కూట‌మి గెలిస్తే చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తారట..?

కాంగ్రెస్‌, టీడీపీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ‌కు అడ్డం ప‌డ్డ గట‌‌డ్డాల‌న్నీ ఒక‌టైతున్నాయ‌న్నారు. ‘గ‌డ్డం చంద్ర‌బాబు నాయుడు, గ‌డ్డం ఉత్త‌మ్ కుమార్ ఇద్ద‌రూ ఒక‌ట‌య్యారు. గ‌తంలో అడ్డం ప‌డ్డ‌వారే ఇప్పుడు తెలంగాణ‌ల‌కు గండాలు అవుతున్నారు’ అని కేటీఆర్ విమ‌ర్శించారు. ఒక ముస‌లి న‌క్క కాంగ్రెస్ పార్టీ అనీ, గుంట‌న‌క్క చంద్ర‌బాబు నాయుడు అని కూడా అన్నారు. వీళ్లు కేసీఆర్ ని ఓడ‌గొట్టే దాకా ఊరుకోరట అని ఎద్దేవా చేశారు.

తెలంగాణ‌లో నిశ్శ‌బ్ద విప్ల‌వం ఉన్న‌ద‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అంటున్నార‌నీ, కానీ తెలంగాణ‌లో ఉన్న‌ది శ‌బ్ద విప్ల‌వ‌మ‌నీ, కూట‌మి గూబ గుయ్యిమ‌నేట్టుగా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉంటాయ‌న్నారు. వంద‌కు వంద శాతం వంద సీట్ల‌తో తెరాస మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ‘రేపేమ‌న్నా ఖ‌ర్మ‌గాలి, కూట‌మి అధికారంలోకి వ‌చ్చిందే అనుకో. కూట‌మి జుట్టు ఎవ‌రి సేతిలో ఉంట‌ది. చంద్ర‌బాబు నాయుడు చేతిలో ఉంట‌ది. జుట్టు చంద్ర‌బాబు నాయుడు చేతిలో పెట్టినంక‌… తెలంగాణ‌లో ఒక్క ప్రాజెక్టునైనా ముంగ‌టికి పోనిస్త‌డా? ఒక్క రైతుక‌న్నా న్యాయం జ‌రిగే ఆస్కారం ఉంట‌దా?’ అన్నారు కేటీఆర్‌.

కేటీఆర్ ప్ర‌చారం ఎలా ఉందంటే… తెలంగాణ‌లో మ‌హా కూట‌మికి టీడీపీ నాయ‌క‌త్వం వ‌హిస్తోందేమో అనిపిస్తోంది! కూట‌మి గెలిస్తే… టీడీపీ చేతిలో అధికారం ఉంటుంద‌ని క‌నీసం ఆ పార్టీ అనుకోక‌పోయినా.. తెరాస భావిస్తోంది! వాస్త‌వానికి మ‌హా కూట‌మిలో టీడీపీకి ద‌క్క‌బోతున్న సీట్లు ఎన్నుంటాయి..? పోనీ, పొత్తులో ద‌క్కించుకున్న స్థానాల‌న్నీ గెలుచుకున్నా… సొంతంగా టీడీపీ ఒక్క పార్టీ నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా తెలంగాణ‌లో మారుతుందా..? కూట‌మి సీట్ల స‌ర్దుబాటు ద‌గ్గర్నుంచీ అన్నీ కాంగ్రెస్ ఇష్ట‌ప్ర‌కారం జ‌రుగుతూ ఉంటే… టీడీపీని ల‌క్ష్యంగా చేసుకుని ఇంత‌గా విమ‌ర్శ‌లు ఎందుకు చేస్తున్న‌ట్టు! కూట‌మి అధికారంలోకి వ‌స్తే… తెలంగాణ‌లో ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు నాయుడు ఎలా అడ్డుప‌తారు? మ‌రోసారి ప్రాంతీయ వాదాన్ని రెచ్చ‌గొట్టి, సెంటిమెంట్ ద్వారా ల‌బ్ధి పొందాల‌న్న‌ది మాత్ర‌మే కేటీఆర్‌, కేసీఆర్ ల వ్యూహం. కేవ‌లం వారి రాజ‌కీయ మైలేజీ కోస‌మే చంద్ర‌బాబుపై ఇంత తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ తీరు వ‌ల్ల క‌లుగుతున్న అనుమానం ఏంటంటే… చంద్ర‌బాబు నాయుడు, టీడీపీల పేర్లు వాడితే త‌ప్ప‌… ప్ర‌జ‌లు త‌మ‌వైపు ఆక‌ర్షితులు కారేమో అనే ప‌రిస్థితిలో తెరాస ఉన్న‌ట్టుందనే భావ‌న క‌లుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com