మంచు బ్ర‌ద‌ర్స్ సైడైపోయిన‌ట్టేనా..??

మంచు మోహ‌న్ బాబు వార‌సులుగా తెరంగేట్రం చేసి… యేడాదికి రెండు మూడు సినిమాలు త‌గ్గ‌కుండా చూసుకుంటూ త‌మ కాళ్ల‌మీద తాము నిల‌బ‌డే ప్ర‌య‌త్నం చేశారు.. విష్ణు, మ‌నోజ్‌లు. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రి స్టైల్ వాళ్ల‌ది. నిర్మాత‌లుగానూ మారాల్సి వ‌చ్చింది. మ‌నోజ్ అయితే పాట‌లు రాయ‌డం, పాట‌లు పాడ‌డం, ఫైటింగులు చేయ‌డం లాంటి విద్య‌లు కూడా నేర్చుకున్నాడు. ఎలా కాద‌న్నా… మంచు ఫ్యామిలీ నుంచి యేడాదికి 5 సినిమాలొచ్చేవి. ఎం.బీ కార్పొరేష‌న్ ఆఫీసు ఎప్పుడూ చేతి నిండా ప‌నితో క‌ళ‌క‌ళ‌లాడేది.

అయితే ఇప్పుడు ఈ ఇద్ద‌రు హీరోలూ ఒకేసారి డ‌ల్ అయిపోయారు. అటు విష్ణుకీ, ఇటు మ‌నోజ్‌కీ హిట్లు క‌రువాచిపోయాయి. ఒక్క‌టంటే ఒక్క యావ‌రేజ్ కూడా ప‌డ‌లేదు. హిట్టు మొహం చూసి ఏళ్ల‌కు ఏళ్లు గ‌డిచిపోయాయి. సొంత నిర్మాణ సంస్థ నుంచి సినిమాలు తీసే ఓపిక లేదు. బ‌య‌టివాళ్లు ధైర్యం చేయ‌డం లేదు. విష్ణు సినిమా `ఓట‌ర్‌` ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందో తెలీని ప‌రిస్థితి. త‌న చేతిలొ కొన్ని క‌థ‌లున్నా.. వాటిని ప‌ట్టాలెక్కించ‌డానికి మీన‌మేశాలు లెక్కేస్తున్నాడు. విష్ణు దృష్టంతా వ్యాపారంపై ప‌డిపోయింద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. హైద‌రాబాద్‌లో త‌న‌కో కేర్ స్కూల్ ఉంది. దాని నిర్వ‌హ‌ణ మొత్తం తానే చూసుకుంటున్నాడు. తిరుప‌తిలోని విద్యానికేత‌న్ బాధ్య‌త కూడా త‌న‌పై ప‌డింది. మ‌నోజ్ కూడా అంతే. ప్ర‌స్తుతానికి స‌మాజసేవ‌పై దృష్టి పెట్టాడు. త‌న ద‌గ్గ‌ర‌కు కొన్ని క‌థ‌లు వ‌స్తున్నా… వాటిని ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. మంచు బ్ర‌ద‌ర్స్‌మూడ్ సినిమాల‌పై లేద‌ని, కొంత‌కాలం ఈ గ్యాప్ త‌ప్ప‌ద‌ని ఆయ‌న సన్నిహితులు చెబుతున్నారు. `ఓట‌ర్‌` ఏదోలా బ‌య‌ట‌కు వ‌చ్చి.. అది కాస్త హిట్ట‌యితే త‌ప్ప‌… విష్ణులో జోష్‌రాదు. మ‌రి అది జ‌రుగుతుందా? వెయిట్ అండ్ సీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.