కేరళను ముంచింది తమిళనాడేనా..?

కేరళ ప్రళయానికి తమిళనాడే కారణమా..? అవుననే అంటోంది కేరళ ప్రభుత్వం. అంతే కాదు.. ఇదే విషయాన్ని చెబుతూ.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేరళలో వరదలకు.. కారణం.. ఆకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలు మాత్రమే కాదని.. డ్యాముల నుంచి నీరు వదలడమేనని.. కొద్ది రోజులుగా పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఎన్ని వర్షాలు పడినా… నీరు సముద్రంలోకి వెళ్లే వ్యవస్థ ఉన్నప్పటికీ.. పెద్ద ఎత్తున డ్యాములు నిర్మించి.. నీటిని నిల్వ చేసి… ఆకస్మాత్తుగా వాటిని వదలడం వల్లే.. కేరళ మునిగిదని చెబుతున్నారు. ముఖ్యంగా ముళ్లపెరియార్, ఇడుక్కి డ్యాముల నుంచి విడుదలైన నీరే… కేరళను ముంచిందని నమ్ముతున్నారు. ఇవి తమిళనాడుకు సంబంధం ఉన్నవే. ఇందుకే తమిళనాడుపై కేరళ ఆరోపణలు చేస్తోంది.

కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ముళ్ల పెరియార్ డ్యామ్.. పూర్తిగా తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉంటుది. నిజానికి ఈ డ్యామ్ పూర్తిగా.. కేరళ భూభాగంలో ఉంటుంది. కాని ఆ డ్యామ్ పై హక్కులు మొత్తం తమిళనాడువే. నీరు కూడా తమిళనాడే వాడుకుంటుంది. ఈ ప్రాజెక్టును కేరళలో 150 ఏళ్ల క్రితం నిర్మించారు. డ్యామ్ పాతది కావడం వల్ల కూల్చివేసి కొత్త డ్యామ్ నిర్మించాలని కేరళ చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. డ్యామ్‌లో నీటి స్థాయిని 142 నుంచి 139 అడుగులకు తగ్గించాలని కోరుతున్నా తమిళనాడు ససేమిరా అంటోంది. వరదలు వచ్చినప్పుడు గరిష్టంగా.. 142 అడుగుల మేర నీటిని నిల్వ చేసింది. ఆ సమయంలో పై నుంచి వరద భారీగా రావడంతో.. ఒకేసారి నీటిని విడుదల చేసేసింది తమిళనాడు.

ముళ్లపెరియార్ డ్యామ్ నుంచి తమిళనాడు… ఆకస్మాత్‌గా విడుదల చేసిన నీరు.. ఇడుక్కి ఆనకట్టకు చేరింది. అది కూడా నిండి పోవడంతో.. గేట్లు ఎత్తివేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్ధితి దిగజారిపోయింది. తమిళనాడు తీరుపై సుప్రీంకోర్టులో కేరళ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఇప్పుడీ విషయం.. కేరళ, తమిళనాడు మధ్య కొత్త తగవులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడుకు.. పొరుగున ఉన్న కర్ణాటక, కేరళలతో అనేక పంచాయతీలు ఉన్నాయి. వీటిని కేరళ వరదలు మరింత ముందుకు తీసుకెళ్తున్నట్లయిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com