క్రిష్‌కి బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్‌

నంద‌మూరి వార‌సుడు మోక్ష‌జ్ఞ పుట్టిన రోజు.. ఈ రోజు. తెలుగు రాష్ట్రాల్లో బాల‌య్య అభిమానులు మోక్ష‌జ్ఞ పుట్టిన రోజు హంగామా బాగానే చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోయినా మోక్ష‌జ్ఞ ఫాలోయింగ్‌ని సంపాదించుకొన్నాడంటే ఇదంతా నంద‌మూరి అభిమానుల పుణ్య‌మే! చాలాచోట్ల బ్యాన‌ర్లు, క‌టౌట్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌రి.. మోక్ష‌జ్ఞ సినీ ప్ర‌యాణం ఎప్ప‌టి నుంచి మొద‌ల‌వుతుంది? తొలి సినిమా ఎవ‌రి చేతిలో పెడ‌తారు?? ఈ విష‌యంపై తెలుగు 360 ఆరా తీసింది. మోక్ష‌జ్ఞ తొలి సినిమాకి సంబంధించినంత వ‌ర‌కూ బాల‌య్య దృష్టిలో ఇద్ద‌రు ద‌ర్శ‌కులున్నారు. ఒక‌రు బోయ‌పాటి, రెండోది క్రిష్‌.

సింగీతం శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఆదిత్య 369కి రీమేక్ చేసి, అందులో మోక్ష‌జ్ఞ‌తో ఓ పాత్ర చేయించాల‌ని, అదే… మోక్ష తొలి సినిమా అవ్వాల‌ని బాల‌య్య భావించారు. అయితే ఆదిత్య సీక్వెల్ ప‌క్క‌కు వెళ్లిపోయింది. ఇప్పుడు బాల‌య్య ముందున్న ఆప్ష‌న్లు రెండే. అందులో క్రిష్ వైపే బాల‌య్య మొగ్గు చూపుతున్నాడు. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి స‌మ‌యంలోనే బాల‌య్య‌కు క్రిష్ ఓ క‌థ వినిపించాడు. అందుకు సంబంధించిన స్క్రిప్టు వ‌ర్క్ స‌గం జ‌రిగి ఆగిపోయింది. ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు క్రిష్‌. ఆ వెంట‌నే మోక్ష‌జ్ఞ సినిమానే ప‌ట్టాలెక్కే అవ‌కాశాలున్నాయి. 2018 ప్ర‌ధ‌మార్థంలోనే.. మోక్ష అరంగేట్రం ఉండ‌బోతోంద‌ని, దానికి క్రిష్ ద‌ర్శ‌కుడిగా ఖాయ‌మైపోయాడ‌ని నంద‌మూరి కాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com