రివ్యూ: ఒక్క‌డు మిగిలాడు

Okkadu-Migiladu-Review
Okkadu-Migiladu-Review

తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5

సినిమాకంటూ కొన్ని ప‌రిమిధులు, ప‌రిధులు ఉంటాయి. అన్ని క‌థ‌లూ వెండి తెర‌పై చెప్ప‌లేం. కొన్ని క‌థ‌లు చ‌దువుకోవ‌డానికి బాగుంటాయి. కొన్ని చెప్పుకోవ‌డానికి బాగుంటాయి. చ‌దువుకొన్న‌, చెప్పుకొన్న క‌థ‌ల‌న్నీ తెర‌పైకి తీసుకురావాల‌నుకోవ‌డంలో ఇబ్బంది ఎదుర‌వుతుంది. సీరియెస్ విష‌యాన్ని చెప్పాల‌నుకొన్న‌ప్పుడు అది మ‌రింత ఎక్కువ‌వుతుంది. ‘శ‌ర‌ణార్థుల‌’ గాథంటేనే చాలా సీరియెస్ విష‌యం. దాన్ని హృద‌యాన్ని హ‌త్తుకొనేలా చెప్పాల‌న్న ప్ర‌య‌త్నంతోనే ‘ఒక్క‌డు మిగిలాడు’ సినిమాని తెర‌కెక్కించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి ఆ ప్ర‌య‌త్నం ఎలా సాగింది? ఈ విష‌యంలో వాళ్లెంత వ‌ర‌కూ విజ‌య‌వంత‌మ‌య్యారు?

క‌థ‌

సూర్య (మంచు మ‌నోజ్‌) ఓ యూనివ‌ర్సిటీ విద్యార్థి. త‌న స‌హ విద్యార్థినులు ముగ్గురు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌తారు. వాళ్ల‌ది ఆత్మ‌హ‌త్య కాద‌ని, హ‌త్య అని… దీని వెనుక మంత్రి కొడుకులిద్ద‌రున్నార‌ని తెలుస్తుంది. వాళ్ల‌ని చ‌ట్టానికి ప‌ట్టించాల‌ని పోరాటం చేస్తుంటాడు. త‌ప్పుడు కేసులు బ‌నాయించి సూర్య‌ని, అత‌ని స్నేహితుల్ని పోలీసులు అరెస్టు చేస్తారు. ఎన్ కౌంట‌ర్ చేసి చంపాల‌ని చూస్తారు. ఈ ఎన్‌కౌంట‌ర్ నుంచి వాళ్లెలా బ‌య‌ట‌ప‌డ్డారు? ఈ సూర్య‌కీ… పాతికేళ్ల క్రితం శ్రీ‌లంక‌లో విప్ల‌వ యోధుడిగా పోరాటం సాగించిన పీట‌ర్ (మంచు మ‌నోజ్‌)కీ ఉన్న సంబంధం ఏమిట‌న్న‌ది తెర‌పై చూడాలి.

విశ్లేష‌ణ‌

శ్రీ‌లంక‌లో ఎల్ టీ టీ ఈ చ‌రిత్ర‌, అక్క‌డి శ‌ర‌ణార్థుల బాధ‌లు తెలిసిన‌వాళ్ల‌కు ఒక్క‌డు మిగిలాడు ప‌రిచ‌య‌మైన క‌థే. ఆ క‌థ‌ని చెప్ప‌డానికి 2017లోని సూర్య క‌థ‌ని వాడుకొంటూ.. ఫ్లాష్ బ్యాక్‌లో శ్రీ‌లంక ఎపిసోడ్ చూపిస్తూ ఈ క‌థ చెప్పాడు ద‌ర్శ‌కుడు. శ‌ర‌ణార్థులు త‌మ ఉనికి కోసం ఎంత పోరాటం చేస్తున్నారో, అటు వ‌ల‌స వెళ్లిన దేశంలో ఉండ‌లేక‌, అటు నుంచి ఇటు రాలేక ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నాడో చూపించాడు.

అయితే సీన్ నెం. 1 నుంచి 60 వ‌ర‌కూ…. ఒకే ఎమోష‌న్‌తో సాగే క‌థ ఇది. ఆ ఎమోష‌న్‌కి ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవ్వ‌క‌పోతే, థియేట‌ర్లో ప్రేక్ష‌కులు కూర్చోగ‌లిగే ఛాన్సే ఉండ‌దు. చ‌రిత్ర‌ని చెప్పేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. డాక్యుమెంట‌రీలా ఉండ‌కూడ‌దు, అలాగ‌ని వాస్త‌వాల్ని మ‌ర్చిపోకూడ‌దు. అజ‌య్ చేసిన క‌స‌ర‌త్తేంటో తెలీదుగానీ… ఎక్క‌వ భాగం శ‌ర‌ణార్థులు – అక్క‌డి సైనికుల పోరాటంపైనే క‌థ న‌డిచింది.

