థ‌ర్డ్ ఫ్రెంట్ దిశ‌గా కేసీఆర్ మ‌రో అడుగేసిన‌ట్టే..!

మాజీ ప్ర‌ధాని, జె.డి.య‌స్‌. నాయ‌కుడు దేవెగౌడ‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. నిజానికి, మ‌ర్యాదపూర్వ‌కంగా ఆయ‌న్ని క‌ల‌వడానికి మాత్ర‌మే వెళ్తున్నాన‌ని కేసీఆర్ ముందుగా చెప్పినా, ఇది థ‌ర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు దిశ‌గా జ‌రిగిన మ‌రో కీల‌క భేటీగానే చూడాలి. దేవెగౌడ‌తో భేటీ అనంత‌రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో మ‌ద్ద‌తుగా నిలిచేందుకు దేవెగౌడ వ‌చ్చారంటూ గ‌తం గుర్తు చేశారు. దేశంలో ఒక కొత్త ఉద్య‌మం రావాల్సిన అవ‌స‌రం ఉంద‌నీ, దాని గురించి మాట్లాడేందుకే ఆయ‌న్ని క‌లిశాన‌న్నారు. దాదాపు ఆరు ద‌శాబ్దాల‌పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌, భాజ‌పాలు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను తీర్చ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌కూ స‌రిప‌డా సాగునీటిని అందిచినా కూడా మ‌రో 30 వేల టి.ఎమ్‌.సి.ల నీళ్లు మిగులుతాయ‌నీ, అస‌మ‌ర్థ పాల‌న వ‌ల్ల‌నే నీటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నామ‌న్నారు.

నీటి స‌మ‌స్య‌ను ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పాన‌నీ, దేశంలో ఇలాంటివి చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారాల‌కు నోచుకోకుండా ఉన్నాయ‌న్నారు. తాము కాల‌క్షేప రాజ‌కీయాలు చేయ‌డం కోసం ప్ర‌య‌త్నించ‌డం లేద‌న్నారు. ఈ కూట‌మి కొన్ని రాజ‌కీయ పార్టీల క‌ల‌యిక కోసం మాత్ర‌మే కాద‌నీ… దేశవ్యాప్తంగా ఉండే రైతులు, పేద‌ల స‌మ‌స్య‌ల‌ను ఒకే తాటి మీదికి తీసుకుని రాబోతున్న వేదిక ఇద‌న్నారు. 2019లోపు రైతుల కోసం ఒక అజెండాను ఖ‌రారు చేస్తామ‌నీ, దాన్ని స‌మ‌ర్థించేందుకు ఎవ‌రు ముందుకొచ్చినా స్వాగ‌తిస్తామ‌న్నారు. రేప్పొద్దున్న క‌మ్యూనిస్టు పార్టీలు రావొచ్చు, మ‌రికొన్ని పార్టీలు సిద్ధ‌ప‌డొచ్చు.. దేశ ప్ర‌యోజ‌నాల కోసం పాటుప‌డేందుకు ఎవ‌రొచ్చినా ఆహ్వానిస్తామ‌న్నారు. ఇప్ప‌టికే వివిధ కూట‌ముల‌తో క‌లిసి ఉన్న పార్టీలు మీతో వ‌చ్చేందుకు అవ‌కాశం ఉందా అనే ప్ర‌శ్న‌పై కేసీఆర్ స్పందిస్తూ… కొన్ని పార్టీలు భాజ‌పా లేదా కాంగ్రెస్ ఉచ్చులో ఉన్నాయ‌నీ, దేశాన్ని ర‌క్షించుకోవ‌డం కోసం ఆ ఉచ్చు నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని కేసీఆర్ కోరారు. తాము ఏర్పాటు చేయ‌బోతున్న‌ది ప్ర‌జ‌ల ఫ్రెంట్ అనీ, రైతుల ఫ్రెంట్ అనీ చెప్పారు.

అయితే, ఇదే సంద‌ర్భంలో… క‌ర్ణాట‌క‌లో ఉంటున్న తెలుగు ప్ర‌జలంద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జె.డి.య‌స్‌.కి మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ విజ్ఞ‌ప్తి చేయ‌డం విశేషం. అంతేకాదు, అవ‌స‌రం అనుకుంటే ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా తాము రావ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌నీ, కుమార స్వామి, దేవెగౌడ కోరితే త‌ప్పక‌ వ‌స్తానంటూ స్ప‌ష్టం చేశారు. సో.. ఈ భేటీతో ఉభ‌యుల‌కూ మేలు జ‌రిన‌ట్టే అని చెప్పాలి! క‌ర్ణాట‌క‌లో ఉంటున్న తెలుగువారు జె.డి.య‌స్‌.కి మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేయ‌డం దేవెగౌడ‌కి కొంత మేలు చేసే ప‌రిణామ‌మైతే… కేసీఆర్ ఏర్పాటు చేయనున్న థ‌ర్డ్ ఫ్రెంట్‌కి దేవెగౌడ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం కేసీఆర్ కు సానుకూలాంశంగా చూడొచ్చు. కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ పిలుపు ప్రభావం ఎంత అనేది పక్కనపెడితే… మూడో కూటమి ఏర్పాటు దిశగా ఇది మరో ముందడుగుగానే చెప్పొచ్చు. కానీ, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాతే ఈ ఫ్రెంట్ లో దేవెగౌడ పాత్ర ఏంటనేది కొంత స్పష్టత వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.