ఏపీ ఇక ఉక్కిరిబిక్కిరి..! ఇది ఆయారాం.. గయారాంల సీజన్..!

జనవరిలో చలి తగ్గుతున్న సూచనలు కనిపించడానికి రాజకీయ వేడి పెరగడమే కారణం అన్నట్లుగా మారిపోతోంది పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల వేడి .. అంతకంతకూ పెరిగిపోతూండటంతో.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల నేతలంతా బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఎన్నికలలో లాభం పొందడానికి రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థుల కోసం వెదుక్కుంటూ ఉండగా…. తమకు భవిష్యత్ ను ఇచ్చే పార్టీల్లో చేరేందుకు … నేతలు పోటీ పడుతున్నారు. బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. లెక్కలు సరి చూసుకున్న వాళ్లు… ఆయా పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో చేరికలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా.. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితునిగా వ్యవహరించి ఓ సారి మంత్రిగా కూడా చేశారు. అయితే తండ్రితో సాన్నిహిత్యం.. జగన్ కు నచ్చలేదు. ఆయనను దూరం పెట్టారు. ఫలితంగా.. ఇప్పుడు.. ఆయన టీడీపీ వైపు చూశారు. వచ్చే ఎన్నికల్లో కడప అసెంబ్లీ టిక్కెట్ హామీ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. కొణతాల రామకృష్ణ, సబ్బం హరి, దాడి వీరభద్రరావు, విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్లు చాలా మంది టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి టిక్కెట్లు సర్దుబాటు చేయగలిగితే.. వచ్చి చేరిపోతారు. అలాగే.. రాయలసీమ జిల్లాల్లోనూ మరికొంత మంది నేతలతో చర్చలు తుది దశలో ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.

వైసీపీలోనూ చేరికల రష్ ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. టీడీపీలో సీటు దక్కని ఇప్పటికే అంచనాకు వచ్చిన ఎమ్మెల్యేలు.. వైసీపీతో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సోదరుల అండతో రాజకీయం చేస్తున్న రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి…. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ అధినేతతో.. మేడా సోదరులకు నేరుగా వ్యాపార సంబంధాలున్నాయి. ఈ కారణంగా ఆయన టీడీపీను వీడి వైసీపీలో చేరడం ఖాయమైపోయిది. గతంలోనే చేరుతారని ప్రచారం జరిగింది కానీ… చంద్రబాబు పిలిచి మాట్లాడటంతో ఆగిపోయారు. ఇక మాట్లాడేదేమీ ఉండకపోవచ్చు. టీడీపీ నుంచి మరికొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల తమ పార్టీలోకి వస్తారని.. వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎవరెవరు.. ఏమిటనేది త్వరలో తేలుతుందంటున్నారు. అధినేతలిద్దరూ.. టిక్కెట్ల ఖరారుపై .. రోజంతా కసరత్తు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే పార్టీలోకి వచ్చేవారు.. పోయేవారు లెక్క తేల్చడంతో.. ముందు ముందు మరిన్ని బ్రేకింగ్‌న్యూస్‌లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com