చంద్రబాబును బూచిగా చూపడమే కేసీఆర్ వ్యూహం..! నిజామాబాద్ విమర్శలతో ప్లాన్ క్లియర్..!!

తెలంగాణ ఎన్నికలను కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా మార్చాలని టీఆర్ఎస్ అధినేత నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన కార్యాచరణను నిజామాబాద్ సభలో వెల్లడించారు. చంద్రబాబుపై అత్యంత తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఆంధ్రా ద్రోహిగా కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను నాశనం చేసిన వ్యక్తితో జట్టుకట్టారని మండిపడ్డారు. ఒకట్రెండు సీట్ల కోసం ఆంధ్రా వాళ్లతో కలుస్తారా? .. సీట్లే కావాలంటే తానే ఇచ్చేవాడనన్నారు. కాంగ్రెస్‌ది ప్రజల నోట్లో మట్టికొట్టే అజెండానని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు చెబుతారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ అధికారం ఆంధ్రోళ్లకు అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. అమరావతికి తెలంగాణను తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్ కౌంటర్లతో వందల మందిని చంద్రబాబు చంపించారని ఆరోపించారు. చంద్రబాబును ఆంధ్రా రాక్షసిగా అభివర్ణించారు.

కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిధులు చంద్రబాబే సమకూరుస్తున్నారని.. కేసీఆర్ స్పష్టం చేశారు. దుర్మార్గుడైన చంద్రబాబుతో పొత్తుకున్నందుకు..ఈ దుర్మార్గులకు చంద్రబాబు 500 కోట్లు ఇస్తున్నాడని మండిపడ్డారు. ప్రచారానికి మూడు హెలికాప్టర్లు కూడా చంద్రబాబే సమకూరుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాడని మండిపడ్డారు. 7 మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు … తెలంగాణకు కరెంటు ఇవ్వని రాక్షసుడన్నారు. కేంద్రానికి లేఖలు రాసి తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకున్నారన్నారు. తెలంగాణలో రాజకీయ అస్థిరత తేవాలని చూశారని ఆరోపించారు.

టీడీపీతో పొత్తులు పెట్టుకున్నందుకు.. కాంగ్రెస్ పార్టీపై కూడా.. కేసీఆర్ తనదైన భాషలో విరుచుకుపడ్డారు.. థూ .. మీ బతుకలు చెడ అని .. కంట్రోల్ తప్పి మరీ విమర్సలు చేశారు. ముఖ్యమంత్రిని బట్టేబాజ్‌ అంటారా..అని విమర్శలు గుప్పించారు. ఓటు ద్వారా బట్టేబాజ్‌ ఎవరో ప్రజలే చెప్పాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ గులాంలు, అమరావతి గులాంలు కావాలా? ప్రజలు తేల్చుకోవాలన్నారు. మహాకూటమిని ముఖ్యంగా కేసీఆర్.. చంద్రబాబును టార్గెట్ చేసుకోవడంతో… కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా రాజకీయం మార్చాలన్న వ్యూహం టీఆర్ఎస్ లో ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నుంచి తెలంగాణ రాజకీయం.. చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్లే సాగనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com