శ‌ర్వానంద్‌లో అంత మార్పు ఊహించ‌లేదు: లావ‌ణ్య త్రిపాఠితో ఇంట‌ర్వ్యూ

అందాల రాక్ష‌సిగా అల‌రించింది లావ‌ణ్య త్రిపాఠి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయ‌న చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల్ని అందుకొంది. టాలీవుడ్‌లో బిజీ బిజీగా గ‌డిపేస్తున్న క‌థానాయిక‌ల్లో త‌న‌కీ ఓ చోటు సంపాదించుకొంది. ఇటీవ‌ల `మిస్ట‌ర్‌`తో ప‌ల‌క‌రించిన లావ‌ణ్య‌.. ఇప్పుడు `రాధ‌`తో మ‌రోసారి సంద‌డి చేయ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా లావ‌ణ్య త్రిపాఠితో తెలుగు 360 డాట్‌ కామ్‌ చిట్ చాట్‌..

* హాయ్ లావ‌ణ్య‌
– హాయ్‌

* ఈ సినిమాలో రాధ ఎవ‌రు?
– నా పేరు రాధ‌… శ‌ర్వా పేరు కూడా రాధ‌నే. నేను రాధ‌లా అమాయ‌కంగా.. ఉంటా. శ‌ర్వామాత్రం శ్రీ‌కృష్ణుడి టైపు. ఇద్ద‌రి పాత్ర‌లూ క‌ల‌సి వ‌చ్చేలా ‘రాధ‌’ అనే పేరు పెట్టారు.

* మీ పాత్ర ఎలా ఉండ‌బోతోంది?
– నాదేదో కొత్త పాత్ర‌.. ఇది వ‌ర‌కు చేయ‌ని పాత్ర అని చెప్ప‌ను. చాలా స‌హ‌జంగా ఉంటుంది. కాలేజీ అమ్మాయిని. ఇంట్లో చాలా ప‌ద్ద‌తిగా ఉంటా. ఇంట్లోంచి కాలు బ‌య‌ట‌పెడితే అల్ల‌రే అల్ల‌రి.

* నిజ జీవితంలోనూ మీరు ఈ టైపేనా?
– (న‌వ్వుతూ) అక్ష‌రాలా. బ‌య‌ట ఎలా ఉన్నా.. ఇంటికెళ్లేస‌రికి ప‌ద్ధ‌తి వ‌చ్చేస్తుంది. అమ్మానాన్న‌లంటే నాకు చాలా గౌర‌వం. వాళ్ల ద‌గ్గ‌ర విన‌యంగానే ఉంటా. ఇంట్లో లావ‌ణ్య‌కూ.. బ‌య‌ట ఉండే లావ‌ణ్య‌కూ చాలా తేడా ఉంది.

* మీ సినిమాల గురించి వాళ్లు ప‌ట్టించుకొంటారా?
– వాళ్లు సినిమాలు చూసేదే త‌క్కువ‌. పైగా తెలుగు భాష అస్స‌లు అర్థం కాదు. సోగ్గాడే చిన్ని నాయ‌న త‌ప్ప మ‌రే సినిమా చూళ్లేదు. అలాంట‌ప్పుడు స‌ల‌హాలూ, సూచ‌న‌లూ ఏం ఇస్తారు?

* శ‌ర్వానంద్‌తో తొలిసారి పనిచేశారు… శ‌ర్వా సెట్లో ఎలా ఉండేవాడు?
– శ‌ర్వా చాలా కామ్‌. పెద్ద‌గా మాట్లాడేవాడే కాదు. నేనే క‌ల‌గ‌చేసుకొని మాట్లాడేదాన్ని. శ‌ర్వాలో ఇద్ద‌రుంటారు. ఆన్ స్క్రీన్ ఒక‌రు.. ఆఫ్ స్ర్కీన్ ఒక‌రు. బ‌య‌ట ఎంత బుద్దిగా ఉంటాడో.. తెర‌పై అంత‌లా చెల‌రేగిపోతాడు. శ‌ర్వాలో ఇంత మార్పు ఊహించ‌లేదు.

