తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రణం కీలక స్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్, దూకుడు మీదున్న బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తమ అగ్రశ్రేణి నాయకులను ప్రచార బరిలోకి దించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జిల్లాలను చుట్టేస్తూ బహిరంగ సభలతో హోరెత్తిస్తుండగా, బీజేపీ తమ అధ్యక్షుడితో పాటు పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సైతం రంగంలోకి దించి స్టార్ పవర్ చూపిస్తోంది. అయితే, రాష్ట్రంలో పదేళ్లు అధికారం చలాయించిన బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో విభిన్నంగా, కాస్త ఆశ్చర్యకరంగా వ్యవహరిస్తోంది.
కంచుకోటలకే పరిమితమైన బీఆర్ఎస్ సూపర్ పవర్స్
పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు కేవలం తమ సొంత నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్లకే పరిమితం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించి కేడర్‌లో ధైర్యం నింపాల్సింది పోయి, కేవలం తమ ఇలాకాలను కాపాడుకుంటే చాలన్నట్టుగా వ్యవహరించడం శ్రేణులను డీలా పడేస్తోంది. స్టేట్ లెవల్ నేతలు రాకుండా కేవలం స్థానిక నాయకులకే భారాన్ని వదిలేయడం వల్ల గ్రౌండ్ లెవల్లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది.
బాధ్యత నుంచి తప్పుకోవడమేనా?
ఫలితాలు ఏమాత్రం తేడా వచ్చినా ఆ నెపాన్ని తమపై వేసుకోకుండా ఉండేందుకే అగ్రనేతలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తే బాధ్యత తీసుకోవాల్సి వస్తుందనే భయంతోనే కేటీఆర్, హరీష్ రావులు బయటకు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, కార్యకర్తలు తమను తాము కాపాడుకోలేక ఇతర పార్టీల వైపు చూసే ప్రమాదం ఉందని, తద్వారా పార్టీని రోడ్డున పడేసినట్లు అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
అక్కడ ఆర్కెస్ట్రా.. ఇక్కడ నిశ్శబ్దం!
ఒకవైపు ప్రత్యర్థి పార్టీలు పకడ్బందీగా జనసమీకరణ చేస్తూ, పవన్ కళ్యాణ్ వంటి క్రేజ్ ఉన్న నేతలను తీసుకొచ్చి ఓటర్లను ఆకట్టుకుంటుంటే.. బీఆర్ఎస్ మాత్రం కేవలం టెలీ కాన్ఫరెన్స్‌లు, అంతర్గత సమీక్షలకే పరిమితమైంది. ప్రభుత్వంపై అతకని విమర్శలు చేస్తోంది. పాతకాలపు రాజకీయాలు కాకుండా, ప్రజల కళ్లముందు తిరుగుతూ ధైర్యం చెప్పాల్సిన సమయమిది. ఇలాంటి కీలక సమయంలో నాయకత్వం ముందుండి నడవకపోవడం అంటే, యుద్ధరంగంలో సైన్యాన్ని వదిలేసి సేనాపతులు గదిలో కూర్చున్నట్టేనని అభిప్రాయం వినిపిస్తోంది.
