నో డౌట్స్..!..ఆరున అసెంబ్లీ రద్దు..‍! ఏడు నుంచి ప్రచారం..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరో తేదీన అసెంబ్లీని రద్దు చేసి ఏడో తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ముందస్తు ఎన్నికలపై ఇప్పటి వరకూ తన నోటి నుంచి ఒక్కటంటే ఒక్క సూచనను రానివ్వని కేసీఆర్.. దానికి సబంధించిన చర్యలు మాత్రం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రగతి నివేదన సభ తర్వాత ఈ కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయి. ఫామ్ హౌస్ లో ఆయన సుదీర్ఘంగా సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. 6న తెలంగాణ కేబినెట్ సమావేశం ఉండనుంది. ముహుర్త బలం ప్రకారం ఆరో తేదీన అసెంబ్లీ రద్దు చేస్తే మంచిదని పండితులు సూచించడంతో దాని ప్రకారమే ముందడుగు వేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆరో తేదీన అసెంబ్లీని రద్దు చేసి.. వెంటనే ఏడో తేదీనుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు.

7న హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో స్వయంగా కేసీఆర్ పాల్గొనబోతున్నారు. సభ ఏర్పాట్లను మంత్రులు హరీష్‌, ఈటల రాజేందర్‌ పర్యవేక్షిస్తున్నారు. ఏడో తేదీ నుంచే ఎందుకంటే.. ఆ తర్వాతి రోజు నుంచి శూన్యమాసం వస్తుంది. ప్రచారం ప్రారంభించడానికి అనువు కాదు. అందుకే… ఏడో తేదీనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. హుస్నాబాద్ నుండే 2014 ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించారు. 50 రోజుల్లో వంద నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తానని..కేసీఆర్ గతంలోనే పార్టీ నేతల సమావేశంలో ప్రకటించారు. హుస్నాబాద్ బహిరంగసభలో కేసీఆర్ పది నుంచి పదిహేను మంది అభ్యర్థుల్ని ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

కేసీఆర్ రాజకీయ వ్యవహారాలను ఫామ్ హౌస్‌లో చక్క బెట్టుకుంటూడంగా.. అధికార పరంగా.. చేయాల్సిన పనులను.. చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ పూర్తి చేస్తున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, సీఎం ప్రిన్సిప్ర సెక్రటరీ నర్సింగరావులతో కలిసి.. ఎస్కే జోషి, రాజీవ్‌శర్మ, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు గవర్నర్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ రద్దు నిర్ణయం తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతంది. మరో వైపు తెలంగాణ సీఎస్‌ను కలిసిన ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ షైనీ కలిశారు. ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని రజత్ కుమార్ మీడియాకు తెలిపారు. రాజకీయ పరిణామాలకు.. తను సీఎస్ ను కలవడానికి సంబంధం లేదన్నారు. పరిణామాలన్నీ చూస్తూంటే.. ముందస్తుపై మరో సందేహం లేదని తెలంగాణ రాజకీయవర్గాలకు క్లారిటీ వచ్చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com