కేసీఆర్‌కు చంద్రబాబు “రివర్స్ గిఫ్ట్”..! ప్లాన్ క్లిష్టమైనదే.. !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. కొద్ది రోజుల నుంచి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు ఎన్నికల ప్రకటన రాక ముందే వేల కోట్లను వివిధ వర్గాలకు పంపిణీ చేసే పథకాలకు సంబంధించినవే. వీటిని అందుకున్న ప్రతి ఒక్కరూ… ప్రభుత్వానికి రుణపడి ఉండేలా.. ఓ ఎమోషనల్ టచ్‌ ఉండేలా పంపిణీ చేయబోతున్నారు. రుణమాఫీ చివరి రెండు విడదల నిధులు రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి. సామాజిక భద్రతా పెన్షన్లు రెట్టింపు చేశారు. వాటిని పండుగ వాతావరణంలో పంపిణీ చేయబోతున్నారు. అలాగే ప్రతి డ్వాక్రా మహిళకు రూ. 10వేలు ప్లస్ స్మార్ట్ ఫోన్ పథకానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నింటినీ నిధుల వెసులుబాటు చూసుకుని రంగంలోకి దిగిపోయారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్ని చూసి.. సంక్షేమం పేరుతో ఇలా డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న అభిప్రాయానికి చాలా మంది వస్తున్నారు కానీ.. కేసీఆర్‌ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్‌కు.. ఇది ఓ రకంగా రివర్స్ గిఫ్ట్ అన్న కోణం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది.

ఏపీలో పథకాల ప్రభావం తెలంగాణలో ఉంటుందా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసినందుకు… టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ప్రయత్నించినందుకు.. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. దాని ప్రకారం జగన్‌ను చేరదీస్తున్నారు. ఈ క్రమంలో జగన్‌కు భారీ ఎత్తున ఆర్థిక సాయం చేయబోతున్నారని చెబుతున్నారు. అయితే… కేసీఆర్.. ఏపీలో ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా… నేరుగా చంద్రబాబు.. తన ఇంపాక్ట్ తెలంగాణలో చూపించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. తెలంగాణలో తాను అడుగు పెట్టడాన్ని సెంటిమెంట్‌గా మార్చారు కేసీఆర్. అందుకే.. తెలంగాణలో అడుగు పెట్టకుండా.. ఏపీ ప్రజల్లోనే.. కేసీఆర్‌పై తీవ్ర వ్యతిరేకత పెంచి.. దాన్ని తిరుగుబాటు దిశగా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు చంద్రబాబు ఎంచుకున్న మార్గం.. సంక్షేమ పథకాలన్న అభిప్రాయం ఉంది. అదెలా అంటే..?

చంద్రబాబు ఇచ్చినట్లు కేసీఆర్ ఇవ్వకపోతే ఎలా..?

కేసీఆర్ ఎన్నికలకు ముందు బోలెడన్ని హామీలు ఇచ్చారు. వాటిలో నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు, రూ. లక్ష రుణమాఫీ లాంటి..నేరుగా లబ్దిదారులకు నగదు బదిలీ చేయాల్సిన పథకాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఖాజానా ఖాళీ అయిపోయింది. రైతు బంధుకు సంబంధించి ఇంకా.. రూ. 500 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టర్లకు వేల కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. అప్పుల కోసం తెలంగాణ ఎదురు చూస్తోంది. ప్రజలు కూడా… కేసీఆ‌ర్ చేతికి ఎముక లేకుండా తాయిలాలు ఇస్తారన్న ఆశతో ఉన్నారు. కానీ కేసీఆర్ వాటి గురించి మాట్లాడటం లేదు. మాట్లాడలేని ఆర్థిక పరిస్థితి ఉంది. మరో వైపు.. చంద్రబాబునాయుడు.. పెన్షన్లను డబుల్ చేశారు. పండుగలా మూడు రోజుల పాటు… పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు. ఏకంగా రూ. మూడు వేలు పంపిణీ చేయబోతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం సంగతి సరే సరి. అంటే.. తెలంగాణ ప్రజల్లోనూ.. ఈ అంశం హాట్ టాపిక్ అవుతుంది. కేసీఆర్ ఇస్తానన్నారు.. గెలిపించినా ఇవ్వలేదనే భావన పెరిగిపోతుంది. అలాగే.. నిరుద్యోభృతితో నిరుద్యోగుల్లో… రూ. లక్ష రుణమాఫీ కోసం రైతుల్లోనూ.. ఇదే తరహా అసంతృప్తి పెరిగేలా.. ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నారు. మహిళలకు స్మార్ట్ ఫోన్లు , రూ. 10వేలు అంటే.. ఓ అలజడి రేపడం ఖాయమే. ధనిక రాష్ట్రామని చెబుతున్న కేసీఆర్.. తమకు ఎందుకు ఇవ్వరన్న భావన తెలంగాణ ప్రజల్లో పెంచడానికి.. చంద్రబాబు ఈ వ్యూహాత్మక సంక్షేమ రథాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారన్న అభిప్రాయం ఉంది.

కేసీఆర్‌పై వ్యతిరేకత పెంచేలా చంద్రబాబు రివర్స్ గిఫ్టా..?

తెలంగాణ ప్రజలలో కేసీఆర్‌పై ఓ రకమైన వ్యతిరేకత లాంటిది వస్తే.. ఇక దాన్ని ఎవరూ ఆపలేరన్న భావన.. రాజకీయవర్గాల్లో ఉంది. ఎందుకంటే… అధికారాన్ని పూర్తిగా అనుభవించేవారికి.. ప్రజలు అండగా ఉన్నంత కాలం ఉంటారు.. తిరగబడితే.. మాత్రం.. నామరూపాలు లేకుండా చేస్తారు. చరిత్రలో జరిగింది ఇదే. దీన్నే బేస్ చేసుకుని చంద్రబాబు కేసీఆర్‌కు రివర్స్ గిఫ్ట్ ఇస్తున్నారనే భావన ఉంది. చంద్రబాబు సంక్షేమం వల్ల.. అటు ఏపీలో ప్రజల అభిమానాన్ని పొందడమే కాదు.. ఇటు తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ తమకు ఇవ్వడం లేదన్న అసంతృప్తిని పెంచడానికి కూడా… ఉపయోగించుకుంటున్నారు. దీని ఫలితం ఎలా ఉంటుందో.. చాలా వేగంగానే బయటకు రానుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

— సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com