దాంతో.. నిజానికి శ‌ర‌ణార్థులు ఎందుకు త‌యార‌వుతున్నారు? వాళ్ల‌ని ప్ర‌భుత్వం ఎలా వాడుకొంటోంది అనే మూలాల్లోకి వెళ్ల‌లేక‌పోయాడు. దాంతో ఒక్క‌డు మిగిలాడు క‌థ‌కి పూర్తి న్యాయం జ‌ర‌గ‌లేద‌నిపిస్తుంది. సెకండాఫ్‌లో ప‌డ‌వ ప్ర‌యాణం ఈ సినిమాని పూర్తిగా ముంచేసింది. దాదాపు 40 నిమిషాల ఎపిసోడ్ అది. శ‌ర‌ణార్థులు శ్రీ‌లంక నుంచి ప‌డ‌వ‌లో ఇండియాలోకి అడుగుపెట్టార‌న్న విష‌యం ఒక‌ట్రెండు స‌న్నివేశాల్లో చూపించాలి. దాన్నే స‌గం సినిమాగా మ‌ల‌చడంతో క‌థపై ఆస‌క్తి స‌న్నగిల్లుతుంది. ఓ గ‌ర్భిణికి ర‌క్త‌స్రావం అయ్యే సీన్ మ‌రీ మ‌రీ ఇబ్బంది పెట్టింది. క‌త్తెర వేయాల్సిన స‌న్నివేశాలు ఈ సినిమాలో చాలా క‌నిపిస్తాయి. ద్వితీయార్థంలోని ప‌డ‌వ ప్ర‌యాణం పూర్తిగా ఎత్తేసినా బాధేం లేదు.

శ‌ర‌ణార్థుల స‌మ‌స్య‌కీ ఇక్క‌డ సూర్య చేస్తున్న పోరాటానికీ లింకు లేదు. శ‌ర‌ణార్థిగా సూర్య ఇక్క‌డేమైనా ఇబ్బందులు ప‌డుతున్నాడా?? శర‌ణార్థుల కోసం తాను చేసిన పోరాటం ఏమైనా ఉందా? అనేది ద‌ర్శ‌కుడు ఎలివేట్ చేయ‌లేదు. పీట‌ర్‌గా మ‌నోజ్ న‌ట‌న‌, విశ్రాంతి ముందు జ‌రిగే యుద్ధ స‌న్నివేశాలు, అక్క‌డ పండే ఎమోష‌న్ ఒక్క‌టే ఈ క‌థ‌కి బ‌లం. అవి కూడా లౌడ్‌గానే సాగాయి. హింస‌, ర‌క్త‌పాతం ఎక్కువైంది.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌

మ‌నోజ్‌కి క‌చ్చితంగా ఇదో కొత్త అనుభ‌వం. పీట‌ర్‌గా ఆక‌ట్టుకొన్నాడు. సంభాష‌ణ‌లు ప‌లికే విధానం బాగుంది. కాక‌పోతే… చాలా లావుగా క‌నిపిస్తున్నాడు. ఈ పాత్ర కోసం లావుగా మారాన‌ని చెప్పుకోవ‌డానికి వీల్లేదు. ఎందుకంటే పోరాట యోధుడు, విప్ల‌వ వీరుడు సిక్స్ ప్యాక్‌తో క‌నిపించాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌తీ డైలాగ్‌నీ అరుస్తూనే ప‌లికాడు. సూర్య పాత్ర మాత్రం సెటిల్డ్‌గా ఉంటుంది. అనీషా ఆంబ్రోస్ ఓ పాత్ర అంతే. క‌థానాయిక కాదు. ఈ సినిమాలో క‌థానాయిక అనే పాత్రే లేదు. ద‌ర్శ‌కుడు అజ‌య్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తాడు. ప‌డ‌వ ప్ర‌యాణం అంతా త‌న‌దే. తాను న‌టించిన స‌న్నివేశం కాబ‌ట్టి దాన్ని ట్రిమ్ చేసుకోలేక‌పోయాడు. అదే.. ఈ సినిమాకి అతి పెద్ద మైన‌స్‌గా మారింది.

సాంకేతిక వ‌ర్గం

ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకొన్న పాయింట్ మంచిదే. అయితే.. దాన్ని హింస త‌గ్గించి, వాస్త‌విక కోణంలో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తే బాగుండేది. కొన్ని సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకొన్నాయి. నేప‌థ్య గీతంగా వినిపించిన విషాద గీతం హాంటింగ్‌గా ఉంది. సినిమాని వీలైనంత త‌క్కువ బ‌డ్జెట్‌లో తీసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. అందుకే మేకింగ్ విష‌యంలో రాజీ ప‌డ్డారేమో అనిపిస్తుంది.

తీర్పు

సీరియెస్ క‌థ‌లు ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీలా ఉండాలి. సినిమా చూసి.. ఓ ఫీల్‌తో థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు రావాలి. అంత ఫీల్ ఇవ్వ‌డంలో ఈ సినిమా స‌క్సెస్ కాలేక‌పోయింది. అందుకే ఆలోచ‌న మంచిదే అయినా… అది జ‌నాల‌కు చేరే అవ‌కాశం అంతంత మాత్ర‌మే.

ఫైన‌ల్ ట‌చ్ : ముంచేసిన ప‌డ‌వ ప్ర‌యాణం

తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com