వరంగల్ కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు పెద్ద సమస్యగా మారారు. మంత్రిగా ఉండి పార్టీకి డ్యామేజ్ అయ్యేలా కొండా సురేఖ తరచూ మాట్లాడుతూంటారు. ఆమె వల్ల ప్రభుత్వం తో పాట ుఇతర మంత్రులకూ సమస్యలు వస్తున్నాయి. తాజాగా కొండా మురళి కూడా రెచ్చిపోతున్నారు. గురువారం ఆయన అనుచరులతో సమావేశం పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరిలతో పాటు ఇతర కాంగ్రెస్ నేతల్ని కించ పరుస్తూ మాట్లాడారు. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికీ పోదని చాలెంజ్ చేశారు.
కొండా దంపతుల వ్యవహారం రాను రాను గీత దాటిపోతూండటంతో.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆపార్టీ ఎమ్మెల్యేలు, నేతలు హన్మకొండ లోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై వ్యాఖ్యలు చేయడం సరికాదని ఇప్పటి వరకూ కొండా దంపతులను భరిస్తున్నామని .. ఇక తమ వల్ల కాదని వారు తేల్చేశారు. త్వరలో పార్టీ ఇంచార్జి మీనాక్షి నరాజన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కొండ దంపతులు కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, పార్టీకి నష్టం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు.
కొండా దంపతులు ఏ పార్టీలో ఉన్నా ఇదే సమస్య. వారు ఎవరితోనూ సఖ్యతగా ఉండరు. ఆధిపత్యం అంతా తమదే ఉండాలని అనుకుంటారు. గతంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు అయిన వేం నరేందర్ రెడ్డిని కూడా బెదిరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు పార్టీ నేతలంతా కలిసి కొండా సురేఖకు వ్యతిరేకంగా మారడంతో.. వారికి ఇక ముఖ్యమంత్రి అటు ప్రభుత్వ పరంగా.. ఇటు పార్టీ పరంగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పటికే మెదక్ ఇంచార్జ్ మంత్రిగా ఉన్న ఆమెను తొలగించారు.