అంద‌రినీ సందిగ్ధంలో ఉంచ‌డం… ఇదీ కేసీఆర్ వ్యూహం!

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ లో ఉన్నారు. హైకోర్టు విభ‌జ‌న, కొత్త జోన‌ల్ విధానానికి కేంద్ర ఆమోదం, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల వాటా పెంపు… ఇలా కొన్ని అంశాల‌ను కేంద్రాన్ని కోరేందుకే ప్ర‌స్తుత ఢిల్లీ టూర్ అన్నారు. కానీ, ఈ టూర్ లో ‘సందిగ్ధం’ ఏంటంటే… ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో కేసీఆర్ ఏం చెప్పారు..? లోక్ స‌భ ఎన్నిక‌లు కంటే ముందుగా తెలంగాణ‌లో కూడా అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించేయ‌డానికి ఉన్న అడ్డంకుల్ని ఎలా అధిగ‌మించాల‌నుకుంటున్నారు..? అలాగ‌ని, తాజా ఢిల్లీ టూర్ స్ప‌ష్ట‌తా ఇవ్వ‌రు..!

ఇక‌, సొంత పార్టీ నేత‌ల ప‌రిస్థితి కూడా ఇదే..! సెప్టెంబ‌ర్ 2న ప్ర‌గ‌తి నివేదిన స‌భ అన్నారు. అంతేగానీ… ఆ స‌భ‌లో నాలుగేళ్ల పాల‌న గురించి మాత్ర‌మే మాట్లాడ‌తారా, ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న క‌చ్చితంగా ఏదైనా ఉంటుందా… ఇలాంటి ‘సందిగ్ధం’లో పార్టీ కేడ‌ర్ ను ప‌డేశారు. టిక్కెట్ల విష‌యంలో కూడా ఇంతే..! సిటింగ్ ఎమ్మెల్యేలంద‌రికీ టిక్కెట్లు ఖాయ‌మ‌న్నారు! ఎప్ప‌టిక‌ప్పుడు ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌ర్వేలు చేస్తున్నామ‌న్నారు. కానీ, తాజాగా అన్న‌దేంటంటే…. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాల‌నీ, సిట్టింగులందరికీ సీట్లు గ్యారంటీయేగానీ… ఆ న‌లుగురికీ త‌ప్ప అన్నారు. దీంతో ఆ నలుగురు ఎవ‌ర‌నేది అదో ‘సందిగ్ధం’. ఆ న‌లుగురులో ఫ‌లానావారు ఉండొచ్చ‌నే చ‌ర్చ పార్టీలో ప్ర‌స్తుతం చాలా తీవ్రంగా జ‌రుగుతోంది. ఆ నలుగురిలో మేమే ఉన్నామేమో అనే అనుమానంతో న‌ల‌భైమంది పేర్లు తెర‌మీదికి వ‌స్తున్నాయ‌ట‌! ‘ఆ నలుగురూ’ అనే మాట‌ను కేసీఆర్ య‌థాలాపంగా అనేశారా, న‌లుగురు కంటే ఎక్కువ‌మందే డేంజ‌ర్ జోన్ లో ఉన్నారా అనేది మ‌ళ్లీ ‘సందిగ్ధం’.

ఇది కేసీఆర్ మార్కు మేనేజ్మెంట్ టెక్నిక్ అన‌డంలో సందేహం లేదు. ఢిల్లీ టూర్ గురించి కేసీఆర్ ఏం చెబుతారా అనే సందిగ్ధంలో మీడియా అంతా ఆయ‌న‌వైపే చూసేలా చేసుకుంటున్నారు. త‌మ అధినేత ఎన్నిక‌ల గురించి ఏ ప్ర‌క‌ట‌న చేస్తారా అనే సందిగ్ధంలో పార్టీ కేడ‌ర్‌, ప్ర‌జ‌లూ త‌న‌వైపు మాత్ర‌మే చూస్తూ ఉండేలా చేసుకుంటున్నారు! సిట్టింగులంద‌రికీ టిక్కెట్లు గ్యారంటీ అని చెప్పినా, ఎవ్వ‌రిలోనూ ఆ ధీమా రానీయ‌కుండా… త‌న అంతిమ నిర్ణ‌యం కోసం ప‌డిగాడుపు కాసేలా చేస్తున్నారు. వీరంద‌రితోపాటు… ప్ర‌తిప‌క్షాల‌ను కూడా సందిగ్ధంలో ప‌డేసి ఉంచేస్తుండ‌టం విశేషం! ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై ఎలా స్పందించాలో, ఎప్పుడు స్పందించాలో, అస‌లు స్పందించొచ్చో లేదో… ఈ క్లారిటీ తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌స్తుతం లేదు! కేసీఆర్ నిర్ణ‌యం త‌రువాతే వారి వ్యూహాలు మొద‌లయ్యే ప‌రిస్థితిలో ఉంచారు. పరిస్థితులు అనుకూలిస్తే… యస్, మీరంతా అనుకున్నదే చేశానంటారు. ఎక్కడైనా తేడా కొడితే… నో, మీరంతా అనుకుంటే నేనేం చేస్తాననేస్తారు. ఆ వెసులుబాటు కోసమేనా ఈ సందిగ్ధ వ్యూహం…?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com