గ్లోబల్ లగ్జరీ కార్ల దిగ్గజాలు తమ బ్రాండ్ పవర్‌ను ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లిస్తున్నాయి. భారతదేశంలో పెరుగుతున్న అల్ట్రా-లగ్జరీ గృహాల డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు లాంబోర్ఘిని, మెర్సిడెస్ బెంజ్ , బీఎమ్‌డబ్ల్యూ వంటి సంస్థలు బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.
భారత్‌లో తొలి లాంబోర్గిని నివాసాలు
ఇటాలియన్ సూపర్ కార్ల బ్రాండ్ టొనినో లాంబోర్గిని ఇప్పటికే భారతదేశంలో తన తొలి రెసిడెన్షియల్ ప్రాజెక్టును ఖరారు చేసింది. గురుగ్రామ్ లోని సెక్టార్ 71లో సిగ్నేచర్ గ్లోబల్ డెవలపర్స్‌తో కలిసి సుమారు రూ. 2,890 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఏప్రిల్ 2026లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో 5 హై-రైజ్ టవర్ల ద్వారా 812 అల్ట్రా-లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. సూపర్ కార్ల ఏరోడైనమిక్ డిజైన్ , ఇటాలియన్ హస్తకళతో రూపుదిద్దుకుంటున్న ఈ ఇళ్ల ధర రూ. 5 కోట్ల నుంచి ప్రారంభమవుతోంది.
హైదరాబాద్‌పై మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ కన్ను
ప్రపంచవ్యాప్తంగా దుబాయ్, మయామి వంటి నగరాల్లో మెర్సిడెస్ బెంజ్ ప్లేసెస్ పేరుతో విలాసవంతమైన టవర్లను నిర్మిస్తున్న జర్మన్ కార్ల దిగ్గజం, ఇప్పుడు తన దృష్టిని హైదరాబాద్‌పై సారించింది. నగరంలోని కొకాపేట ,నానక్‌రామ్‌గూడ వంటి ప్రీమియం ఏరియాల్లో స్థానిక బడా డెవలపర్లతో బ్రాండెడ్ నివాసాల ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అదేవిధంగా బీఎమ్‌డబ్ల్యూ కూడా తన లగ్జరీ లైఫ్ స్టైల్ ఆర్కిటెక్చర్‌ను భారతీయ మార్కెట్‌కు పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా, బ్రాండెడ్ క్లబ్‌హౌస్‌లు, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ , విలాసవంతమైన మౌలిక సదుపాయాలతో కూడిన ప్రాజెక్టులను ఇవి ఆశలు రేపుతున్నాయి.
స్టేటస్ సింబల్‌గా మారుతున్న ఇల్లు
భారతదేశంలో సంపన్న వర్గాల సంఖ్య పెరుగుతుండటంతో, ఇల్లు అనేది కేవలం నివాసం మాత్రమే కాకుండా ఒక స్టేటస్ సింబల్ గా మారుతోంది. గ్లోబల్ కార్ బ్రాండ్లు రియల్ ఎస్టేట్‌లోకి రావడం వల్ల ప్రాజెక్టులకు అంతర్జాతీయ గుర్తింపుతో పాటు అధిక పెట్టుబడి విలువ లభిస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ ఇళ్లలో నివసించే వారికి సదరు బ్రాండ్ అందించే ప్రత్యేక సేవలు, క్యూరేటెడ్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ అందుబాటులో ఉంటాయి. 2026 నాటికి భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రపంచంలోనే బ్రాండెడ్ నివాసాల విషయంలో ఆరో స్థానానికి చేరుకోవడం ఈ ట్రెండ్‌కు నిదర్శనం.
