ఆంధ్రాలో తాజా రాజ‌కీయాల‌పై ల‌గ‌డ‌పాటి టీమ్ స‌ర్వే..!

ప్ర‌స్తుతం ఆంధ్రా రాజ‌కీయాలు ఎంత వాడీవేడిగా ఉన్నాయో తెలిసిందే. నాలుగేళ్ల‌పాటు న‌మ్మించి మోసం చేసిన కేంద్రం. కాదూ.. ఇదంతా చంద్ర‌బాబు వైఫ‌ల్య‌మే అంటున్న ప్ర‌తిపక్షాలు. టీడీపీ పాల‌న అంతా అవినీతిమ‌యం అంటూ నేత‌ల ఆరోప‌ణ‌లు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ప్ర‌జ‌లు ఎవ‌రికి ఓటేస్తారు..? అడిగిన‌దానికంటే ఎక్కువే చేశామ‌ని చెప్పుకుంటున్న భాజ‌పాని ఏపీ ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారా..? పాద‌యాత్ర‌తో జ‌నంలో తిరుగుతున్న జ‌గ‌న్ ప్ర‌భావమెంత‌..? కొత్త రాజకీయం అంటూ ఉవ్విళ్లూరుతున్న పవన్ రాజకీయ శక్తి ఎంత..? ఇలాంటి అంశాల‌పై స‌ర్వే చేశారు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ తరఫున సర్వేలు చేసే ఆర్జీ ఫ్లాష్ టీమ్‌. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ కోసం వారు చేసిన స‌ర్వేలో తేలిన వాస్త‌వాలేంటో చూద్దాం.

ఐదు కీల‌క అంశాలపై ఈ స‌ర్వేలో భాగంగా ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ చేసింది ఆర్జీ ఫ్లాష్ టీమ్‌. మొద‌టిది… ఆంధ్రాకి మోడీ అన్యాయం చేశారా..? దీనికి అవును అని 83.67 శాతం మంది స‌మాధానం ఇస్తే, కాద‌ని 16.33 శాతం మంది మాత్ర‌మే అభిప్రాయ‌ప‌డ్డారు. రెండోది.. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ప్ర‌య‌త్నిస్తున‌్న పార్టీ ఏది..? దీనికి జ‌వాబుగా.. టీడీపీ 43.83, వైకాపా 37.46, జ‌న‌సేన 9.65, వామ‌ప‌క్షాలు 1.08, ఇత‌రులు 4.87 అంటూ అభిప్రాయ‌ప‌డ్డారు. మూడోది.. ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు ప‌నితీరు ఎలా ఉంద‌న్న ప్ర‌శ్న‌కు 53.69 శాతం మంది బాగుంద‌నీ, 46.31 శాతం బాలేద‌ని స‌ర్వే తేల్చింది. నాలుగోది.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ఏ పార్టీకి ఓటేస్తారు..? అంటే.. టీడీపీకి అని 44.04 శాతం మంది చెబితే.. వైకాపా 37.46, జ‌న‌సేన 8.90, కాంగ్రెస్ 1.18, భాజ‌పా 1.01 శాతం అని చెప్పారు. చివ‌రి అంశం, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఎవ‌రికి ఎన్ని ఓట్లొస్తానేది కూడా ఈ స‌ర్వేలో తేల్చారు. టీడీపీకి 110, వైకాపాకి 60, ఇత‌రుల‌కు 05 అని ఆర్జీ ఫ్లాష్ స‌ర్వే తేల్చింది.

జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌భావం పెద్ద‌గా లేద‌నీ, జ‌న‌సేన కూడా అనుకున్నంత ప్ర‌భావం చూప‌లేద‌ని స‌ర్వే చెబుతోంది. క్రిస్టియ‌న్లు, ముస్లిం మైనారిటీలు కూడా టీడీపీ వైపు మొగ్గుతున్న‌ట్టు స‌ర్వే చెప్తోంది. గ‌త ఎన్నిక‌లతో పోల్చితే వైకాపా ఓటు బ్యాంకు శాతం కూడా త‌గ్గింద‌నీ, దాని వ‌ల్లే సీట్ల సంఖ్య కూడా త‌గ్గే అవ‌కాశం ఉంద‌నీ తేల్చింది. ఇక‌, ఆర్జీ టీమ్ సర్వే విశ్వ‌స‌నీయ‌త గురించి మాట్లాడుకుంటే… ల‌గ‌డ‌పాటి సర్వేలు వాస్త‌వ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. ఆమ‌ధ్య జరిగిన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో కూడా ఈ టీమే స‌ర్వే చేసి, వాస్త‌వ ఫ‌లితాల‌నే చెప్ప‌గ‌లిగింది. ఇతర ఎన్నికల సమయాల్లో కూడా లగడపాటి సర్వేకి ప్రత్యేక స్థానమే ఉంది.

అయితే, ఇది ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి కోసం చేసిన స‌ర్వే కాబ‌ట్టి… సహజంగానే టీడీపీకి అనుగుణంగా వండివార్చిన స‌ర్వే అని విమ‌ర్శించేవారూ లేక‌పోలేదు. అలాగ‌ని, స‌ర్వే విశ్వ‌స‌నీయ‌త‌ను కూడా అంత ఈజీగా కొట్టిపారేసే అవ‌కాశ‌మూ లేదు. టీడీపీకి అనుకూలంగా ఉంది కాబ‌ట్టి, స‌హ‌జంగానే ఆ పార్టీ ఈ రిపోర్టును స్వాగ‌తిస్తుంది. ఇక‌, వైకాపా, జ‌న‌సేన‌, భాజ‌పాలు దీనిపై దుమ్మెత్తి పోసే అవ‌కాశాలున్నాయి. అంతేకాదు.. ప్ర‌జాభిప్రాయం త‌న‌కు వ్య‌తిరేకంగా ఉంది కాబ‌ట్టే, ఇలాంటి ఫీల్ గుడ్ స‌ర్వేల‌తో ప్ర‌చారం చేసుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వినిపించినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సింది లేదు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com