ఎప్పటికైనా రాహులే! ఇప్పుడు గట్టెక్కేది ఎలా?

ప్రజలను, ఓటర్లను ఆకర్షించే నాయకత్వం లేని సంక్షోభం ఇపుడు వున్నంత తీవ్రంగా నూట ముప్పై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇందిరాగాంధీ హయాం నుంచీ అంతర్గత ప్రజాస్వామ్యం క్షీణించిపోయింది. హైకమాండ్ ఆలోచనలు, ఎత్తుగడలు, వ్యూహాలు నిగూఢంగానే వుంటాయి. ఏ విషయంలో ఎపుడు ఏమి జరుగుతుందో ఆసమయం వరకూ ఎవరి ఊహలకూ అందే విషయం కాదు.

ఆరోగ్యం క్షీణిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ…ఏ పదవీ లేకపోయినా కాంగ్రెస్ నిర్ణయాల్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ప్రియాంక గాంధీ…ప్రతి సారీ విఫలమౌతున్న ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ…తమ మంత్రాలకే చింతకాయలు రాలాయని భ్రమింపజేసే క్షుద్రశక్తులు…కన్సల్టెంటు ప్రశాంత్ కిషోర్ – ఈ ఐదు శక్తుల మధ్యా తేలుతున్న కాంగ్రెస్ ఏ ఒడ్డుకి చేరుతుందో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కనిపించవచ్చు.

సోనియా, రాహుల్ గాంధీల ప్రాపకం వున్న వాళ్ళ చాలా సందర్భాలలో ”చింతకాయలు రాలేముందు గట్టిగా మంత్రాలు చదివే పాత్రనే” నిర్వహిస్తూ వుంటారు. ఆంధ్రప్రదేశ్ విభజన ఘట్టాలనే ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. వీరప్పమొయిలీ, గులానబీ ఆజాద్, జైరామ్ రమేష్, దిగ్విజయ్ సింగ్ లాంటి నాయకుల్లో రాష్ట్రం విడిపోతుందనీ, విడిపోదనీ సంకేతాలు ఇచ్చిన వారు వున్నారు. విడిపోతుందని చెప్పిన వారి జోస్యం నిజం కావడం వల్ల దిగువ కాంగ్రెస్ వర్గాల్లో వారి పలుకుబడి పెరిగింది. నేరుగా సోనియా నివాసంలోకి వెళ్ళగలగడమే తప్ప ఏఘట్టంలోనైనా మంచి చెడులను చర్చించి అధినాయకురాలిని ప్రభావితం చేయగల సామర్ధ్యం ఇలాంటివాళ్ళకు లేకపోవడమే…అంటే రెండో శ్రేణి నాయకత్వం చచ్చిపోవడమే కాంగ్రెస్ శక్తిహీనమైపోవడానికి మూలం!

పాతతరం నాయకత్వానికి విశ్రాంతి ఇచ్చి యువరక్తం సారధ్యంలో కాంగ్రెస్ ని నడిపించాలన్నది రాహుల్ గాంధీ సిద్ధాంతం. అయితే, దీన్ని అమలు చేయడంలో ఆయన ప్రతీసారీ విఫలమౌతూనే వున్నారు.
ఇందువల్ల పాత నాయకులకు ప్రాధాన్యత తప్పడంలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీపై తిరుగుబాటు చేసి సొంత పార్టీ పెట్టుకోవడం, అస్సాంలో షివంత్ బిశ్వ శర్మ బిజెపిలోచేరడం ద్వారా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ కోలుకోలేని విధంగా దెబ్బతింది. రెండు రాష్ట్రాలతోపాటు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాలలో రాహుల్‌గాంధీ కారణంగానే కాంగ్రెస్‌లో తిరుగుబాట్లు జరుగుతూ వచ్చాయి.

2014లో 14 రాష్ట్రాల్లో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో మాత్రమే వుంది. 2004లో 27 కోట్లమంది ప్రజలు కాంగ్రెస్ పాలనలోవుండగా ఇప్పు డు ఆ సంఖ్య 19 కోట్లకు తగ్గిపోయింది. బిజెపి 12 రాష్ట్రాల్లో అధికారం లోకి విస్తరించింది. 52 కోట్లమంది ప్రజలు ఆ పార్టీ ప్రభుత్వం పాలనలో వున్నారు. కర్నాటకలో తప్ప మరే పెద్ద రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ అధికారంలోలేదు. ప్రతిపక్షాలలో సైతం కాంగ్రెస్ ఒంటరి అవుతున్నట్టు ఈ మధ్య జరిగిన రాజ్యసభ సమావేశాలు సూచించాయి.

