‘ఆపరేషన్ ఆకర్ష్‌’కు కేటీఆర్ సమర్థన వింతగా ఉంది!

హైదరాబాద్: టీఆర్ఎస్‌ ఆపరేషన్ ఆకర్ష్‌ను సమర్థించుకుంటూ ఆ పార్టీ కీలక నేత, ఐటీ శాఖమంత్రి కె.తారకరామారావు ఒక వింత వాదన చేశారు. ప్రతిపక్ష నేతలను టీఆర్ఎస్ నాయకులు కొనుగోలు చేస్తున్నారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని వినబడుతున్న వాదనపై కేటీఆర్ మండిపడ్డారు. కేవలం టీఆర్ఎస్ మాత్రమే ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నట్లు, చేయకూడని తప్పేదో చేస్తున్నట్లు ఆరోపించటం సరికాదని అన్నారు. ఏదో తమ పార్టీ ఒక్కటే ఈ పని చేస్తున్నట్లు మాట్లాడటమేమిటని అడిగారు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేమూ చేస్తున్నామని కేటీఆర్ మాటల అంతరార్థంగా కనిపిస్తోంది. కొందరు దొంగలు కూడా పట్టుబడిన తర్వాత ఇలాంటి వాదనే చేస్తుంటారు. ఎవరికి వీలైనట్లుగా వాళ్ళు దోచుకుంటున్నప్పుడు తాము దొంగతనం చేస్తే తప్పేమిటని ఎదురు ప్రశ్నిస్తుంటారు. కేటీఆర్ చేసే వాదన అలాగే ఉంది. ఈ సందర్భంలో కేటీఆర్ జగన్‌ను గుర్తుకు తెచ్చారు. వైఎస్ చనిపోగానే తనను ముఖ్యమంత్రిగా చేయాలని జరుగుతున్న సంతకాల సేకరణను జగన్ సమర్థించుకుంటూ, తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడిగా తాను ఆ పదవిని ఆశించటం తప్పేముంది అని జగన్ ఆనాడు ప్రశ్నించారు. ఇదేదో రాచరిక వ్యవస్థ అయినట్లు, తండ్రి చనిపోతే వారసుడికి ఆ పదవి రావాలన్నట్లు జగన్ మాట్లాడారు. ఉన్నట్లుండి రాజకీయాల్లోకి దూకిన ఈ యువనేతలకు మన దేశంలో ఉన్నది ప్రజాస్వామ్య వ్యవస్థ అని, దీనిలో కొన్ని సత్సాంప్రదాయాలు, నైతిక విలువలు ఉంటాయని కూడా తెలియకపోవటం విచారకరం. తెలంగాణ ఏర్పడటంలో కీలక పాత్ర పోషించి జేఏసీ ఛైర్మన్ కోదండరామే రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులను, ఎమ్మెల్సీ ఎన్నికలపై విచారం వ్యక్తం చేసినా కేటీఆర్‌కు అర్థం కాకపోవటం దురదృష్టకరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com