లోకేశ్‌ సమర్థన- చంద్రబాబు సస్పెన్షన్‌! స్వంత జిల్లాలోతండ్రీ కొడుకుల గజిబిజి

చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాదం వెనక కుట్ర వుందనే మాట ప్రతిపక్ష నేత జగన్‌ నుంచే గాక ఇంకా చాలా మంది నుంచి వస్తున్నది. ఇసుక మాఫియా నేరుగా ముడిబడివున్న ఈ కేసులో కేవలం డ్రైవర్లనో క్లీనర్లనో బలిపశువులను చేస్తే సరిపోదు. ధనుంజయనాయుడు, చిరంజీవి నాయుడు మాత్రమే కాదు ఆ మునగాలపాలెం గ్రామమంతా చాలా వరకూ తెలుగుదేశం అనుయాయులే. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో వుండేవారే. అయితే దీర్ఘకాలం పాటు ఇసుకదందా వంటివి చేసి చేసి ఆర్థికంగా బలపడిపోయిన కారణంగా ఇప్పుడు బొజ్జల మాట కూడా వినే స్థితిలో లేరట. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బదులుగా వెళ్లిన మంత్రి లోకేశ్‌ ఇసుక దందాతో తెలుగుదేశంకు సంబంధం లేదన్నట్టు మాట్లాడారు. నిరసన తెల్పిన వారిపై కోప్పడ్డారు కూడా. అయినా పట్టించకోనంత అభిమానం ఆ వూళ్లో టిడిపిపై. జగన్‌ పర్యటన సందర్భంలో జై జై లు కొట్టారని కొందరు అడ్డుకున్నా అది తీవ్ర రూపం తీసుకోలేదంటే పరిస్థితే కారణం. అయితే మంత్రిగా స్వంత జిల్లాకు వచ్చిన లోకేశ్‌ ఘటన తీవ్రతను బట్టి చర్యలు తీసుకునేబదులు మావాళ్లెవరికీ సంబంధం లేదని సమర్థించుకున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన అలా మాట్లాడితే సాయింత్రానికల్లా చంద్రబాబు ఆ ఇద్దరినీ పార్టీనుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.దాంతో లోకేశ్‌ మాట పోయినట్టయింది. పోనీ ఆ చేసే ప్రకటనేదో కొడుకుతోనే చేయిస్తే ఈయనకు కూడా కాస్త గట్టినేతగా పేరొచ్చేది కదా అని కొందరు తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు. అయితే ఈ సస్పెన్షన్‌ కూడా వ్యూహాత్మకమేనని, రేపు వాళ్లమీద చర్య తీసుకుంటే మాకు సంబంధం లేదని చెప్పడానికి ఉద్దేశించిందని మరికొందరు మర్మం చెబుతున్నారు. పైగా వారంతా ప్రధానంగా బొజ్జల అనుచరులు గనక ఆయనకే పదవి తీసేశాక వీరిని పెద్దగా లెక్కపెట్టనవసరం లేదని నాయకత్వం భావించిందట. ఇటీవలే ఎంపి శివప్రసాద్‌ సృష్టించిన దుమారం,బొజ్జల వర్గం అసమ్మతి నేపథ్యంలో ఏర్పేడు ఘటన టిడిపికి మరింత ఇరకాటం అవుతున్నది.సోషల్‌మీడియాపై దాడిలో భాగంగా రవికిరణ్‌ అరెస్టు చర్చ కొనసాగుతుండగానే ఈ దారుణం జరగడంతో టిడిపి ఆత్మరక్షణలో పడింది. తాజాగా ఇప్పుడు హిందూపూర్‌ ఎంపి నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్‌ చెక్‌పోస్టు దగ్గర దౌర్జన్యం చేశారనే వార్త కూడా పాలకపక్షంలో పెరుగుతున్న దౌర్జన్య ధోరణికి అద్దం పడుతున్నది. మరి దీన్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తారా లేక కప్పిపుచ్చడానికే తంటాలు పడతారా? అలా చేస్తే వారికే మరింత నష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com