కాంగ్రెస్ తో పొత్తు దిశ‌గా కోదండ‌రామ్ అడుగులేస్తారా…?

తెలంగాణ జేయేసీ ఛైర్మ‌న్ కోదండ‌రామ్ నిర్ణ‌యంపై ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో కొంత ఆస‌క్తి నెల‌కొంటోంది. త్వ‌ర‌లోనే సొంతంగా పార్టీ పెట్ట‌బోతున్న‌ట్టుగా ఈ మ‌ధ్య కొన్ని క‌థ‌నాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ దిశ‌గా కోదండ‌రామ్ కూడా కొన్ని సానుకూల సంకేతాలే ఇచ్చారు. జేయేసీని రాజ‌కీయ పార్టీగా చేస్తేనే బాగుంటుంద‌నీ, తెరాస‌పై పోరాటం చేసేందుకు ఇదే స‌రైన మార్గం అనే ఒత్తిడి ఆయ‌న‌పై ఎక్కువైంది. దీనికి అనుగుణంగానే… అంద‌రూ ఆశిస్తున్న‌ట్టుగానే త్వ‌ర‌లో నిర్ణ‌యం ఉంటుంద‌న్న‌ట్టుగా ఈ మ‌ధ్య కోదండ‌రామ్ చెబుతూ వ‌స్తున్నారు. కానీ, పార్టీ ఏర్పాటుపై ఇంకా ఆయ‌న ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోతున్న‌ట్టు స‌మాచారం. కొంత గంద‌ర‌గోళానికి గురౌతున్న‌ట్టుగా చెబుతున్నారు. ఇదే విష‌య‌మై ఈనెల 19న లాయ‌ర్ల జేయేసీతో ఆయ‌న భేటీ కాబోతున్నారు. జేయేసీని రాజ‌కీయ పార్టీ మార్చ‌డ‌మా, లేదంటే… ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కేసీఆర్ వ్య‌తిరేక శ‌క్తుల‌తో చేతులు క‌లిపి పోరాటం చేయ‌డ‌మా అనే అంశంపై త్వ‌ర‌లోనే ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తుందని జేయేసీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

పార్టీ ఏర్పాటుపై కొంత‌మంది జేయేసీ నేత‌లు అభిప్రాయం ఇంకోలా ఉంద‌ని తెలుస్తోంది! ఎలా అంటే, వ‌చ్చే ఏడాది చివ‌రి నాటికే దేశంలో పార్ల‌మెంటుతోపాటు, రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జ‌రిగే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. మోడీ స‌ర్కారు కూడా ఆ దిశ‌గానే ఈ మ‌ధ్య సంకేతాలు ఇస్తోంది. రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేయాలి అనుకుంటే… ఈ అంశాన్ని సీరియ‌స్ గానే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికిప్పుడు పార్టీ పెట్టి, మ‌రో ఏడాదిలోగా ఎన్నిక‌లు వెళ్లే స్థాయిలో పార్టీ నిర్మాణం చేయ‌డం సాధ్య‌మా అనే ప్ర‌శ్న‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఏడాదిలోగా క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భావితం చేసేంతగా పార్టీని తీసుకెళ్ల‌డం భారీ ప్ర‌యాసే అవుతుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఆర్థిక వ‌న‌రుల ల‌భ్య‌త‌ను కూడా చూసుకోవాలి క‌దా! ఇదే అంశాన్ని కోదండ‌రామ్ ముందు కొంద‌రు ప్ర‌స్థావిస్తున్నార‌నీ… ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సొంతంగా పార్టీ పెట్టే కంటే కేసీఆర్ వ్య‌తిరేక శ‌క్తుల‌తో చేతులు క‌ల‌ప‌డ‌మే మంచిద‌నేది కొంద‌రి వాద‌న‌!

కేసీఆర్ ను ఓడించ‌డ‌మే అంతిమ లక్ష్యం కాబ‌ట్టి, కాంగ్రెస్ తో చేతులు క‌లిపితేనే మంచిద‌ని కొంద‌రు టీ జేయేసీ నేత‌లు అభిప్రాయంగా తెలుస్తోంది. కాంగ్రెస్ కు సంస్థాగ‌తంగా తెలంగాణ‌లో బాగానే ప‌ట్టుంది. కోదండ‌రామ్ కు మంచి ఆద‌ర‌ణ కూడా ఉంది. ఇలాంట‌ప్పుడు కాంగ్రెస్ తో క‌లిసి సాగ‌డ‌మే స‌రైన వ్యూహం అవుతుంద‌నే విశ్లేష‌ణ‌లు చేసుకుంటున్నార‌ట! మ‌రి, దీనిపై కోదండ‌రామ్ తుది నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌నేది వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com