ఈ కేసునీ కేసీఆర్ అనుకూలంగా వాడుకుంటారా..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వేసే ఎత్తులూపైఎత్తులూ అంత ఈజీగా అంద‌రికీ అర్థం కావ‌నే కామెంట్ రాజ‌కీయ వ‌ర్గాలో వినిపిస్తూ ఉంటుంది! ఏ విష‌యాన్నైనా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా మార్చుకునే చాణ‌క్యం ఆయ‌న సొంతం అనేవారు కూడా ఉన్నారు. గతంలో ఓటుకు నోటు కేసు కావొచ్చు, ఆ త‌రువాత గ్యాంగ్ స్ట‌ర్ నయీమ్ ఎన్ కౌంట‌ర్ కేసు కావొచ్చు… ఆ సంద‌ర్భాల్లో కూడా కేసీఆర్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించార‌నీ, కేసుల‌ వివ‌రాల‌ను త‌న గుప్పిట నుంచీ బ‌య‌ట‌కి పోకుండా ఒడిసిప‌ట్టి… రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకున్నార‌ని కొన్ని విమ‌ర్శ‌లు అప్పట్లో వినిపించాయిలెండి! ఇప్పుడు మియాపూర్ భూకుంభ‌కోణం విష‌యంలో కూడా దాదాపు ఇలాంటి వాద‌నే తెర వెన‌క కొంత‌మంది వినిపిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ భూముల విష‌యంలో ఎక్క‌డా ఎలాంటి కుంభ‌కోణాలు లేవ‌ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించినా… విభిన్న కోణాల్లో కేసీఆర్ ఆలోచించే ఈ ప్రకటన చేశారంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఎలాగూ ఈ భూముల రిజిస్ట్రేష‌న్లు ర‌ద్దు చేయాల‌ని కేసీఆర్ స‌ర్కారు డిసైడ్ అయిపోయింది. దీంతో తెరాస‌లో ప్ర‌ముఖ నేత‌గా ఉన్న కేకే కూడా స‌రెండ‌ర్ అయిపోయిన‌ట్టే! అవ‌స‌ర‌మైతే కోర్టుకు వెళ్తాన‌ని అని చెప్పిన కేకే… ఇప్పుడు మ‌న‌సు మార్చుకున్నారు. వివాదాల నేప‌థ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం హ‌ఫీజ్ పురా గ్రామంలో కొనుగోలు చేసిన భూముల‌ను వ‌దులుకునేందుకు కేశ‌వ‌రావు సిద్ధ‌ప‌డ్డ‌ట్టు ప్ర‌క‌టించారు. సేల్ డీడ్ ర‌ద్దు చేసుకోవాల‌ని త‌న కుటుంబానికి సూచించాన‌నీ, అయితే.. తాను చెల్లించిన సొమ్మును వ‌డ్డీతో స‌హా వెన‌క్కి ఇవ్వాలనీ, ప‌రువు న‌ష్టాన్ని కూడా స‌ద‌రు కంపెనీ నుంచి కోర‌తానంటూ కేకే కొత్త రాగం ఎత్తుకున్నారు. దీంతో ఆయ‌న‌కి బోధ‌ప‌డిన త‌త్వం ఏంటంటే… ఈ వ్య‌వ‌హారంలో కేసీఆర్ వెన‌క్కి త‌గ్గేలా లేర‌ని! ఆయ‌న అలా స‌రెండర్ అయిపోయి, సైడ్ అయిపోయారు. ఇక‌, ఈ భూముల వ్య‌వ‌హ‌రంలో ఇంకా చాలా ర‌కాల బాగోతాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఆ వివ‌రాల‌న్నీ కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు చేరిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ కు బాగా ద‌గ్గ‌ర‌గా ఉంటున్న ఓ కాంగ్రెస్ ముఖ్య నాయ‌కుడి ఫ్యామిలీతోపాటు ప‌లువురు నేత‌ల భూభాగోతాలు ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర‌కు ఒక ఫైల్ రూపంలో చేరాయ‌ట‌! అయితే, వారిని ఇప్పుడే ఎందుకు బ‌య‌ట‌కి లాగ‌లేదూ అంటే… స‌ద‌రు నేత‌లు ఎవ‌రైనా తోక‌జాడించే స‌మ‌యం వ‌స్తే, అప్పుడే ఈ ఫైళ్లూ బ‌య‌ట‌కి వ‌స్తాయ‌న్న‌మాట‌! ఈ వివ‌రాల‌ను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చెయ్యొచ్చ‌నేదే కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ అనే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అందుకే ఈ వ్య‌వ‌హారంపై సీబీఐ ద‌ర్యాప్తు అంటూ కేసీఆర్ హ‌డావుడి చేయ‌లేద‌నీ, పోయిపోయి కేంద్రంలోని భాజ‌పా స‌ర్కారు చేతికి ఈ అస్త్రాన్ని అంద‌జేసేంత అమాయ‌క‌పు ప‌ని కేసీఆర్ ఎందుకు చేస్తార‌ని కూడా కొన్ని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, ఈ వ్య‌వ‌హారాన్ని కూడా తెరాస‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్న‌మేదో కేసీఆర్ చేస్తున్నార‌నే అనుమానాలు మాత్రం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com