జమిలి ఎన్నికలు సాధ్యం కాదని తేల్చిన లా కమిషన్..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా .. తమ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న జమిలీ ఎన్నికల వ్యవహారం… కల్లగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. జమిలీ ఎన్నికలు సాధ్యం కాదని.. లా కమిషన్ నివేదిక సమర్పించింది. భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు.. మన రాజ్యాంగానికి లోబడి అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటేనే సరిపోదని.. లా కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. జమిలిని ఇప్పటికే కొన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. బీజేపీ మిత్రపక్షాలు ఆహ్వానించాయి. కేంద్రం 2019లో సగం రాష్ట్రాలకు 2024లో పూర్తి స్థాయి జమిలీకి ఏర్పాట్లు చేసుకుంటోందని వార్తలు కూడా వచ్చాయి. కానీ లాకమిషన్ మాత్రం… సాధ్యం కాదని తేల్చింది.

నిజానికి జమిలి ఎన్నికల ప్రతిపాదనలుపై.. రాజ్యాంగ నిపుణులు… ఎప్పుడో పెదవి విరిచారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు జమిలీ సాధ్యం కాదని తేల్చారు కూడా. దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. పార్లమెంట్ తో కలిపి 30 ఎన్నికలు ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఈ 30 ఎన్నికల్లో పార్లమెంట్ లో కానీ.. ఇతర రాష్ట్రాల్లో కానీ.. ఎవరికీ మెజార్టీ రాని పరిస్థితి వస్తే.. ఏం చేయాలన్నది మొట్టమొదటి ప్రశ్నగా మారింది. మళ్లీ అన్నింటికీ ఎన్నికలు నిర్వహించడం ఎంత అసాధ్యమో.. ప్రభుత్వాలు ఏర్పాటు చేయని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం కూడా.. అంతే అసాధ్యం.

దీనిపై అనేక సూచనలు వచ్చినా..అవేమీ ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యేవిలా నిపుణులు భావించలేదు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్లకు ముందే..రద్దు చేయాలి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు… ఐదేళ్ల కంటే ఎక్కువ సమయం కొనసాగించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు. ఇవి రాజ్యాంగ సవరణల ద్వారా తీర్చేవి కావి. ప్రాక్టికల్ గా వచ్చే సమస్యలు. వీటిని లా కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసిది. అయితే లా కమిషన్.. మరింత విస్తృత సంప్రదింపులు జరుపుకోవచ్చనే వెసులుబాటు ఇచ్చింది. దీంతో కేంద్రానికి ఓ ఆప్షన్ ఉన్నట్లయింది. మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]