విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ఏర్పాటుకు అడుగులు పడటం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఒక కీలక మలుపు. అయితే, ఈ స్థాయి అంతర్జాతీయ పెట్టుబడులు కేవలం ఒకే రోజులో సాధ్యమైనవి కావు. దీని వెనుక రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ అనుసరిస్తున్న నిశ్శబ్ద వ్యూహం, అంతర్జాతీయ సంస్థలతో ఆయన జరుపుతున్న నిరంతర చర్చల ఫలితమే. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పట్టాలెక్కేలా చేయడంలో ఆయన ప్రదర్శిస్తున్న పనితీరు ఇప్పుడు పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకుంటోంది.
నాడు చంద్రబాబు మైక్రోసాఫ్ట్ కోసం కృషి
గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజం ఏకంగా 1.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ముందుకు రావడం వెనుక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే సూత్రం బలంగా పనిచేసింది. గతంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ సంస్థను తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు చూపిన చొరవను స్ఫూర్తిగా తీసుకున్న లోకేష్, నేడు అదే తరహా విజన్‌తో విశాఖను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా దేశంలోనే మొట్టమొదటి 1,000 మెగావాట్ల హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్‌ను రాష్ట్రానికి రప్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు.
నేడు లోకేష్ ఐటీ మాత్రమే కాకుండా తయారీ రంగాల్లోనూ భారీ పెట్టుబడుల ఆకర్షణ
లోకేష్ పనితీరులో కనిపిస్తున్న ప్రధాన మార్పు ఏమిటంటే, ఆయన కేవలం గూగుల్‌కే పరిమితం కాకుండా ఆర్సెలార్ మిట్టల్, రెన్యూ పవర్ వంటి విభిన్న రంగాలకు చెందిన దిగ్గజాలను వరుసగా ఏపీ వైపు ఆకర్షించడమే. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల స్థాయిని బట్టి చూస్తే, ఐటీ మంత్రిగా ఆయన అనుసరిస్తున్న విదేశీ పర్యటనలు, పారిశ్రామికవేత్తలతో వ్యక్తిగత సంబంధాలు ఫలితాన్ని ఇస్తున్నాయని చెప్పక తప్పదు. ఏపీని దేశానికి ఏఐ & క్లౌడ్ హబ్ గా మార్చాలనే సంకల్పం వెనుక ఆయన చేసిన బ్యాక్ ఎండ్ వర్క్, నేడు శంకుస్థాపనల రూపంలో సాకారం అవుతోంది.
లోకేష్ విజన్ సూపర్ స్ట్రాంగ్
విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మూడు భారీ క్యాంపస్‌ల నిర్మాణం, స్టార్టప్‌లు , స్కిల్ డెవలప్మెంట్కు అనువైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆయన విజన్‌కు అద్దం పడుతోంది. కేవలం ఒక పరిశ్రమను స్థాపించి వదిలేయకుండా, దాని చుట్టూ ఒక ఆర్థిక వ్యవస్థను సృష్టించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. అదానీ, ఎయిర్టెల్ వంటి సంస్థలను భాగస్వాములను చేస్తూ గూగుల్ ప్రాజెక్టును సమన్వయం చేయడంలో ఆయన చూపిన చొరవ, రాష్ట్ర ప్రభుత్వంపై ఇన్వెస్టర్లకు ఉన్న భరోసాను రెట్టింపు చేసింది.
పబ్లిసిటీ కంటే పనులకే ప్రాధాన్యం
స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా లోకేష్ చేపడుతున్న ఈ టెక్నాలజీ విప్లవం ఏపీ భవిష్యత్తును మార్చబోతోంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా డేటా సెంటర్లు, ఏఐ హబ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర యువతకు స్థానికంగానే ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పబ్లిసిటీ కంటే పనులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, సైలెంట్‌గా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లను రాబట్టడంలో లోకేష్ సక్సెస్ అయ్యారనడానికి విశాఖలో జరుగుతున్న ఈ పరిణామాలే సజీవ సాక్ష్యాలు.