ఈ పరిస్థితులనుండి కాంగ్రెస్‌ను కాపాడడం కోసం రాహుల్ గాంధీ స్వయంగా వృత్తినిపుణుడైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఆయనకు ఉత్తరప్రదేశ్ ఎన్నికల వ్యూహ బాధ్యతను అప్పచెప్పారు.

అయితే ఆయన వ్యూహాలు రాహుల్ ఆలోచనలకు విరుద్ధంగా వున్నాయి. ముందుగా ఎన్నికల ప్రచారంలో ప్రియాంక వోద్రా క్రియాశీలంగా పాల్గొనాలని స్పష్టం చేసారు. మరో వంక బ్రాహ్మణులను ఆకట్టుకోవడం కోసం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటింపచేసారు. ఢిల్లీలో దీక్షిత్‌ను పక్కనపెట్టి రాహుల్ గాంధీ గత రెండేళ్లుగా అజయ్ మకన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాహుల్ అయితే యువతరానికి చెందిన జిఎన్ ప్రసాద్, రాజేష్ పతి త్రిపాఠీలలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసేవారు. కానీ జితిన్, త్రిపాఠీలకన్నా షీలా దీక్షిత్‌కు మీడియాలో ఎక్కువ ప్రచారం లభించగలదని ప్రియాంక కూడా భావించారు. ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో రాహుల్, ప్రియాంకల్లో ఎవరి మాట నెగ్గుతుందనేది రేపటి ప్రశ్న.

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌లో ప్రియాంకకు లాంఛనంగా ఎటువంటి పదవి ఇంకా ఇవ్వలేదు. అయితే నిర్ణయాలన్నింటినీ ఆమె తీసుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జిగా రాహుల్‌కు నమ్మకస్తుడైన మధుసూదన్ మిస్ర్తిని తొలగించి గులాబ్ నబీ ఆజాద్‌ను నియమించడం కూడా ఆమె చేసిన ఎంపికయే. రాజ్‌బబ్బర్‌కు రాష్ట్ర పార్టీ సారథ్యం అప్పచెప్పడం కూడా ఆమె నిర్ణయమే. పార్టీ సారథ్యం స్వీకరించగానే ప్రస్తుతం పార్టీలో నిర్ణయాత్మకపాత్ర వహిస్తున్న సీనియర్లు అందరనీ పక్కనపెట్టి, తన యువ బృందంతో పార్టీ నడిపించాలని చాలా నెలలనుండే రాహుల్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ప్రియాంక మాత్రం పాత కొత్తవారి మధ్య సమన్వయం అవసరం అని పట్టుబడుతున్నది.

అందుకనే రాజ్యసభ ఎన్నికలలో రాహుల్‌కోరుకున్న మోహన్ ప్రకాశ్, సిపి జోషి, వంటి వారికి అవకాశం లభించలేదు. ఇప్పుడు రాహుల్‌కు సారథ్యం అప్పచెప్పినా కేవలం ఆయన బృందానికి కాకుండా సీనియర్లకు సైతం తగు ప్రాధాన్యత వుండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పంజాబ్‌లో రాహుల్‌గాంధీ నియమించిన పిసిసి అధ్యక్షుడిని తొలగించి ఆయన దూరంగా వుంచిన కెప్టెన్ అమరేందర్‌సింగ్‌కు పార్టీ సారథ్యం అప్పచెప్పారు. అందుకనే రాహుల్ బృందాన్ని దూరంగా వుంచి పాత వారికి అందలం ఎక్కిస్తున్నారు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో పి.చిదంబరం, కపిల్ సిబాల్ వంటి వారికి అవకాశం లభించడం అందుకు ప్రత్యక్ష నిదర్శనం.
ఏది ఏమైనా రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యేదే ఖాయం. అది ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందా? కాదా? అనే విషయం కాంగ్రెస్ శక్తులు ఇంకా తేల్చకున్నట్టు లేదు!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com