లోక్ స‌భ వాయిదా.. అవిశ్వాసం వాయిదా..!

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌ ఇవాళ్ల లోక్ స‌భ‌లో ఉంటుందని అంద‌రూ ఎదురుచూశారు. కానీ, ఇవాళ్ల స‌భ‌లో ఆ చ‌ర్చ ఉంటుందా అనే అనుమానాలు ముందు నుంచీ వ్య‌క్త‌మైన సంగతి తెలిసిందే. అనుకున్న‌ట్టుగానే లోక్ స‌భ రేప‌టికి వాయిదా ప‌డింది. ఉద‌యం స‌భ ప్రారంభ‌మైన ఒక నిమిషంలోపే స‌భ్యులు గంద‌ర‌గోళం చేస్తున్నార‌న్న కార‌ణంతో 12 గంటల వ‌ర‌కూ వాయిదా వేశారు. తిరిగి 12కి స‌భ స‌మావేశ‌మైంది. య‌థావిధిగా కార్య‌క‌లాపాలు మొద‌ల‌య్యాయి. అవిశ్వాసంపై తాము చ‌ర్చ‌కు సిద్ధ‌మే అన్న‌ట్టుగా ముందుగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. ఆ త‌రువాత‌, ఏపీకి చెందిన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, తోట న‌ర్సింహులు తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంలో స‌భ్యులంద‌రినీ ఎవ‌రికి స్థానాల్లో వారు కూర్చోవాలంటూ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ కోరారు.

కానీ, తెరాస‌, ఎఐడీఎంకే స‌భ్యులు వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు. స‌భ‌లో వాతావ‌ర‌ణం ఇలా ఉంటే, అవిశ్వాస తీర్మానంపై తాను ముందుకు వెళ్ల‌లేన‌నీ, చ‌ర్చ‌ను ప్రారంభించ‌లేన‌ని స్పీక‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. వెల్ లో నినాదాలు చేస్తున్న స‌భ్యులు వెన‌క్కి వెళ్తారేమో అని స్పీక‌ర్ కాసేపు వేచి చూశారు. కానీ
ప‌రిస్థితిలో మార్పు లేదు. దీంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో, స‌జావుగా సాగే వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేద‌న్న కార‌ణంతో లోక్ సభను రేప‌టికి వాయిదా వేశారు. ఇక‌, రేప‌టి సభ‌లో ఈ అంశం చ‌ర్చ‌కు రావాల‌న్నా స‌భ స‌జావుగా సాగాల్సి ఉంటుంది. నిజానికి, తీర్మానం ప్ర‌వేశ‌పెట్టి, దీనికి మ‌ద్ద‌తుగా ఎంత‌మంది ఎంపీలు ఉన్నార‌ని స్పీక‌ర్ ముందుగా తెలుసుకుంటారు. ఆ త‌రువాత‌, చ‌ర్చ‌కు అనువైన స‌మ‌యాన్నీ, ఏయే పార్టీల‌కు ఎంతెంత స‌మ‌యం ఇస్తామ‌న్న అంశాన్నీ చెబుతారు. ఇదంతా జ‌రిగాక ఓటింగ్ ఉంటుంది. ఇంత ప్ర‌క్రియ జ‌ర‌గాలంటే ముందుగా స‌భ ఆర్డ‌ర్ లో ఉండాలి.

రేప‌టి ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి…? అయితే, స‌భ‌ను స‌జావుగా నిర్వ‌హించాల్సిన బాధ్య‌త కూడా ప్ర‌భుత్వంపైనే ఉంటుంది. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే… అన్ని పార్టీల‌తో స్పీక‌ర్ స‌మావేశం నిర్వ‌హించాల్సి ఉంటుంది. అంద‌రినీ ఛాంబ‌ర్ కి పిలిపించుకుని, అవిశ్వాసంపై చ‌ర్చ‌కు ప్ర‌భుత్వంగా సిద్ధంగా ఉంద‌నీ, ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేయాలి. కానీ, ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నం ప్ర‌భుత్వం నుంచి ఉంటుందా అనేదే అనుమానం. స‌భ్యులు గంద‌ర‌గోళం చేయ‌క‌పోతే తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని స్పీక‌ర్‌… తీర్మానం ప్ర‌వేశ‌పెడితే తాము నిర‌న‌స‌లు ఎందుకు చేస్తామ‌ని స‌భ్యులూ అంటున్నారు. మ‌రి, రేప‌టి ప‌రిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.