జూన్‌లో టాలీవుడ్ లో కొత్త సినిమాల హడావుడి కనిపించనుంది. మొదట ‘పెద్ది’ వస్తాడు. ఆ తరవాత ‘లెనిన్’ వంతు. జూన్ 24న ‘లెనిన్’ ని విడుదల చేస్తామని చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. ఇప్పుడు ప్రమోషన్లు కూడా మొదలెట్టింది. అందులో భాగంగా టీజర్ విడుదల చేశారు. ఈసారి టీజర్‌కి లవ్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కువ భాగం అఖిల్ – భాగ్యశ్రీ బోర్సేల లవ్ స్టోరీ పైనే ఫోకస్ చేశాడు దర్శకుడు. హీరోయిన్ ఓ స్టేజ్ ఆర్టిస్ట్. పౌరాణికం గెటప్పులో `దాన వీర శూర కర్ణ` డైలాగ్ చెప్పడం, లెనిన్ తన వెంట పడడం, వాళ్ల ప్రేమకథ.. ఇదీ టీజర్ లో చూపించిన విషయాలు.
‘దారి తప్పి రాలేదు.. వెదుక్కొంటూ వచ్చా’ అనే డైలాగ్ లో.. ఈ సినిమా కాన్ఫ్లిక్ట్ దాగుంది. లెనిన్ ఎవర్ని వెదుక్కొంటూ వచ్చాడన్నది ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. సిస్టర్ సెంటిమెంట్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కథలో. దానికి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి. చిత్తూరు యాసలో డైలాగులు పలకడం, నేటివిటీ ప్రతిబింబించేలా ఫ్రేములు పెట్టడం, అఖిల్ క్యారెక్టర్ ని రా అండ్ రస్టిక్ లుక్ లో చూపించడం ఇవన్నీ ఆకట్టుకొనేలా ఉన్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఓ పాట కూడా బయటకు వచ్చింది. ఆ పాట పెద్దగా ఆకట్టుకోలేదు. తదుపరి వచ్చే పాటలపై ఎక్కువ ఫోకస్ చేయాల్సివుంది. ‘పెద్ది’ రిలీజ్ తరవాత.. ప్రమోషన్లలో మరింత స్పీడు పెంచాలని నిర్మాత నాగవంశీ భావిస్తున్నారు.