* మీ గ‌త సినిమా `మిస్ట‌ర్‌` ఫ్లాప్ అయ్యింది. ఆ రిజ‌ల్ట్ బాధించిందా?
– కొంచెం కూడా లేదు. ఎందుకంటే నేను చాలా ఇష్ట‌ప‌డి చేసిన పాత్ర అది. చేస్తున్న‌ప్పుడే దాన్ని బాగా ఆస్వాదించా. సినిమా చూస్తున్న‌ప్పుడూ నా పాత్ర‌లో లోపాలేం క‌నిపించ‌లేదు. నా వ‌ర‌కూ నేను క‌రెక్ట్‌గా చేశా. అలాంట‌ప్పుడు బాధ ప‌డ‌డం ఎందుకు?

* సినిమా రిజ‌ల్ట్ త‌ప్ప‌కుండా కెరీర్‌పై ప్ర‌భావం చూపిస్తుందేమో?
– కావొచ్చు. కానీ నాకు మాత్రం ఫ్లాపుల ఎఫెక్ట్ మీద ప‌డ‌ద‌నే అనుకొంటున్నా. అందాల రాక్ష‌సి అంతంత మాత్రంగానే ఆడింది. అయితే న‌న్నంతా గుర్తు ప‌ట్టారు క‌దా? త‌రువాత అవ‌కాశాలు ఇచ్చారు క‌దా? ఈ విష‌యంలో నేను చాలా ల‌క్కీ.

* జ‌యాప‌జ‌యాలు మీపై ప్ర‌భావం చూపించ‌వు అంటారు..
– అవును. నేను పెద్ద పెద్ద విజ‌యాల‌కూ పొంగిపోను. `సినిమా హిట్ట‌య్యిందా.. స‌రే` అంటానంతే. `నువ్వేంటి ఇంత సింపుల్‌గా ఉంటావ్‌` అని నా స్నేహితులంతా ఆశ్చ‌ర్య‌పోతారు. నా సినిమా విడుద‌ల అవుతోందంటే.. ముందు రోజు నుంచే నా సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొంటా. మ‌న‌సుని వీలైనంత ప్ర‌శాంతంగా ఉంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తా. నాలుగు రోజులు గ‌డిచాక‌.. హిట్‌, ఫ్లాప్ అనే విష‌యాల్ని మైండ్‌లోంచి తీసేస్తా.

* మీ గ్లామ‌ర్ సీక్రెట్ ఏంటి?
– కాన్ఫిడెన్ట్‌గా ఉండ‌డం. నిజాయ‌తీగా ఉన్న‌ప్పుడే మ‌నపై మ‌న‌కు న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది. అది మ‌న ఫేస్‌లో తప్ప‌కుండా క‌నిపిస్తుంది.

* నాగార్జున‌తో న‌టించారు.. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌తో చేయ‌బోతున్నారు. తండ్రీ కొడుకులు ఇద్ద‌రితోనూ హీరోయిన్‌గా న‌టించ‌డం ఇబ్బందిగా అనిపించ‌డం లేదా?
– కొంచెం కూడా అనిపించ‌డం లేదు. ఎందుకంటే… తండ్రీ కొడుకులిద్ద‌రితోనూ న‌టించిన క‌థానాయిక‌లు చాలామంది ఉన్నారు. ప్రేక్ష‌కులు వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోరు. దాంతో పాటు సోగ్గాడే చిన్ని నాయ‌న‌లో నాగార్జున గారి పాత్ర‌, నా పాత్ర చాలా స‌హ‌జంగా తీర్చిదిద్దారు. ఆ సినిమాలో పాత్ర‌లు త‌ప్ప మేం క‌నిపించం. నాగార్జున సార్ కంటే ముందు నేను చైతూతో న‌టించా. ‘మ‌నం’లో చిన్న కామియో చేశా. కాబ‌ట్టి ముందు నేను చైతూతోనే న‌టించిన‌ట్టు.

* స‌మ్మ‌ర్ ప్లాన్స్ ఏంటి?
– ఏమీ లేవు. షూటింగ్ త‌ప్ప‌.. మ‌రో వ్యాప‌కం పెట్టుకోలేదు. స‌మ్మ‌ర్‌లో ఎక్క‌డికైనా వెళ్లి ఎంజాయ్ చేద్దామ‌న్న ఆలోచ‌న కూడా లేదు. ఎందుకంటే నాకు వ‌ర్క్‌లోనే ఎక్కువ ఎంజాయ్‌మెంట్ క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.