ఇప్పుడు జాతీయ మీడియాపైనా దాడి?

మంత్రి కెటిఆర్‌ ఎకనామిక్‌ టైమ్స్‌పై విరుచుకుపడటంలో ప్రభుత్వ తొలి రోజులు మళ్లీ గుర్తుకు వచ్చాయి. మియాపూర్‌ భూ కుంభకోణం వంటివాటిపై కార్పొరేట్‌ కంపెనీలు జాగ్రత్తపడుతున్నాయనే కథనంలోనిజానికి పెద్దగా ఆవేశపడవలసింది లేదు. ఆ భాగోతం బయిటకు తీసింది తామేనని ఎంతటి వారున్నా వదిలేది లేదని ప్రభుత్వాధినేతలే ప్రకటించారు. ఇంకా చెప్పాలంటే జూన్‌2 వార్షికోత్సవ ఇంటర్వ్యూలలోనూ ఆ ప్రస్తావనలున్నాయి. అనేకమంది సబ్‌రిజిస్ట్రార్లపై చర్య తీసుకున్నారు. ఇక ఎంఎల్‌సి అరెస్టు కాగా ఒక ఎంపి గతంలో కొన్న భూమి ఒప్పందం రద్దు చేసుకుంటానన్నారు. ఇంకా చాలామంది దాగి వున్నారని చాలా సమస్యలున్నాయని అందరూ అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ భూమి గజం కూడా పోలేదు అన్నారే గాని తప్పు జరగలేదని అనలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కోట్లతోనడిచే సంస్థలు ఆలోచించడం కొంత ఆందోళన పడటం సహజమే. పైగా లొసుగులు చూపించి మరిన్ని రాయితీలకై ఒత్తిడి చేయడం వాటినైజం. ఎకనామిక్‌ టైమ్స్‌ వంటి పత్రిక వాటిని ప్రతిబింబించడంలో ఆశ్చర్యం లేదు. శక్తివంతులైన కెటిఆర్‌ వంటివారు గట్టి చర్యలతో వాటికి ఆస్కారం లేకుండా చేస్తామని చెబితే బావుంటుంది కాని కథనంపై దాడి చేయడం వల్ల ప్రయోజనమేమిటి? హైదరాబాదులో రియల్‌ వ్యాపారం పుంజుకున్నట్టు వార్తలు వచ్చిన తర్వాత కూడా మళ్లీ మందగమనం కనిపిస్తున్నది. ఈ కుంభకోణం ఫలితంగా తాము కొన్న భూముల హక్కులు పత్రాలు మరోసారి చూసుకోవలసి వచ్చినట్టు చాలా కంపెనీల ప్రతినిధులుచెబుతున్నారు. ప్రభుత్వాలు రాజకీయావసరాల వల్ల సర్దిచెప్పవచ్చు గాని వ్యాపార సంస్థలూ మీడియా కూడా ఆ గీతల్లోనే సంచరించాలంటే ఎలా? తెలుగు పత్రికలు ఛానళ్లపై ప్రతిపక్షాలపై విరుచుకుపడటం ఒక విధం గాని ఇలా వ్యాపార ప్రధానమైన పత్రికలపై జాతీయ మీడియాపై దాడి చేస్తే అది కూడా తప్పు సంకేతాలే పంపుతుంది కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.