ఆంధ్రాలో తెరాస‌కి ఆహ్వానం.. ఈ టాపిక్ ఎందుకిప్పుడు..?

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీని పెట్టాలంటూ ఆహ్వానాలు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం విశేషం! నల్గొండ జిల్లాలో కొంత‌మంది కార్య‌క‌ర్త‌లు తెరాస‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా వారికి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానిస్తూ… తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఆంధ్రాలో బ్యాన‌ర్లు కట్టి, పాలాభిషేకాలు చేస్తున్నార‌ని మంత్రి అన్నారు. అంతేకాదు, మ‌హారాష్ట్రలోని దాదాపు 40 గ్రామాలు తెలంగాణ‌లో క‌ల‌వ‌డానికి సిద్ధంగా ఉన్నాయ‌నీ అన్నారు..!

నిజానికి, తెలంగాణ‌లో తెరాస‌కు రాజ‌కీయంగా స‌వాలుగా మారిన జిల్లా అంటే అది నల్గొండ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కీల‌క నేత‌ల్లో చాలామంది ఇక్క‌డి నుంచే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి సోద‌రులు, జానారెడ్డి వంటివారు ఈ జిల్లాకు చెందిన‌వారే. కాంగ్రెస్ కి కంచుకోట‌గా ఈ జిల్లాను చెప్పుకోవ‌చ్చు. అందుకే క‌దా… న‌ల్గొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి తెరాస‌లో చేరినా, ఉప ఎన్నిక నిర్వ‌హించాల‌న్న చ‌ర్చ వ‌చ్చిన ప్ర‌తీసారీ తెరాస మీన మేషాలు లెక్కించేది. జిల్లాలో ఇంత‌మంది ప్ర‌ముఖ నేత‌లున్నా ఫ్లోరైడ్ స‌మ‌స్య అలానే ఉంద‌నీ, గ్రామాల‌కు నీళ్లు రావ‌డం లేదంటూ కేటీఆర్ విమ‌ర్శ‌లు చేశారు. జిల్లాలో తెరాసను బ‌లోపేతం చేయాలంటే… కాంగ్రెస్ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూప‌డ‌మే తెరాస ముందున్న ఆప్ష‌న్‌. మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌ల వెన‌క ల‌క్ష్య‌మూ అదే.

అయితే, ఆంధ్రాలో కూడా తెరాసను కోరుకుంటున్నార‌నీ, కేసీఆర్ కు పాలాభిషేకాలు చేసేస్తున్నార‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీని వెన‌క ఏదైనా వ్యూహాత్మ‌క‌త ఉందా, లేదంటే ఫ్లోలో అలా అనేశారా అనేదే చర్చ‌! నిజానికి, అల‌వోక‌గా ఏదో ఒక‌టి మాట్లాడేయ‌డం కేటీఆర్ కు అల‌వాటు లేదు క‌దా. తాజాగా హైద‌రాబాద్ లో తెలుగుదేశం మ‌హానాడు కార్య‌క్ర‌మం జ‌రిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని బ‌లోపేతం చేయాలంటూ మ‌రోసారి కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేశారు. తెలంగాణ‌లో నాయ‌క‌త్వ లేమితో టీడీపీ కొట్టుమిట్టాడుతోందేగానీ, ఇప్ప‌టికీ టీడీపీకి కొంత బ‌ల‌మైన పునాది ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులూ అంటుంటారు. దీంతోపాటు, తెలంగాణ‌లో చాలా ప్రాంతాల్లో ఆంధ్రా ప్ర‌జ‌లున్నారు. వీరిని త‌మ‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం తెరాస చేస్తోంద‌నేది ఎప్ప‌ట్నుంచో వినిపిస్తున్న‌దే.

ముఖ్య‌మంత్రి కేటీఆర్ కూడా ఆ మ‌ధ్య అనంత‌పురం వెళ్లి, టీడీపీ నేత‌ల‌తో ఎన్న‌డూ లేనంత స‌ఖ్య‌త ప్ర‌ద‌ర్శించారు. దీని వెన‌క కేసీఆర్ ఆశించిన రాజ‌కీయ ప్ర‌యోజ‌నం ఏంట‌నేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు కేటీఆర్ ప్ర‌య‌త్న‌మూ అదే కావ‌చ్చు! ప్రాక్టిక‌ల్ గా చూసుకుంటే ఆంధ్రాలోకి తెరాస ప్ర‌వేశించే ప‌రిస్థితి లేదు. ఇది తెలిసి కూడా ప్ర‌జ‌లు ఆహ్వానిస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు అని కేటీఆర్ వ్యాఖ్యానించ‌డం వెన‌క కూడా అలాంటి వ్యూహ‌మే ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.