నిండు సభలో… మళ్లీ అదే మాట

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద నోట్ల రద్దును మరోసారి సమర్థించారు. దేశగతిని మార్చడానికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు శుక్రవారం ప్రారంభమైన అసెంబ్లీలో ప్రకటించారు. సమావేశాల తొలిరోజే పెద్ద నోట్ల రద్దు, పర్యవసానాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ ఒక ప్రకటన చేశారు.

విపరీతంగా పెరిగిపోయిన రాజకీయ అవినీతిని, నల్లధనాన్ని నిర్మూలించడానికి ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. తాను ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి సూచనలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. డబ్బుతో పాటు అవినీతి సొమ్ముతో కొన్న బంగారం, వజ్రాలు, విదేశీ కరెన్సీని కట్టడి చేయడానికి కూడా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.

విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి రప్పించడానికి కూడా చర్యలు తీసుకోవాలని తాను మోడీని కోరినట్టు చెప్పారు. దేశానికి మంచి చేయాలనే ఉద్దేశంతో తీసుకున్ననిర్ణయాన్ని రాజకీయ కారణాలతో విమర్శించవద్దన్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరటనివ్వడానికి సత్వరం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అలాగే వీలైనంత వరకు ఆన్ లైన్ చెల్లింపుల దిశగా మళ్లాల్సిన అవసరం ఉందన్నారు. క్యాష్ లెస్ అంటే 100 శాతం నగదు రహితం కాదని, అలా ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదని చెప్పారు. డిజిటల్ చెల్లింపులు చేయగలిగే వాటికి కూడా నగదు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com