క్లాస్‌కు కేటీఆర్, మాస్‌కు హరీష్

హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ సొంతపార్టీ ఎమ్మెల్యేలకే దక్కటంలేదన్నది తెలిసిందే. దీనితో ఆయన తర్వాత ప్రభుత్వంలో అతి ముఖ్యులైన సీఎం కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు చుట్టూనే వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం, ఫారెన్ రిటర్న్డ్ అయిన కేటీఆర్ క్లాస్‌ను, అందరికీ సులభంగా అందుబాటులో ఉండే హరీష్ రావు మాస్‌ను పంచుకుని వ్యవహారాలు నడిపిస్తున్నారు.

కేటీఆర్ ముఖ్యమంత్రి కుమారుడవటంతో ముఖ్యమంత్రి తర్వాత ప్రభుత్వంలో ఆయనకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. దీనితో పలు సంస్థలు, వ్యక్తులు తమ ప్రత్యేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నారు. పుట్టినరోజు ఫంక్షన్‌ల దగ్గరనుంచి మొదలుపెట్టి, పెళ్ళిళ్ళు, ప్రారంభోత్సవాలు, ఎగ్జిబిషన్‌లు, సినిమా ఫంక్షన్‌ల వరకు పలు కార్యక్రమాలకు రావాలని ప్రతిరోజూ కనీసం 10-15 ఆహ్వానాలు వస్తుంటాయి. ఇదికాక ఆయన ఐటీ శాఖ మంత్రికావటంతో సుప్రసిద్ధ ఐటీ సంస్థల విదేశీ ప్రతినిధులతో, వాటర్ గ్రిడ్ అధికారులతో భేటీలు ఉంటాయి. ప్రతిరోజూ కనీసం 200-300 మంది సందర్శకులు తమ పేషికి వస్తుంటారని కేటీఆర్ సహాయకులు చెబుతున్నారు. టైమ్ లేకపోవటంతో పుస్తకావిష్కరణ వంటి చిన్న చిన్న ఫంక్షన్‌లని పేషీలోనే చేసేస్తున్నారని, మంత్రికి క్షణం తీరిక ఉండటం లేదని అంటున్నారు. కేటీఆర్‌కు అమెరికాలో ఉండే తెలంగాణ ఎన్ఆర్ఐలలో బాగా ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్‌ ద్వారా వారితో ఆయన కనెక్ట్ అవుతుంటారు. ఆయన విడిగా కాక, తండ్రితో పాటే బంజారాహిల్స్‌లోని పాతనివాసంలోనే నివశిస్తున్నారు.

ఇక హరీష్ రావుది కేటీఆర్‌కు పూర్తి భిన్నమైన శైలి. ఆయన పూర్తిగా మాస్ లీడర్. పార్టీలో కేసీఆర్ తర్వాత అతి పెద్ద మాస్ లీడర్ హరీష్ రావే. ఆయనను కలవాలంటే నేరుగా బంజారా హిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో ఉన్న మినిస్టర్స్ క్వార్టర్స్‌కు వెళ్ళిపోవచ్చు. ప్రతిపక్షాలకు చెందిన నాయకులతో సహా అన్ని వర్గాలవారికీ ఆయన అపాయింట్‌మెంట్ సులభంగా లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయంనుంచే తెలంగాణలోని అన్ని ప్రాంతాలనుంచి తమ తమ పనులమీద హరీష్‌ను కలవటానికి ఎంతోమంది మినిస్టర్స్ క్వార్టర్స్‌కు వస్తుంటారు. వీరిలో హరీష్ సొంతజిల్లా మెదక్ నుంచి వచ్చేవారు ఎక్కువమంది ఉంటారు. హరీష్ వీరందరినీ ఓపిగ్గా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com