తెలంగాణ కాంగ్రెస్ పార్టీ… ఇప్పటికే కప్పల తక్కెడలా ఉంది పరిస్థితి! ఎందుకంటే.. ఉన్న నాయకుల మధ్య సమన్వయ లోపం, ఆధిపత్య పోరు, విఫల ఉద్యమాలు వంటివి ఉన్నాయని కొంతమంది విమర్శిస్తుంటారు. పార్టీలో ఎవరికి అజెండాలు వారివి అన్నట్టుగా… పీసీసీ ఒకలా వ్యహరిస్తే, మరోపక్క సీనియర్లలో కొంతమంది వారికి నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు! తెరాస ప్రభుత్వ వైఖరిపై పార్టీలో కొంతమంది పోరాటాలు చేస్తుంటే… అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును మెచ్చుకుంటూ వ్యాఖ్యానించే నాయకులూ ఉన్నారు! నిజానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాంగ్రెస్ హయాంలోనే అయినా.. రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీయే అయినా, రాష్ట్ర స్థాయిలో ఏమాత్రం ఆ పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోలేకపోయింది టి. కాంగ్రెస్. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమష్టిగా ముందుకు సాగే ధోరణి పార్టీ కనిపించడంలేదనే అభిప్రాయమే వ్యక్తమౌతోంది.
వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు సీఎల్పీ ఉన నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెరాస సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. కేసీఆర్ స్వార్థ పూరిత విధానాల కారణంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందన్నారు. ప్రజలకు కూడా ఆయనపై నమ్మకం సడలుతోందని, అందుకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తుందన్నారు! అంతవరకూ బాగానే ఉంది. కానీ, అసలు ట్విస్ట్ తరువాతే ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనని స్వయం ప్రకటన చేసుకున్నారు!! కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేసులో తాను ఉండటం ఖాయమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎప్పటికైనా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ముందుగా పార్టీకి పునర్జీవం ఇచ్చే అంశాల గురించి ఆలోచించాలిగానీ, ఇలా తానే సీఎం అభ్యర్థిని కోమటిరెడ్డి సొంతంగా ప్రకటించేసుకుంటే ఎలా..? పార్టీలో ఎంతోమంది అదే ఆశతో కొనసాగుతున్నవారు ఉన్నారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కాకపోతానా అనే కొండత ఆశతో సీరియర్లు కూడా వెయిట్ చేస్తున్నారు కదా! మరి, కోమటిరెడ్డి ఇలా ప్రకటించుకుంటే వారి మనోభావాలు దెబ్బతింటాయేమో..? కోమటిరెడ్డి ప్రకటన తరువాత వారు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన అంశం!