ఇది కేసీఆర్ మార్క్ జాతీయ రాజ‌కీయ వ్యూహ‌మా..?

ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్… దీని గురించి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ మ‌ధ్య మాట్లాడ‌టం లేదు..! కాంగ్రెసేత‌ర, భాజ‌పాయేత‌ర నాయ‌క‌త్వం దేశానికి అవ‌స‌రమ‌ని అప్ప‌ట్లో చెప్పారు. కానీ, ఆ త‌రువాతి నుంచే భాజ‌పాతో కేసీఆర్ సాన్నిహిత్యం పెరుగుతూ వస్తోంది. ఢిల్లీ వ‌ర్గాల క‌థ‌నం ఏంటంటే… ఎన్నిక‌ల త‌రువాత కేంద్రంలో కేసీఆర్ త‌మ‌కే మ‌ద్ద‌తు ఇస్తార‌న్న భావ‌న‌లో భాజ‌పా నేత‌లు ఉన్నార‌ట‌! ఇక‌, ప్ర‌స్తుతం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు కూడా కేసీఆర్ దాదాపు సిద్ధంగా ఉన్నార‌నే వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. ఇంత‌కీ… ముంద‌స్తుకు కేసీఆర్ తొంద‌ర‌ప‌డుతూ ఉండ‌టం వెన‌క ఏదో ఒక వ్యూహం ఉండాలి క‌దా..? జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకు అనువుగా రాష్ట్రంలో వాతావర‌ణాన్ని మార్చుకోవాల‌నేదే ఆ వ్యూహంగా క‌నిపిస్తోంది..!

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్ గ‌ఢ్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల‌కు త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే. వీలైతే, వీటితోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్ని కూడా జ‌రిగిపోవాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహంగా కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎలాగూ దేశ‌వ్యాప్తంగా జ‌మిలి ఎన్నిక‌లు నిర్వహించే అవ‌కాశాలు రానురానూ త‌గ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మూ సాధ్యం కాదంది, రాజ్యాంగ‌ప‌రంగా కూడా స‌మ‌స్య‌లున్నాయి. వీలైన‌న్ని రాష్ట్రాల అసెంబ్లీల‌ను ర‌ద్దు చేయించే ప్ర‌య‌త్నం కూడా భాజ‌పా చేసే అవ‌కాశాలూ త‌క్కువే ! కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం…. లోక్ స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకేసారి వ‌స్తాయి క‌దా! రెండింటి కాల‌ప‌రిమితీ ఒకేసారి ముగుస్తుంది. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే… ఇక్క‌డే కేసీఆర్ వ్యూహం ఉంద‌ని చెప్పొచ్చు! తెలంగాణ‌లో లోక్ స‌భ కంటే ముందుగా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిపోవాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తామ‌న్న‌ది కేసీఆర్ ధీమా. కాబ‌ట్టి, కొత్త‌గా చ‌క్క‌దిద్దాల్సిన రాజ‌కీయాలంటూ ఏవీ లేవు!

లోక్ స‌భ ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి.. రాష్ట్ర ఎన్నికల గురించి ఆలోచించాల్సిన ప‌నిలేకుండా చేసుకుంటే… ఆ స‌మ‌యంలో జాతీయ స్థాయి రాజ‌కీయాల‌పై శ్ర‌ద్ధ పెట్టొచ్చ‌నీ, ఆ ర‌కంగా కేంద్రంలో కీల‌కం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌న్న‌ది కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంది! ఫోక‌స్ అంతా జాతీయ రాజ‌కీయాల‌పైనే పెట్టేందుకు మ‌రింత వెసులుబాటుగా ఉండేట్టు చూసుకోవాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌గా తెలుస్తోంది..! అయితే, దాని కోస‌మ‌ని ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసినా… ఆ మూడు రాష్ట్రాల‌తో క‌లిపి తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయా అనేది ప్ర‌శ్నే? ఆ త‌రువాత ప‌రిస్థితి ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్తుంది క‌దా. ఏదేమైనా, కేసీఆర్ ప్ర‌య‌త్న‌మైతే జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే ఉన్నట్టుగా క‌నిపిస్తోంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com