కేటీఆర్ సూచనకు మహేష్ ఓకే

హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్ శాఖమంత్రి కేటీఆర్ అభ్యర్థనమేరకు తెలంగాణలోని ఒక గ్రామాన్ని సూపర్‌స్టార్ మహేష్‌బాబు దత్తత తీసుకోబోతున్నారు. మహేష్ స్వయంగా ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

శ్రీమంతుడు సినిమా విడుదలవగానే స్ఫూర్తిదాయక చిత్రమంటూ కేటీఆర్ మహేష్‌ను అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి పథకం తీసుకువస్తున్న తరుణంలోనే ఈ సినిమా రావటం, ఈ సినిమాలోనూ గ్రామాభివృద్ధి, సామాజిక బాధ్యతవంటి అంశాలను సృజించటం ఎంతో బాగుందని ట్వీట్ చేశారు. దీనికి మహేష్ వెంటనే స్పందిస్తూ థ్యాంక్యూ కేటీఆర్ సర్ అంటూ ట్వీట్ పెట్టారు. కేటీఆర్ నిన్న స్వయంగా మహేష్‌కు ఫోన్ చేసి మళ్ళీ అభినందించారు. శ్రీమంతుడు స్ఫూర్తితో మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక పల్లెను దత్తత తీసుకోవాలని కోరారు. బాగా వెనుకబాటుకు గురైన మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక పల్లెను గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకోవాలని సూచించారు. దీనికి మహేష్ సానుకూలంగా స్పందించారు. తాను సిద్ధమని చెప్పానని, మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తానని ట్వీట్ చేశారు. దీనికిగానూ మహేష్‌కు కృతజ్ఞతలు చెబుతూ నిర్ణయం సామాజిక బాధ్యతను చేపట్టేందుకు మరికొంతమందికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నానని, ఈ పోకడ మరింత పెరగాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

శ్రీమంతుడు చిత్రంలో మహేష్ పాత్ర విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి సొంత గ్రామాన్ని బాగుచేసేందుకు దత్తత తీసుకుంటుంది. ఆ చిత్రం స్ఫూర్తితో తన తండ్రి జన్మభూమి అయిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు మహేష్ ఇటీవల ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com