గిరిజ‌నుల‌పై కేసీఆర్ స‌ర్కారుకు ప్రేమ పెరిగిందే..!

మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజ‌నుల‌పై కేసీఆర్ స‌ర్కారుకు ప్రేమ పుట్టుకొచ్చేసింది! ఎస్టీల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం ప్ర‌భుత్వం త్వ‌ర‌లో చేప‌ట్ట‌బోతున్న కార్య‌క్ర‌మాల గురించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల మంది గిరిజ‌నులు ఉన్నార‌నీ, వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయంటూ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన స‌మీక్ష‌లో ఉన్న‌తాధికారులు, పార్టీ నేత‌ల‌తో సీఎం చ‌ర్చించారు. ఉచిత ప‌రిమితి దాటి విద్యుత్ ను వినియోగించుకుని, ఆ బిల్లులు క‌ట్ట‌లేక బ‌కాయిలుప‌డ్డ‌వారికి ఊర‌ట‌నిచ్చే నిర్ణ‌యం తీసుకున్నారు. స‌ద‌రు బ‌కాయిల్ని మాఫీ చేస్తున్న‌ట్టు ప్ర‌కటించారు. పోడు వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డి బ‌తుకుతున్న గిరిజ‌నుల‌కు ప‌ట్టాలు ఇచ్చే అంశాన్ని కూడా ప‌రిశీలిస్తున్నామ‌న్నారు. వ్య‌వ‌సాయ పెట్టుబ‌డి కింద రూ. 8 వేలు ఇస్తార‌ట‌! ఇక‌, గొర్రెలూ మేక‌లూ ఆవులూ పెంచుకోవాల‌నుకునేవారికి వంద శాతం స‌బ్సిడీతో రుణాలు ఇస్తామ‌ని కూడా చెప్పారు. ఓట్ల కోసం కాకుండా.. గిరిజ‌నుల జీవితాల్లో మార్పు కోసం ప్ర‌య‌త్నిద్దామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు.

ఉన్న‌ట్టుండి గిరిజ‌నుల స‌మ‌స్య‌ల‌పై ముఖ్య‌మంత్రి ఎందుకు ఆలోచిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దీనికి కార‌ణం కాంగ్రెస్ పార్టీ అన‌డంలో సందేహం లేదు. తెలంగాణ‌లోని ఆదివాసీలు, గిరిజ‌నులు, వెన‌క‌బ‌డిన వ‌ర్గాల‌పైనే ఈ మ‌ధ్య కాంగ్రెస్ ప్ర‌త్యేక దృష్టి సారించింది. అధ్య‌క్ష ప‌ద‌వి తీసుకున్నాక రాహుల్ గాంధీ రాష్ట్రానికి వ‌స్తార‌నీ, మొద‌ట‌గా ఆదివాసీలూ గిరిజ‌నులతోనే ఆయ‌న సభ నిర్వ‌హిస్తార‌ని టి. నేత‌లు అంటున్నారు క‌దా. నిజానికి, ఈ వారంలోనే రాహుల్ ప‌ర్య‌ట‌న ఉండాల్సింది. కానీ, గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారం అంటూ దాన్ని ర‌ద్దు చేసుకున్నారు. ఎస్టీలు, నిరుపేద‌ల స‌మ‌స్య‌ల‌నే ప్ర‌ధానంగా ఫోక‌స్ చేయాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది.

కాబ‌ట్టి, ఆ ప్ర‌య‌త్నం కాంగ్రెస్ చేసేలోపుగానే… స‌మ‌స్య‌ల‌పై ముఖ్య‌మంత్రి దృష్టి సారించారు. 30 ల‌క్ష‌ల మంది గిరిజ‌నులు రాష్ట్రంలో ఉన్నార‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ఓట్ల కోసం కాకుండా వారి సంక్షేమం కోసం ప‌నిచేయాల‌ని కూడా చెప్ప‌క‌నే చెప్పారు! తెరాస స‌ర్కారు సంక‌ల్పాన్ని గిరిజ‌నులు అర్థం చేసుకోవాల‌ని కూడా ముఖ్య‌మంత్రి చెప్ప‌క‌నే చెప్పారు. గిరిజ‌నుల‌తో క‌లిసిమెలిసి ఉండాల‌ని కూడా నేత‌ల‌కు సూచించారు. ఉన్న‌ట్టుండి గిరిజనం స‌మ‌స్య‌ల మీద స‌ర్కారుకు అంత ప్రేమ ఎందుకొచ్చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.