రివ్యూ : బాపు మార్క్‌ ‘కుందనపు బొమ్మ’ టైటిల్ ని కిల్ చేశారు..!

బాపు రమణ ల స్టయిల్లో తెలుగు ప్రజలను ఆకట్టు కొడాడనికి ఫస్ట్ లుక్ నుండి వాళ్ల స్థాయి సినిమా ఇది అని పబ్లిసిటీ పరంగా మంచి అంచనాలను సాధించిన అచ్చమైన తెలుగు చిత్రం ‘కుందనపు బొమ్మ’ . ప్రఖ్యాత సినీ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ తనయుడు, బాపు అల్లుడు అయిన వరా ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. కె.రాఘవేంద్ర రావు బి.ఏ సమర్పణ లో, ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జి. అనిల్ కుమార్ రాజు, జి. వంశీ కృష్ణ లు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షార్ట్ ఫిల్మ్స్‌తో యూత్‌లో బాగా పాపులారిటీ సంపాదించిన తెలుగు నటి చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించగా, సుధీర్ వర్మ, సుధాకర్ కోమాకుల ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ మంచి రొమాంటిక్ కామెడీ అన్న ప్రచారంతో ముందుకొచ్చిన ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

విజయనగరానికి దగ్గర్లోని ఓ చిన్న ఊరికి పెద్దమనిషిగా పిలవబడే మహదేవరరాజు (నాగినీడు)కి ఏకైక కుమార్తె సుచిత్ర (చాందిని చౌదరి). కూతురుని అల్లారుముద్దుగా పెంచుకునే మహదేవరరాజు, తనకు మేనల్లుడైన గోపీ (సుధాకర్)ని తన ఇంటి అల్లుడిగా ప్రకటించుకుంటాడు. అయితే గోపీకి మాత్రం సుచిత్ర పెళ్ళి చేసుకోవడం ఇష్టం ఉండదు. ఇదిలా ఉంటే, మహదేవరరాజు ఇంట్లో ఓ కారును రిపేర్ చేయడానికి వచ్చిన వాసు (సుధీర్ వర్మ) అనే ఓ ఇంజనీర్, సుచిత్రతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత సుచిత్ర కూడా వాసుని మెచ్చి అతడిని తిరిగి ప్రేమిస్తుంది. ఈ పరిస్థితుల్లో గోపీయే తన అల్లుడని చెప్పుకునే మహదేవరరాజు కి వీరిద్దరూ తమ ప్రేమను ఎలా తెలియజేశారు? గోపీకి సుచిత్రను పెళ్ళి చేసుకోవడం ఎందుకు ఇష్టం ఉండదు? వాసు-సుచిత్ర ప్రేమకథ ఏమైందీ? అన్నదే మిగతా కథ.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

షార్ట్ ఫిలిమ్స్ తో యువతను ఆకట్టుకున్న చాందిని ఈ సినిమాలో కుందనపు బొమ్మ గా టైటిల్ రోల్ లో దాదాపు ప్రేక్షకులను భయపెట్టినంత పని చేసింది. తెలుగు అమ్మాయి గా అందంగా కనిపించడం వరకు ఓకే కానీ, నటనలో ఇంకా పాస్ కాలేదు. బలవంతంగా ఏడ్చే సీన్స్ లో, నవ్వించాలని చేసిన వెకిలి ప్రయత్నాలు చేసేటప్పుడు చాందిని ఎక్స్ ప్రేషన్స్ చూసి భయపడని వారు ఉండరు. ఆ స్థాయిలో భయపెట్టింది ఈ బొమ్మ. కొత్తబ్బాయి సుధీర్ వర్మ కామెడీ పరవాలేదని అనిపించుకోగా… నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో సుధాకర్ ఆకట్టుకున్నాడు. నాగినీడు, రాజీవ్ కనకాల తమ పాత్రల పరిధిమేరకు ఒదిగిపోయారు, యాంకర్ ఝాన్సీ ఆదేదో “కంగనా” భాషలో నవ్వించాలని చేసిన విఫలయత్నం ప్రేక్షకుడి సహనానికి పరీక్షలా మారింది.

