కేసీఆర్ ని కాంగ్రెస్ భ‌య‌పెడుతోందా..?

గ‌మ‌నించారో లేదో.. ఈ మ‌ధ్య కాంగ్రెస్ నేత‌ల్ని సీఎం కేసీఆర్ బాగా టార్గెట్ చేశారు! మాట‌ల దాడి పెంచారు. ద‌ద్ద‌మ్మ‌లూ స‌న్నాసులూ ద్రోహులూ… ఇలాంటి ప‌దాల‌తో విమ‌ర్శిస్తున్నారు. అభివృద్ధికి అడ్డుప‌డుతున్నారు అంటున్నారు. కాంగ్రెస్ పాల‌కుల కాలంలోనే తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం జ‌రిగిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత‌కీ… ఉన్న‌ట్టుండి కాంగ్రెస్ మీదే కేసీఆర్ కు ఫోక‌స్ ఎందుకు పెరిగిన‌ట్టు..? ఆ పార్టీ మీదే ప‌నిగ‌ట్టుకుని ఇంత తీవ్ర విమ‌ర్శ‌లు ఎందుకు చేస్తున్నట్టు..? ఎందుకంటే, దీని వెన‌క ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంద‌నే తెలుస్తోంది!

ఆ కార‌ణం ఏంటంటే… ఇటీవ‌ల కేసీఆర్ ఓ స‌ర్వే చేయించుకున్నార‌ట‌. ఆ వివ‌రాలు ఎక్క‌డా బ‌య‌ట‌కి పొక్క‌లేద‌నుకోండి. కానీ, పార్టీ వ‌ర్గాలే ఇదే చ‌ర్చ‌నీయం అవుతున్న‌ట్టు స‌మాచారం. స‌ద‌రు స‌ర్వే ప్ర‌కారం తెరాస స‌ర్కారు ప‌నితీరుపై 72 శాతం ప్ర‌జ‌లు పూర్తి సంతృప్తితో ఉన్నార‌ట‌. ఇక‌, సీఎంగా కేసీఆర్ ప‌నితీరు భేష్ అంటూ 77 శాతం ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇదే త‌రుణంలో తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీల ప‌నితీరుపై ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం విశేషం. తెరాస నాయకుల ప‌నితీరుపై దాదాపు 58 శాతం ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ ను క‌ల‌వ‌రపెడుతున్న మొద‌టి అంశం ఇది.

ఇక‌, రెండో అంశం కూడా ఉందండోయ్‌. వచ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో భాజ‌పా బ‌ల‌మైన శ‌క్తిగా ఎదిగే క్ర‌మంలో ఉంది. ఇంకోప‌క్క దేశ‌వ్యాప్తంగా ఎలాగూ మోడీ అనుకూల ప‌వ‌నాలే ఉన్నాయి. ఈ మ‌ధ్య‌నే జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు కూడా రుజువు చేసింది ఇదే. అయితే.. తెలంగాణ‌లో మాత్రం అనూహ్యంగా కాంగ్రెస్ కు మంచి వేవ్ ఉంద‌ని కేసీఆర్ స‌ర్వేలో తేలింద‌ట‌! తెలంగాణ‌లో 35.5 శాతం ప్ర‌జ‌లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నార‌ని స‌ర్వే చెప్పింద‌ట‌. సో… కాంగ్రెస్ మెల్ల‌మెల్ల‌గా పుంజుకొంటున్న‌ట్టు స‌ర్వే చెప్పింద‌న్న‌మాట‌. సీఎం కేసీఆర్ ను మ‌రింత క‌ల‌వ‌ర‌పెడుతున్న రెండో అంశం ఇది.

మూడేళ్ల త‌రువాత కూడా కేసీఆర్ పై 77 శాతం ప్ర‌జ‌లు సానుకూలంగా ఉన్నార‌న్న‌ది క‌చ్చితంగా గొప్ప విష‌యమే. కానీ, అదే స‌మ‌యంలో ఎమ్మెల్యేలు, ఎంపీల ప‌నితీరుపై అసంతృప్తి అనేదే కేసీఆర్ కు మింగుడుప‌డ‌ని అంశంగా తెలుస్తోంది. నాయ‌కుల‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా కాంగ్రెస్ మార్చుకునే అవ‌కాశం ఉండ‌నే ఉంది. ఎలాగూ కాంగ్రెస్ ప‌ట్ల కొంత అనుకూల‌త తెలంగాణ ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మౌతోంది క‌దా. ఈ కార‌ణాల దృష్ట్యా కాంగ్రెస్ నేత‌ల్ని కేసీఆర్ ప్ర‌త్యేకంగా టార్గెట్ చేసుకున్నార‌ని చెప్పుకోవ‌చ్చు. ద‌ద్ద‌మ్మ‌లు, స‌న్నాసులు, అభివృద్ధి నిరోధ‌క శ‌క్తులు… ఇలా గుక్క‌తిప్పుకోనివ్వ‌కుండా విమ‌ర్శించ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ వ్య‌తిరేక‌త భావ‌జాలాన్ని తీసుకెళ్తున్నార‌ని అనుకోవాలి. ఇంకోప‌క్క‌.. తెరాస మంత్రులూ నాయ‌కుల‌పై కూడా కేసీఆర్ గ‌రంగ‌రంగా ఉన్నార‌న్న క‌థ‌నాలూ వ‌స్తున్నాయి. సో.. ఇదంతా స‌ర్వే ఎఫెక్ట్ అన్న‌మాట‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.