పెద్ద నోట్ల రద్దుపై కొన్ని ప్రతిపక్షాల తరహాలో ప్రభుత్వంపై విరుచుకు పడే వైఖరి వద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎంపీలకు చెప్పారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి వివరించాలని సూచించారు. ప్రతిపక్షమే అయినప్పటికీ ప్రతిదానికీ కేంద్రంపై కాలుదువ్వే వైఖరికి ఆయన మొదటి నుంచీ దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు కూడా మధ్యే మార్గంగా ప్రజల పక్షం వహిస్తే చాలని తెరాస పార్టీమెంటరీ పార్టీకి స్పష్టం చేశారు.
బీజేపీయేతర ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు మూకుమ్మడిగా రాష్ట్రపతిని కలవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆమె విరుచుకుపడ్డారు. తీవ్రంగా విమర్శలు గుప్పించారు. విషయాన్ని రాష్ట్రపతి వరకూ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అయితే అలాంటి చర్యలకు మనం దూరంగానే ఉందామని కేసీఆర్ తన పార్టీ ఎంపీలకు సూచించడం విశేషం.
పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రానికి ఆదాయం భారీగా తగ్గుతుంది. స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు ఇతర లావాదేవీలు భారీగా పడిపోయాయి. బడ్జెట్ అంచనాలు తల్లకిందులయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ కేసీఆర్ బహిరంగంగా ఏమీ వ్యాఖ్యానించ లేదు. అయితే మమతా బెనర్జీ వంటి వారితో కలిసి వెళ్లడం మాత్రం మంచిది కాదని ఆయన నిశ్చితాభిప్రాయం. వాస్తవ పరిస్థితిని కేంద్రానికి వివరిస్తూనే, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలనేది ఆయన అభిమతమని చాలా సార్లు స్పష్టమైంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా తెరాస ఎంపీలు ఇదే వైఖరి ప్రకారం వ్యవహరిస్తారు.