అభిమానులు మారాల్సిన అవ‌స‌రం ఉంది: మ‌హేష్‌బాబుతో ఇంట‌ర్వ్యూ

‘సూపర్ స్టార్‌…’ అనే ట్యాగ్ లైన్ పెట్టుకోగ‌లిగే అర్హ‌త ఉన్న న‌టుడు, క‌థానాయ‌కుడు మ‌హేష్ బాబు. ఆ న‌వ్వుకి అభిమ‌నులంతా దాసోహం అయిపోతారు. ఆ న‌డ‌క‌, ఆ ప‌రుగు.. ఓ సెప‌రేట్ స్టైల్‌. మ‌హేష్ ఓ హిట్టు కొడితే… ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఒక్క‌డు, పోకిరి, శ్రీ‌మంతుడు సినిమాలు రుజువు చేశాయి. అయితే ఇప్పుడు మ‌హేష్ ఫామ్ కాస్త దారి త‌ప్పింది. వ‌రుస‌గా రెండు ప‌రాజ‌యాలు త‌గిలాయి. దాన్నుంచి తేరుకుని ‘భ‌ర‌త్ అనే నేను’తో మ‌రోసారి అభిమానుల్ని అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ తో చిట్ చాట్ ఇది.

* ఇటీవ‌ల ఎదుర్కున్న ప‌రాజ‌యాల నేప‌థ్యంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల‌న్న ఆలోచ‌న‌తో ఈ సినిమా చేశారా?
– ఏ సినిమాకైనా ఒకేలా ప‌నిచేస్తాం. ప్ర‌తీ సినిమా హిట్ట‌వాల‌ని కోరుకుంటాం. కానీ అన్నిసార్లూ అది జ‌ర‌గ‌దు. భ‌ర‌త్ అనే నేను విష‌యంలో మాత్రం నేను చాలా న‌మ్మ‌కంతో ఉన్నాను. ఇది వ‌ర‌కు ఏ సినిమాకీ లేనంత ధీమా ఈ సినిమాకొచ్చింది. సాధార‌ణంగా నేను సినిమా విడుద‌ల‌య్యాక విహార యాత్ర‌కు వెళ్తుంటారు. ఈసారి ముందే వెళ్లొచ్చేశా. ఈ సినిమా అందించిన న‌మ్మకం అది.

* ఈ సినిమా కోసం సీ ఎం అయిపోయారు.. ఆ ప‌ద‌వి గురించి మీకున్న ఆలోచ‌న‌లేంటి?
– సీఎమ్ అంటే పెద్ద కాన్వాయ్‌.. భారీ హ‌డావుడి అనుకుంటారు. కానీ.. ఓ రాష్ట్రాన్ని కాపాడే ఉద్యోగం అది. చాలా బాధ్య‌త‌తో చేయాలి.

* రాజ‌కీయాలంటే పెద్ద‌గా ప‌డ‌దు అని చెబుతుంటారు. అలాంటి మీరు ఈ క‌థ ఎంచుకోవ‌డానికి కార‌ణం ఏమిటి?
– క‌థే. యేడాది క్రితం కొర‌టాల శివ ఈ క‌థ వినిపించారు. విన‌గానే న‌చ్చింది. దాంతో పాటు భ‌యం కూడా వేసింది. రాజ‌కీయాల‌కు నాకూ ఎలాంటి సంబంధం లేదు క‌దా, ఈ పాత్ర‌ని చేయ‌గ‌ల‌నా అనిపించింది. కానీ కొర‌టాల శివ ఆలోచ‌న‌లు న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్టుకు ఓకే చేశా.

* ఈ సినిమా చేశాక రాజ‌కీయాల‌పై అభిప్రాయం మారిందా? రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న ఏమైనా క‌లిగిందా?
– నాకు సినిమాలంటేనే ప్రాణం. సినిమాల్లోనే ఉంటా. రాజ‌కీయాల గురించి నాకేం తెలీదు. కాక‌పోతే కాస్త అవ‌గాహ‌న మాత్రం పెంచుకున్నా.

* ఈ సినిమాలో పొలిటిక‌ల్ సెటైర్లు ఏమైనా ఉంటాయా?
– అవేం ఉండ‌దు. క‌థ‌లో నిజాయ‌తే ఈ సినిమాని న‌డిపిస్తుంది. ఓ మంచి విష‌యాన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో చెప్ప‌డం కొర‌టాల స్టైల్‌.అది ఈ సినిమాలోనూ క‌నిపిస్తుంది. ముఖ్య‌మంత్రి డాన్సులు చేయ‌డ‌మేంటి? ఫైట్లు చేయ‌డం ఏమిటి? అని ప్రేక్ష‌కులు ఫీల‌య్యే ప్ర‌మాదం ఉంది. కానీ వాటిని కూడా చాలా జాగ్ర‌త్త‌గా డీల్ చేశారు.

