లీక్డ్ ఫొటో: ఎన్టీఆర్ ‘అరవింద సమేత…’

ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేయడం ఎన్టీఆర్‌కి కొత్తేమీ కాదు. ‘ఆది’, ‘సాంబ’ చేశాడు. తాజాగా చేస్తున్న ‘అరవింద సమేత… వీరరాఘవ’ సినెమాదీ ఫ్యాక్షన్ నేపథ్యమే. అయితే… ఇంతకు ముందు చేసిన సినిమాలకు, ఈ సినిమాకి ఒక తేడా వుంది. అదే… త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సీన్లు తీయడంలో త్రివిక్రమ్ స్టయిలే సపరేటు. ‘జల్సా’లో విలన్ ముఖేష్ రుషి పాత్రను తీర్చిదిద్దిన తీరుకి ఎంతో మంది అభిమానులు వున్నారు. ‘అరవింద సమేత…’లో హీరో ఎన్టీఆర్‌ని ఎలా చూపించబోతున్నారో? ప్రస్తుతానికి అయితే ఫ్యాక్షన్ నేపథ్యంలోని స్టిల్ ఒకటి లీక్ అయ్యింది. నాగబాబు ఒంటి మీద, షర్టు మీద రక్తపు మరకలు చూస్తే ఏదో ఫైట్ తరవాత అతణ్ణి రక్షించడానికి తీసుకువెళ్తున్నట్టు వుంది. సినిమాలో ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ ఎంతవరకూ వుంటుందో మరి! ఇందులో నాగబాబు ఫ్యాక్షన్ లీడర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయనది పది నిమిషాల పాత్రే అని తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]