ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ఒక కెరటంలా దూసుకొచ్చింది కృతి శెట్టి. ‘బేబమ్మ’ పాత్రతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. కెరీర్ ప్రారంభంలోనే అలాంటి గుర్తుండిపోయే పాత్ర దక్కడంతో అవకాశాలు వరుసగా వచ్చాయి. అయితే, ఆ తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు.
ఇప్పటివరకు ఈ విషయంపై మాట్లాడినప్పుడు “పని చేయడం మాత్రమే నా చేతిలో ఉంది, ఫలితం నా చేతిలో ఉండదు” అని చెప్పే కృతి, ఈసారి మాత్రం కాస్త ఓపెన్‌గా స్పందించింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి నయనతార నిర్మాత. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా, కృతి మాత్రం మీడియాతో మాట్లాడింది.
వరుస పరాజయాలకు గల కారణం గురించి మాట్లాడిన కృతి, ‘ఉప్పెన తర్వాత మళ్లీ అలాంటి బలమైన పాత్ర నాకు రాలేదు. అదే నా కెరీర్లో ఒక ప్రధాన లోటు’ అని మనసులో మాట బయటపెట్టింది. ‘సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయనే బాధ కంటే, బెమమ్మ లాంటి పాత్రలు దక్కలేదనే బాధే నాకు ఎక్కువ’ అని స్పష్టం చేసింది.
తెలుగులో అవకాశాలు కొంత తగ్గినా, తమిళంలో ఆమె కొన్ని సినిమాలు చేస్తోంది కృతి. త్వరలో అనిల్ రావిపూడి సినిమాలో జాయిన్ అవుతుంది కృతి. అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాతో అయినా ‘బేబమ్మ’కు మళ్లీ సక్సెస్ వరిస్తుందేమో చూడాలి.


