తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ సాధించిన విజయం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాకుండా, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఏపీలోని మాదిగ సామాజికవర్గం విజయ్ను తమ వాడిగా భావిస్తూ హడావుడి చేయడం వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుల, మత సమీకరణాల చుట్టూ ప్రచారం
తమిళనాడులో విజయ్ తన కులాన్ని గానీ, మతాన్ని గానీ ఎప్పుడూ బహిరంగంగా ప్రదర్శించలేదు. అక్కడ ఆయనను వెల్లలార్ అనే ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తిస్తారు. అయితే, ఏపీలోకి వచ్చేసరికి విజయ్ మాదిగ వర్గానికి చెందిన వారనే ప్రచారం ఊపందుకోవడం వెనుక ఒక పక్కా వ్యూహం కనిపిస్తోంది. విజయ్ తల్లి శోభ కుటుంబ నేపథ్యాన్ని చూపిస్తూ, ఆయనను తమ వర్గ నేతగా ఓ వర్గం సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తోంది. దీనివల్ల ఏపీలోని దళిత సామాజికవర్గాల్లో విజయ్ పట్ల ఒక రకమైన సానుకూలతను సృష్టించే ప్రయత్నం జరుగుతోంది.
కాంగ్రెస్ పునరుజ్జీవన వ్యూహం?
తమిళనాడులో విజయ్ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ఏపీ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. విభజన తర్వాత ఏపీలో తన ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్, ఇప్పుడు విజయ్ ఇమేజ్ ను వాడుకుని తన పాత ఓటు బ్యాంకును తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కీలక ఓటు బ్యాంక్‌గా ఉన్న శక్తిగా ఉన్న దళిత , క్రిస్టియన్ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవడానికి విజయ్ ఒక వారధి గా ఉపయోగపడతారని కాంగ్రెస్ అగ్రనాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో విజయ్ కూడ తన పార్టీని విస్తరిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది.
క్రిస్టియన్ ఓటు బ్యాంకుపై కన్ను
ఏపీలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య చీలిన క్రిస్టియన్ ఓటు బ్యాంకును ఏకం చేసేందుకు విజయ్ ఒక శక్తివంతమైన సాధనంగా కనిపిస్తున్నారు. విజయ్ క్రిస్టియన్ నేపథ్యం ఉన్న వ్యక్తి కావడం, ఇప్పుడు ఆయనకు మాదిగ వర్గ ముద్ర వేయడం ద్వారా రెండు కీలక వర్గాలను కాంగ్రెస్ వైపు ఆకర్షించవచ్చని రాజకీయ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. తమిళనాడులో డీఎంకే పతనం తర్వాత విజయ్ ఎలాగైతే ఎదిగారో, అదే నమూనాను ఏపీలోనూ కాంగ్రెస్ అమలు చేయాలని చూస్తోంది.
ఇమేజ్ పాలిటిక్స్ వర్కవుట్ అవుతాయా?
సినిమా గ్లామర్‌కు కులం, మతం అనే రంగులు పులమడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం కొత్తేమీ కాదు. అయితే, కేవలం ప్రచారం ద్వారానే ఓట్లను రాబట్టడం అంత సులభం కాదు. విజయ్ స్వయంగా ఏపీ రాజకీయాలపై దృష్టి సారిస్తే తప్ప, కేవలం సోషల్ మీడియా ప్రచారాలతో ఆశించిన మైలేజీ రాకపోవచ్చు. ఏదేమైనా, ఒక తమిళ హీరో గెలుపును ఏపీలో తమ కుల విజయంగా మార్చుకోవాలని చూడటం ప్రస్తుత రాజకీయాల్లో మారుతున్న పోకడలకు నిదర్శనం. దీని వెనుక ఉన్న ఈ హిడెన్ అజెండా రాబోయే రోజుల్లో ఏపీలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
