌ద్ద‌తు తెలిపార‌న్నారు. కాంగ్రెస్‌, భాజ‌పా నాయ‌క‌త్వాల్లోని ప్ర‌భుత్వాలు దారుణంగా విఫ‌ల‌మ‌య్యాయని దీన్ని బ‌ట్టీ అర్థ‌మౌతోంద‌న్నారు. వాస్త‌వ దృక్ప‌థంతో ప్ర‌జ‌ల‌కు ఈ పార్టీల వల్ల మేలు జ‌ర‌గ‌డం లేద‌నీ, ర‌క‌ర‌కాల సాకుల‌తో ప్ర‌జ‌ల‌ను విభ‌జిస్తున్నార‌ని కేసీఆర్ అన్నారు.

మ‌న ప‌క్క‌నున్న చైనా వేగంగా ఎందుకు అభివృద్ధి చెందుతోందంటే వారి రాజ్యాంగం వేరు అంటార‌నీ, అలా మ‌నం ఎందుకు మార్చుకోలేక‌పోతున్నామ‌ని కేసీఆర్ ప్ర‌శ్నించారు. మ‌న‌కంటే ఎంతో చిన్న‌దైన సింగ‌పూర్ అభివృద్ధి సాధించడానికి కార‌ణం వాళ్లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డ‌మే అన్నారు. ఇత‌ర దేశాల అభివృద్ధి గురించి ఇంకెన్నాళ్లు చ‌ర్చించుకుంటామ‌న్నారు. మ‌న‌ది ఫెడ‌రల్ వ్య‌వ‌స్థ అని గొప్ప‌గా చెప్పుకుంటామ‌నీ, కానీ స్థానిక సంస్థ‌ల‌కు గౌర‌వం ద‌క్క‌డం లేద‌న్నారు. ద‌వాఖానా న‌డిపించాలంటే ఢిల్లీలో కూర్చున్న‌వారికి ఏం తెలుస్తుంద‌న్నారు. ఆరోగ్యం, వ్య‌వ‌సాయం, విద్య‌, ప‌ట్ట‌ణాభివృద్ధి… ఇలాంటివ‌న్నీ రాష్ట్రాల‌కు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశారు. ఇవ‌న్నీ ఢిల్లీ చేతిలో పెట్టుకుని చిల్ల‌ర‌మ‌ల్ల‌ర రాజ‌కీయాలు ఈ రెండు పార్టీలూ చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వానికి ద‌వాఖాన‌లో, పాఠ‌శాల ద‌గ్గ‌రా, మున్సిపాటిలీలో ఏం ప‌ని.. వారికి క్షేత్ర‌స్థాయిలో ఏం అవ‌స‌రం ఉంద‌ని నిల‌దీశారు. వారు చేయాల్సిన‌వి చేయ‌ర‌నీ.. విదేశీ విధానం, ఆర్మీ, జాతీయ ర‌హ‌దారులుపై వారికి దృష్టి ఉండాల‌న్నారు.

ప్ర‌ధాన‌మ‌త్రి గ్రామ్ స‌డ‌క్ యోజ‌న‌ గురించి ప్ర‌స్థావిస్తూ… గ్రామాల్లో ప్ర‌ధానికి ఏం ప‌నీ, రాష్ట్ర స్థాయి ప్ర‌భుత్వాలు ఈ ప‌నులు చేయ‌లేవా అని కేసీఆర్ మండిప‌డ్డారు. అదే అమెరికా ఉదాహరణగా తీసుకుంటే రాష్ట్రాల‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి, స్వ‌తంత్రం ఉంటుంద‌న్నారు. అన్ని పెత్త‌నాలూ ఢిల్లీ చేతిలో ఇంకెన్నాళ్ల‌న్నారు. ఇది ప్ర‌జ‌ల‌కు కావాల్సిన ఢిల్లీ కాద‌న్నారు. రాష్ట్రాల మ‌ధ్య ఎన్నో స‌మ‌స్య‌లుంటే కేంద్రం చోద్యం చూస్తోంద‌న్నారు. దేశంలో రైతులు సంక్షోభంలో కూరుకుపోతున్నార‌న్నారు. ‘మీ దీవెన ఉంటే భార‌తదేశ రాజ‌కీయాల‌కు ద‌శాదిశా చూపించి, దేశ‌ప్ర‌జానీకానికి అద్భుత‌మైన మార్గ నిర్దేశం చేసి చూపిస్తాన‌’న్నారు.

రైతుల స‌మ‌స్య‌లు అంటూ మొద‌లుపెట్టిన కేసీఆర్‌, ఇప్పుడు రాష్ట్రాల స్వ‌యం ప్ర‌తిప‌త్తి అనే అంశాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఇదే పాయింట్ తో ఇత‌ర రాష్ట్రాల నేత‌ల్ని ఏకం చేసే ప‌ని మొద‌లుపెడ‌తా అంటున్నారు. ఓర‌కంగా చెప్పాలంటే టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు ఐడియాల‌జీతోనే ఇప్పుడు జాతీయ స్థాయి రాజ‌కీయాలు చేసేందుకు కేసీఆర్ సిద్ధ‌మౌతున్నారు అనొచ్చు. ఆయన మాటల్లో చాలావరకూ అదే ధ్వనించింది. మరి, కేసీఆర్ మొదలుపెట్టిన మూడో ప్రత్యామ్నాయ ప్రయత్నాల దశాదిశా ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.