అన్ని శాఖ‌ల ఫిర్యాదులూ లోకేష్ పేషీకే!

మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌క ముందు నుంచీ నారా లోకేష్ పై ఓ విమ‌ర్శ ఉండేది! అదేంటంటే… త‌న ద‌గ్గ‌రకు వ‌చ్చిన‌వారిని పెద్ద‌గా ప‌ట్టించుకోర‌నీ! పార్టీకి చెందిన ప్రముఖ నేత‌ల‌కే లోకేష్ అపాయింట్మెంట్లు ఇవ్వ‌ని సంద‌ర్భాలున్నాయి. త‌న ఛాంబ‌ర్ బ‌య‌ట గంట‌ల కొద్దీ వెయిట్ చేసిన అనుభ‌వాలూ కొంత‌మంది టీడీపీ పెద్ద‌ల‌కి ఉన్నాయి. ఇక‌, మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన త‌రువాత కూడా ఇదే ప‌రిస్థితి ఉంద‌నీ, త‌నను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన వీఐపీల విష‌యంలో కూడా చిన‌బాబు ఇలానే ఉంటున్నార‌నీ, ఇక క‌ష్టాలు చెప్పుకుందామ‌ని వ‌స్తున్న సామాన్యుల‌కు స‌మ‌యం ఇవ్వ‌డం లేద‌ని కూడా పార్టీ వర్గాల్లోనే చ‌ర్చ జ‌రుగుతూ ఉండేది. ఈ ఇమేజ్ ను మార్చుకునేందుకు ఇప్పుడు లోకేష్ ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, అది కూడా మ‌రో స‌మ‌స్య‌గా మారుతోంద‌ని అభిప్రాయం ఆ పార్టీ వ‌ర్గాల నుంచే వినిపిస్తూ ఉండ‌టం విశేషం!

త‌న వ్య‌వ‌హార శైలిని మార్చుకోవ‌డంతోపాటు, వినిపిస్తున్న‌ విమ‌ర్శ‌ల‌కు అడ్డుకట్ట వేసేందుకు చిన‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌న పేషీకి వ‌చ్చిన‌వారితో వెంట‌నే మాట్లాడుతున్నారు. దీంతో సెక్ర‌టేరియ‌ల్ ఫ‌స్ట్ బ్లాక్ లో ఎంత హ‌డావుడి ఉంటుందో, అంతే హ‌డావుడి ఐదో బ్లాక్ ద‌గ్గ‌ర కూడా ఉంటోంది. ముఖ్య‌మంత్రిని కల‌వడానికి వ‌చ్చిన పార్టీ నేత‌లు, ప‌నిలో ప‌నిగా లోకేష్ ను కూడా ఓసారి ప‌ల‌క‌రించి వెళ్తున్నారు. ఎవ్వ‌రిన్నీ కాద‌న‌కుండా లోకేష్ టైమ్ ఇస్తున్నారు. ఇక‌, సంద‌ర్శ‌కుల విష‌యానికొస్తే.. ఉద‌యం సెక్ర‌టేరియ‌ల్ రాగానే కొంత స‌మ‌యం, మ‌ధ్యాహ్నం వేళ కొంత టైం, సాయంత్రం మూడోసారి, చివ‌ర్లో తాను పేషీ నుంచి బ‌య‌లుదేరుతున్న‌ప్పుడు కూడా ఎవ‌రైనా ఉంటే వారినీ క‌లిసి వెళ్తున్నార‌ట‌! అయితే, అస‌లు చిక్కంతా ఎక్క‌డ వ‌స్తోందంటే.. లోకేష్ ద‌గ్గ‌రకు పెద్ద ఎత్తున విన‌తి ప‌త్రాలు వ‌స్తుండ‌టం! ఇప్ప‌టివ‌ర‌కూ లోకేష్ ద‌గ్గ‌ర‌కు దాదాపు 5 వేల విన‌త‌లు వ‌చ్చాయ‌నీ, వీటిలో లోకేష్ శాఖ అయిన ఐటీ, పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల‌కు సంబంధించిన‌వి 1,242 మాత్ర‌మే అని తెలుస్తోంది. అంటే, మిగ‌తావ‌న్నీ ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించిన ఫిర్యాదులు కావ‌డం గ‌మ‌నార్హం.

త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఫిర్యాదుల‌న్నీ క్రోడీక‌రించీ.. ఏ శాఖ‌కు చెందిన‌వి ఆయా శాఖ‌ల మంత్రుల పేషీల‌కు లోకేష్ పంపిస్తున్నార‌ట‌! దీంతోపాటు, ఇత‌ర శాఖ‌లకు సంబంధించిన ఫిర్యాదులు, విన‌తులు ఏవైనా ఉంటే ఆయా శాఖ‌ల మంత్రుల‌కే ఇవ్వాల‌నీ, అప్ప‌టికీ ప‌రిష్కారం కాక‌పోతే త‌న వ‌ద్ద‌కు రావాలంటూ సంద‌ర్శ‌కుల‌తో లోకేష్ సున్నితంగా చెబుతున్నార‌ట‌! ఇత‌ర శాఖ‌ల‌పై లోకేష్ పెత్త‌నం ఉంద‌నే విమ‌ర్శ‌లు ఎప్ప‌ట్నుంచో ఉన్నాయి. ఇప్పుడు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తులు కూడా లోకేష్ ద‌గ్గ‌రకే వెళ్తుంటే.. ఆయా శాఖ‌ల ఆమాత్యుల ప‌రిస్థితి ఎలా ఉంటుంది..? బ‌య‌ట‌కు చెప్ప‌లేరుగానీ.. వాళ్ల‌కు అనిపించాల్సింది అనిపిస్తుంది క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.