దున్నపోతు ఈనింది అనగానే కట్టేయండి అన్నట్లుగా ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ లో రేవంత్ పేరును ఈడీ ప్రస్తావించగానే రేవంత్ అవినీతికి పాల్పడ్డాడని కూతలు కూయడం స్టార్ట్ చేశారు కేటీఆర్. రేవంత్ ఎక్కడెక్కడ దొరుకుతాడా అని కలలో సైతం కలవరించే కేటీఆర్.. చార్జీషీట్ లో రేవంత్ పేరు ఉండటంతో ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. ఇంకేముంది.. బీఆర్ఎస్ సోషల్ మీడియా తీర్పు చెప్పేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల కంటే ముందే బీఆర్ఎస్ సోషల్ మీడియా జడ్జిమెంట్ లను పాస్ చేసేసింది. ఆ పార్టీ సోషల్ మీడియా పేమెంట్ బ్యాచ్ కూడా ఇక రేవంత్ పని అయిపోయిందని పోస్టింగ్ లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ రేవంత్ పేరును నిందితుడిగా కూడా చేర్చలేదు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇవ్వండి.. అలా చేస్తే పదవులు ఇస్తామని రేవంత్ చెప్పారనేది ఈడీ ఆరోపణ. దీని ఆధారంగా ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ లో రేవంత్ పేరును ప్రస్తావించింది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ చెబుతున్నట్లుగా రేవంత్ పదవి ప్రమాదంలో పడినట్లేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే, రేవంత్ పదవి ప్రమాదంలో ఉందని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే యంగ్ ఇండియా అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది. అందుకే దానికి ఆ పార్టీ పీసీసీ చీఫ్ హోదాలో నాడు విరాళాలు ఇవ్వండి అని రేవంత్ చెప్పడం నేరమెలా అవుతుంది? అన్నది అందరి ప్రశ్న. ఈ చిన్న లాజిక్ ను తెలియకుండా కేటీఆర్ అండ్ కో సోషల్ మీడియాలో బట్టలు చించుకుంటుంది.
ఒకవేళ ఈ కేసులో రేవంత్ ను ఈడీ నిందితుడిగా చేర్చినా ఆయన చెప్పే సమాధానం ఒక్కటే. యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి చెందినది కనుక విరాళాలు ఇవ్వమని చెప్పామని, అది అవినీతిని ప్రోత్సహించాలని చెప్పినట్టు ఎందుకు అవుతుందని ఆయన చెప్పడం ఊహించేదే. ఈ కేసులో ఈడీ ఆరోపణ రేవంత్ ను గట్టిగా ఫిక్స్ చేసేదిలా ఏం లేదని అంటున్నారు. కానీ, బీఆర్ఎస్ మాత్రం తొందరపడుతోంది. ఆయన పదవి పోతుందని ప్రచారం చేస్తోంది. రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ, గతంలోనూ ఇలాంటి వాటి వల్లే బీఆర్ఎస్ రేవంత్ ను హీరో చేసిన సంగతి మరిచిపోయినట్టు ఉందని అంటున్నారు.