* ఈ పాత్ర కోసం ప్ర‌త్యేక‌మైన క‌స‌ర‌త్తేం చేశారా? సెట్లో స‌వాల్ అనిపించిన విష‌యాలేంటి?
– ప్ర‌త్యేక‌మైన క‌స‌ర‌త్తులేం లేవు. కానీ డైలాగులు చెప్ప‌డం క‌ష్టం అనిపించింది. ఈ సినిమాలో పేజీల కొద్దీ డైలాగులు ప‌లికించారు కొర‌టాల‌. వాటిని ముందే ప్రిపేర్ అయి సెట్‌కి వ‌చ్చేవాడ్ని.

* భ‌ర‌త్ అనే నేను.. అనే డైలాగ్ వింటుంటే… కృష్ణ‌గారి గొంతులానే అనిపించింది…
– చాలామంది నాన్న‌గారి గొంతే అక్క‌డ పెట్టాం అనుకున్నారు. కానీ అది నా గొంతే. నాకూ.. అదే ఫీలింగ్ క‌లిగింది. నా గొంతు నాన్న‌గారి గొంతులా ఉందేంటి? అని కొర‌టాల‌ని కూడా అడిగా.. (న‌వ్వుతూ)

* ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు ‘ఈనాడు’ లాంటి సినిమాలేమైనా చూశారా?
– నాన్న‌గారి సినిమాల్లో నాకు ఈనాడు చాలా ఇష్ట‌మైన చిత్రం. దాన్ని ఓ 20 సార్లు చూసుంటా. అందులో నాన్న‌గారు సంభాష‌ణ‌లు ప‌లికే విధానం చాలా బాగుంటుంది. అల్లూరి సీతారామ‌రాజులో కూడా భారీ డైలాగుల్ని ప‌లికారు. ఈ సినిమాలో నా పాత్ర‌పై ఆయ‌న ప్ర‌భావం చాలా ఉంది.

* ఈ సినిమా ప్ర‌జ‌ల్లో మార్పు ఏమైనా తీసుకొచ్చే అవ‌కాశం ఉందా?
– సినిమా అనేది వినోదం. అది మాత్రం ఈ సినిమా త‌ప్ప‌కుండా అందిస్తుంది. సినిమా చూసొచ్చాక కూడా మాట్లాడుకుంటే మంచిదే. రాజ‌కీయాలంటే ఆస‌క్తి, ఓ అభిప్రాయం ఉన్న‌వాళ్లంద‌రికీ భ‌ర‌త్ అనే నేను త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. అయితే స‌మాజంపై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుంది అనేది ఇప్పుడే చెప్ప‌లేను.

* హీరోలం మేం బాగానే ఉన్నాం.. మీరే మారాలి అని అభిమానుల్ని ఉద్దేశించి ఓ మాట అన్నారు. అభిమానుల్లోంచి ఎలాంటి మార్పుని కోరుకుంటున్నారు?
– ఓ హీరో సినిమా విడుద‌లైతే, మిగిలిన హీరోల అభిమానులు దాన్ని కింద‌కి లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది సినిమాకి మంచిది కాదు. అలాంటి అభిమానులంతా మారాల్సిన అవ‌స‌రం ఉంది.

* భ‌ర‌త్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుక‌కు ఎన్టీఆర్ వ‌చ్చారు. మీరే ఆహ్వానించారట క‌దా?
– ఎన్టీఆర్ వ‌స్తే బాగుంటుంద‌ని అంద‌రూ అనుకున్నాం. మేం అడ‌గ్గానే త‌ను వ‌చ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. ఇక మీద‌ట ఇదే ట్రెండ్ టాలీవుడ్‌లో కొన‌సాగుతుంది.

* ప్ర‌యోగాలు చేయాలంటే మ‌హేషే చేయాల‌ని ఎన్టీఆర్ చెప్పారు.. ఇక మీద‌టా ప్ర‌యోగాలు చేస్తూనే ఉంటారా?
– లేదండీ. ప్ర‌యోగాలు చేసీ చేసీ అల‌సిపోయా. ఇక మీద‌ట కూడా చేస్తే నాన్న‌గారి అభిమానులు ఇంటికొచ్చి మ‌రీ కొడ‌తారు (న‌వ్వుతూ). ఇక మీద‌ట క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.