సాంకేతిక వర్గం :

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు….బాపు గారి స్ఫూర్తి తో మంచి తెలుగు టైటిల్ పెట్టిన, దర్శక, రచయిత వరా ముళ్ళపూడి ఏ కథ చెప్పాలనుకొని ఏ కథ చెప్పారో, ఏం చెప్పాలనుకొని ఈ సినిమా తీశారో అస్సలు అర్థం కాలేదు. దర్శకుడిగా ఆయన ఈ సినిమాలో ఎక్కడా కనీస ప్రతిభ కూడా చూపలేదు. ముఖ్యంగా చాందిని, రాజీవ్ కనకాల నేపథ్యంలో వచ్చిన సన్నివేశాలు బాగున్నాయి. దాన్ని అతడు పండించిన విధానం కూడా బాగున్నాయి. మిగతా అంతా సిల్లీ కామెడీ రాసుకొని దర్శకుడిగా పూర్తిగా నిరాశపరచాడు. పోస్టర్లు, ట్రైలర్లు పబ్లిసిటీతో కించెత్తు ఆశ కలిగినా చివరకు సినిమాకొచ్చే వారికి నిరాశ మిగిల్చాడు ముళ్ళపూడి వరా. సంగీత దర్శకుడు కీరవాణి స్థాయికి తగ్గ పాట ఒక్కటీ లేదు. నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే ఉంది. ఎస్.డి. జాన్ కెమెరా వర్క్ గురించి మాట్లాడితే, పల్లెటూరి అందాల వరకు చక్కగానే పిక్చారైజ్ చేసి ఇంపార్టెంట్ సీన్స్ వద్ద ఎమోషన్స్ సరిగ్గా బందించలేకపోయాడు. ఎడిటింగ్ దారుణంగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.

విశ్లేషణ:

‘కుందనపు బొమ్మ’ అన్న టైటిల్ పెట్టి, పోస్టర్స్‌లో బాపు మార్క్‌ను చూపెట్టి మనముందుకు వచ్చిన సినిమా అంటే ఎలా ఉంటుందని ఊహిస్తామో, అందుకు వన్ పెర్సెంట్ కూడా చేరువలో లేని సినిమా ఇది. ముళ్ళపూడి వెంకటరమణ కొడుకు, బాపు అల్లుడు అయిన వర ముళ్ళపూడి సినిమా అనగానే అంచనాలు భారీగా వచ్చాయి .ఏం చెప్తుందో అర్థం కాని అస్పష్టమైన కథ, అర్థం పర్థం లేని సిల్లీ కామెడీ, బోరింగ్‌గా సాగిపోయే కథనం.. ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ఈయన ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేకపోయాడు. ముఖ్యంగా కథలో మరింత పట్టు ఉండాల్సింది. ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కూడా మరింతగా ఉంటె బాగుండేది. ఒక పాత తరం సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా చేయడంలో దర్శకుడు పూర్తి గా విఫలం అయ్యాడు. సినిమాలోని పాత్రలు సైతం పాత సినిమాల్లో పాత్రల తరహాలో మూస తరహాలో ఉన్నాయి. దాంతో సినిమా ఆకట్టుకోవడంలో విఫలం అయ్యిందని చెప్పాలి. ఒక్క చాందిని చౌదరి, రాజివ్ కనకాలల కాంబినేషన్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే, ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. చిరవఖరికి చెప్పదేంటంటే. ‘కుందనపు బొమ్మ’ ఉండాల్సిన మెరుపులు లేవు….. టైటిల్ ని కిల్ చేశారనిపిస్తుంది.

తెలుగు360.కామ్ రేటింగ్ 2/5
బ్యానర్ : ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్,
నటీనటులు :చాందిని చౌదరి, సుధీర్ వర్మ, సుధాకర్, రాజీవ్ కనకాల, నాగినీడు తదితరులు,
సినిమాటోగ్రఫీ :ఎస్.డి .జాన్,
సంగీతం :యం యం .కీరవాణి
పాటలు : ‘ఆరుద్ర’ శివ శక్తి దత్తా, అనంత శ్రీరామ్,
సమర్పణ :కె .రాఘవేంద్ర రావు బి.ఏ,
నిర్మాత లు : జి.అనిల్ కుమార్ రాజు, జి, వంశీకృష్ణ
కథ,స్ర్కీన్ ప్లే, దర్శకత్వం :వర ముళ్ళపూడి,
విడుదల తేదీ :24.06.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com