అవిశ్వాసానికి కేసీఆర్ మ‌ద్ద‌తుపై చ‌ర్చ‌..!

కేంద్రంపై ఏపీ స‌ర్కారు పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం ఈ తీర్మానం స‌భ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. టీడీపీ ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న తీర్మానానికి భాజ‌పా వ్య‌తిరేక పార్టీల‌న్నీ మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డ్డాయి. చివ‌రికి శివ‌సేన కూడా మ‌ద్ద‌తు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ అధికార పార్టీ ఈ అవిశ్వాసంపై పార్ల‌మెంటులో ఎలాంటి వ్యూహం అనుస‌రిస్తుందా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి, ఏపీ ప్ర‌త్యేక హోదాకు అనుకూలంగానే తెరాస ఎంపీలు మాట్లాడారు. అదే త‌ర‌హాలో అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ఇస్తార‌నే అభిప్రాయ‌మే ఉంది. కానీ, పార్టీలో మాత్రం కొంత చ‌ర్చ జ‌రుగుతోంద‌నే స‌మాచారం..!

అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇస్తే… భాజ‌పా వ్య‌తిరేక కూట‌మిలో తెరాస కూడా చేరిన‌ట్టు లెక్క‌! ఇందులో స‌మ‌స్యేముందీ.. ఎలాగూ భాజ‌పా, కాంగ్రెస్ ల‌కు వ్య‌తిరేకంగానే క‌దా కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రెంట్ అంటున్న‌ది, త‌ప్పేముందని అనిపిస్తుంది. కానీ, కేంద్రంపై అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇస్తున్న పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఉంది క‌దా! తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్. కాబ‌ట్టి, ఈ స‌మ‌యంలో భాజ‌పాకి వ్య‌తిరేక వ‌ర్గంలో కేసీఆర్ ఉన్నార‌న్న ముద్ర‌తో ఇబ్బంది లేదుగానీ.. కాంగ్రెస్ ప‌క్క‌న చేరార‌నే ఇమేజ్ క‌లుగుతుందేమో, అది రాష్ట్ర రాజ‌కీయాల్లో కాస్త ఇబ్బందిక‌ర‌మైన అంశంగా మారుతుందేమో అనే ఒక చ‌ర్చను కొంత‌మంది తెరాస నేత‌లు కేసీఆర్ ముందు పెట్టినట్టు స‌మాచారం.

అలాగ‌ని, భాజ‌పాపై అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా ఉంటే అది మ‌రొక స‌మ‌స్య అవుతుంద‌నే చ‌ర్చా జ‌రుగుతోంద‌ట‌..! కేసీఆర్ త్వ‌ర‌లో థ‌ర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు అంటున్నారు. రేప‌ట్నుంచీ ఆ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. కాబ‌ట్టి, ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై కూడా కేసీఆర్ స్పందించాలి. అప్పుడే క‌దా జాతీయ స్థాయి ఆలోచ‌న ధోర‌ణి ఆయ‌న‌కి ఉంద‌ని తెలిసేది. అంతేకాదు, కేసీఆర్ కూట‌మి క‌ట్టాల‌నుకుంటున్న ఇత‌ర పార్టీలన్నీ దాదాపుగా అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. ఒక‌వేళ ఇప్పుడు తెరాస కాస్త వెన‌క‌డుగు వేసినా… రేప్పొద్దున మూడో ఫ్రెంట్ ప్ర‌య‌త్నాల‌కు ఇదో ర‌క‌మైన ఇబ్బందిగా మారుతుందేమో అనే అభిప్రాయంపైనా తెరాస‌లో కొంత చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. వీటితోపాటు మ‌రో అంశం.. స‌భ ప్రారంభం కాగానే ఆంధ్రా ప్ర‌త్యేక హోదాకి మ‌ద్ద‌తు తెలిపేసి, వెంట‌నే త‌మ రాష్ట్ర డిమాండ్లు అంటూ స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు దూసుకెళ్తే ఎలా ఉంటుంద‌నే చ‌ర్చ కూడా తెరాస‌లో జ‌రుగుతోంద‌ట‌. స‌భ స‌జావుగా జ‌రిగితేనే అవిశ్వాస తీర్మానాన్ని చ‌ర్చ‌కు పెడ‌తామ‌ని ఇప్ప‌టికే లోక్ స‌భ స్పీక‌ర్ స్ప‌ష్టం చేశారు. కాబ‌ట్టి, ఏపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతూనే స‌భ‌లో నిర‌స‌న‌కు దిగితే… అవిశ్వాస‌మూ చ‌ర్చకు వ‌చ్చే ఆస్కార‌మూ ఉండ‌దు, ఏపీకి మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్టూ ఉంటుంది, అవిశ్వాసానికి మ‌ద్దతు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్న పార్టీలకు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టూ ఉండ‌దు, భాజ‌పా కాంగ్రెస్ ల‌కు వ్య‌తిరేకంగానూ వ్య‌వ‌హ‌రించిన‌ట్టూ ఉంటుంది..! ఇలాంటి ప్ర‌తిపాద‌న కూడా ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌..! మొత్తానికి, సోమ‌వారం ఉద‌యం పార్ల‌మెంటులో తెరాస అనుస‌రించ‌బోయే వ్యూహం ఎలా ఉండ‌బోతోంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.